ప్రచారం ఘనం ప్రజాహితం శూన్యం
posted on Sep 4, 2012 @ 3:46PM
ప్రజావైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని ఊదరగొట్టే ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ఉదారత్వం చూపటంలేదు. రాను రాను ప్రభుత్వవైద్యం బజారునపడుతోంది. ఆసుపత్రులకు రావాలంటేనే రోగులు భయపడే స్థితికొచ్చారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఎంపిక చేసిన వ్యాధులకు మాత్రమే ట్రీట్మెంట్ అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత.. ఎన్ని నోటిఫికేషన్లిచ్చినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదు. ఆరోగ్యశ్రీకి నిధులు కరవు.. రోగుల సంఖ్యమాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం బడ్జెట్ లో కనీసం ఏడుశాతం నిధుల్ని వైద్యరంగానికి కేటాయించాలన్న నియమాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు.
మనరాష్ట్రంలో కేటాయింపులు మొత్తం బడ్జెట్ లో నాలుగుశాతం కూడా ఉండడంలేదు. పోయినసారి బడ్జెట్ లో మందులకోసం 320 కోట్ల రూపాయలు కేటాయించారు. అవి లెక్కలకు మాత్రమే పరిమితం. చేతికొచ్చిందిమాత్రం 150 కోట్ల రూపాయలు మాత్రమే. పాతభవనాలు, తుప్పుపట్టిన పైకప్పు రేకులు, ఇనుపమంచాలు చాలా ఆసుపత్రుల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయ్. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లా ఆసుపత్రుల్లో 4400 పడకల సౌకర్యం మాత్రమే ఉంది. 58 ఏరియా ఆసుపత్రుల్లో 5,800 పడకలున్నాయ్. 122 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 4,840 పడకలు, 10 స్పెషలిటీ ఆసుపత్రుల్లో 284 పడకలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 233 ఆసుపత్రులుంటే, వాటిలో 15,864 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పదికోట్లకు దగ్గరపడుతున్న జనాభాకి ఉన్న ఆసుపత్రులు పడకలు ఎలా సరిపోతాయన్న కనీస ఆలోచనకూడా ప్రభుత్వానికి రావడంలేదు. సామాన్యుల పాట్లు సర్కారుకి కనిపించడమే లేదు.