మానిపోయిన గాయానికి మళ్లీ మందెందుకు?
posted on Sep 4, 2012 @ 3:59PM
తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలు కరెంట్ యుద్ధం చేశాయి. విద్యుత్ చార్జీలు తగ్గించాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిపాయి. బషీర్ బాగ్ దగ్గర చాలా పెద్ద రగడ జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమించిన ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నేరుగా ఉద్యమకారులమీద కాల్పులు జరిపారు. నలుగురి ప్రాణాలు పోయాయ్. ఈ ఘటన జరిగి పన్నెండేళ్లైంది. ప్రజలకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు వామపక్షనేతలు ఓ సభని ఏర్పాటుచేయడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం రుచించడంలేదు. అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలెందుకంటూ వామపక్షనేతలమీద టిడిపినేతలు మండిపడుతున్నారు. ప్రజల్లో తమ పార్టీమీద లేనిపోని ద్వేషాన్ని నూరిపోసేందుకే వామపక్షనేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్ హయాంలో జరిగిన ముదిగొండ కాల్పుల ఘటనను ఎందుకు తెరమీదికి తీసుకురావడంలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.