తన ప్రతిష్ట దిగజార్చడానికే: ప్రశాంత్‌భూషణ్
posted on Apr 18, 2011 @ 10:56AM
న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే నేతృత్వంలోని లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీలోని పౌరసమాజ ప్రతినిధులపై ఆరోపణలు పెరుగుతున్నాయి. తాజాగా కమిటీ కో చైర్మన్, న్యాయశాఖ మాజీమంత్రి శాంతిభూషణ్ తన కుమారుడు ప్రశాంత్‌భూషణ్ కోసం పైరవీ చేశారంటూ ఓ సీడీ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తమవైపు తిప్పుకోవడానికి తన కొడుకు సహకరిస్తాడని, అందుకు రూ.4 కోట్లు ఇవ్వాలంటూ సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్‌తో శాంతిభూషణ్ మాట్లాడినట్లుగా సంభాషణలున్నాయి. 2009లో జరిగినట్లుగా చెబుతున్న ఈ సంభాషణను తొలుత అప్పటి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్ ప్రారంభిస్తారు. తనతో పాటు శాంతిభూషణ్ ఉన్నారని, ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాది అని ములాయంసింగ్‌తో చెబుతారు. సుప్రీంకోర్టులో ఆయన పిల్ వేస్తారని, ఆంధ్రాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు జడ్జిని తమ వైపు తిప్పుకోవడంలో ప్రశాంత్ భూషణ్ సహకరిస్తారని ఆయన అంటారు. అనంతరం శాంతి భూషణ్‌తో నేరుగా మాట్లాడాలని చెబుతారు. తర్వాత సంభాషణ ములాయం, శాంతి భూషణ్‌ల మధ్య జరుగుతుంది. తన కుమారుడు ప్రశాంత్ భూషణ్ ఈ పని చేయగలడని ఆయన చెబుతారు. సుప్రీంలో పిల్‌కు ఎక్కువ డబ్బు అవసరం లేదని రూ.4 కోట్లు ఇస్తే సరిపోతుందని చెబుతారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత కర్ణాటక గవర్నర్, నాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి భరద్వాజ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా వ్యాఖ్యానిస్తారు. అయితే సిడిపై ప్రశాంత్ భూషణ్ ఖండించారు.
తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్ర ప్రభుత్వమే సీడీలను సృష్టించిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ములాయం సింగ్, అమర్‌సింగ్‌లతో తన తండ్రి శాంతిభూషణ్ మాట్లాడినట్లు చెబుతున్న సీడీ కల్పితమని చెప్పారు. దేశంలోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ట్రూత్‌ల్యాబ్‌లో దీన్ని పరీక్షించామని, సీడీ బూటకమని ల్యాబ్ డైరెక్టర్ ఎస్ఆర్ సింగ్ కూడా ద్రువీకరించారని చెప్పారు. ఈ సంభాషణలు అతుకుల బొంత అని ప్రపంచంలో నిపుణుడుగా పేరొందిన జార్జ్ పాప్‌కన్ కూడా వీటిని పరీక్షించి చెప్పారని అంటున్నారు. వివిధ సందర్భాల్లో ములాయం, అమర్‌సింగ్, శాంతి భూషణ్‌లు మాట్లాడిన వీటిని అతికించి 1.55 నిమిషాల సీడీని తయారు చేశారని చెప్పారు. అయితే సీడీ వ్యవహారంపై శాంతిభూషణ్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఐపీసీ 469 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంతి భూషణ్‌కు అన్నాహజారే మద్దతు లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీ సహ చైర్మన్ శాంతిభూషణ్‌పై వచ్చిన ఆరోపణలను అన్నా హజారే తీవ్రంగా ఖండించారు. ఆయనకు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు, అమర్ సింగ్‌కు మధ్య జరిగాయని చెబుతున్న సంభాషణల సీడీ కల్పితమే తప్ప అసలుది కాదని ఆయన అన్నారు.