రంగస్వామి మనీసర్కులేషన్ లీలలు?
posted on Sep 4, 2012 @ 4:09PM
మనీసర్కులేషన్ పేరిట పలురాష్ట్రాల్లో మోసాలు జరుగుతున్నాయి. బాధితులు రోడ్డున పడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి మోసపోతున్నారు. నాలుగువేలు కడితే ఏడు వేల రూపాయలు ఏడాది తిరగకుండా ఇస్తామని చెప్పే దొంగమాటల్ని నమ్మి బుట్టలో పడిపోతున్నారు. అసలు ఇలాంటి సంస్థల్లో డబ్బు పెట్టడమే పొరపాటు.. ఆ విషయం తెలిసినా తక్కువకాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చన్న ఆశతో చాలామంది వీటి ఆకర్షణలోపడి మోసపోతున్నారు. వినియోగదారులు అన్నీ తెలిసే మోసపోతున్నారుకాబట్టి మేమేం చేయలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేతులెత్తేసింది.
కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలో రంగస్వామి అనే ఓ పెద్దాయన జనానికి కుచ్చుటోపీపెట్టి కోట్లు వెంటేసుకుపోయిన ఘటన వెలుగులోకొచ్చింది. శ్రీనంది యువజన సమాఖ్య ప్రతినిధి రంగస్వామి.. నాలుగువేలు కట్టండి ఏడు వేలు పట్టుకెళ్లండి అనే స్లోగన్ తో ఎనిమిదినెలల్లోనే పాతికవేలమందితో డబ్బుకట్టించుకున్నాడు. చాలా మంది ఆడవాళ్లు టెంప్టైపోయి బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టుపెట్టిమరీ డబ్బులు తీసుకొచ్చి రంగస్వామి చేతుల్లో పోశారు. చివరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.