కేంద్రానికి తెలంగాణ ఉద్యమ సెగ
posted on Apr 18, 2011 @ 2:19PM
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మే టెన్షన్ ప్రారంభమైంది. మే నెలకు మరో పది రోజులే ఉండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ , సీమాంధ్ర ప్రభావం ఉండకుండా నిరోధించడానికి కేంద్ర బలగాలను మళ్లీ దింపనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి మే 10వ తేది వరకే తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు సమయం ఇచ్చారు. అంతలో కాక పోయినా మే చివరలోగా తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని సొంత పార్టీ ఎంపీలే కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. మే ఆఖరి వరకు తెలంగాణపై తేల్చడమా లేకుంటే రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలుగా మిగలడమా అంటూ వారు కేంద్రానికి తేల్చి చెప్పారు. తెలంగాణ ఇవ్వకుంటే తాము రాజీనామా చేయడం మినహా మరేమీ చేయలేమని చేతులెత్తేశారు. రాజీనామా చేసి సొంత ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. అటు సొంత పార్టీ ఎంపీల హెచ్చరికకు తోడుగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మే 10 వరకు సైలెంట్‌గా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కేంద్రం ఉందని అందుకే మే వరకు ఆగాలని టిఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మే ఆఖరి వరకు కేంద్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టిఆర్ఎస్ హెచ్చరిస్తోంది. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ టిడిపి వంటి పార్టీలు తమను విమర్శించినప్పటికీ సైలెంట్‌గా ఉండిపోతుంది. దీంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మే తర్వాత టిఆర్ఎస్ సైలెంట్‌గా ఉంటే ఇతర పార్టీలు విమర్శించడం మాట అటుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయకుంటే ప్రజలే వారిని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. అందుకే టిఆర్ఎస్ మే తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలనే యోచనలో పడినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రులు ఊరుకునే అవకాశం ఏమాత్రం లేదు. వారు ఉద్యమాన్ని లేవదీయడం, ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి కావడం తథ్యం. ఈ నేపథ్యంలో ఇటు టిఆర్ఎస్, తెలంగాణవాదులు అటు సొంత పార్టీ ఎంపీల ఆల్టిమేటం, మరోవైపు సీమాంధ్రులు ఏం చేస్తారో అన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఏ విధంగా చూసినా మొత్తానికి ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల తర్వాత ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాల్సిందే. అలా ప్రకటించకుంటే ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వెలువడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఎటు తేల్చుకోవాలో పాలుపోని పరిస్థితులో ఉన్న కేంద్రం మళ్లీ పరిస్థితులను చక్క దిద్దడానికి మళ్లీ కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది.