రసకందాయంలో ఖాకీల కుమ్ములాట
posted on Sep 3, 2012 @ 2:52PM
తూర్పుగోదావరి జిల్లాలో ఖాకీల మధ్య కుమ్ములాట మరింత ఉత్కంఠగా మారుతోంది. ఎస్పీ త్రివిక్రమ్ వర్మ గంజాయి స్మగ్లర్లదగ్గర్నుంచి లంచాలు తింటూ తనని వేధిస్తున్నారని బహింరంగ ఆరోపణలు చేసిన ఎఎస్పీ నవీన్ కుమార్ తను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నానంటున్నారు. తాజాగా ఓ డిజి స్థాయి అధికారికికూడా ఇందులో భాగముందంటూ నవీన్ చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపాయి. డిపార్ట్ మెంటర్ ఎంక్వయిరీమీద తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నత స్థానాల్లో ఉన్నఖాకీలు బాహాటంగా బాహాబాహీకి దిగడం, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవడం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తలనొప్పి వ్యవహారంగా తయారయ్యింది. ఉన్న తలనొప్పులకుతోడు మరో కొత్త తలనొప్పిన భరించడానికి సిద్ధంగా లేని హోంమంత్రి జుట్లు పట్టుకుంటున్న ఖాకీలకు గట్టిమాటలతోనే బుద్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలిగానీ, ఇలా రోడ్డునపడి కొట్టుకోవడమేంటంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.