రాజధానిలో బోసిపోతున్న పోలీస్ సబ్స్టేషన్లు
posted on Sep 4, 2012 @ 4:28PM
హైదరాబాద్ నగరంలో రోడ్డు మద్యలో సబ్స్టేషన్లని రాసి ఉన్న పెద్దసైజు పోలీస్ బాక్సులను చూసే వుంటారు. జనానికి, పోలీసులకు మధ్య దూరం తగ్గించాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటుచేశారు. హైదరాబాద్, సైబరాబాద్లకు కలిపి సుమారు 90 పోలీస్టే షన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్స్టేషన్కు రెండు సబ్స్టేషన్లను ఏర్పాటుచేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వెంటనే సాయం చేసేందుకు, ఏ నిముషాన ఏం జరిగినా స్పందించేందుకు ఈ స్టేషన్లలో ఇద్దరు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్లు. చైన్ స్నాచింగ్, ఈవ్టీజింగ్, ట్రాఫిక్ లాంటి సమస్యలకు వారు వెంటనే స్పందించటానికి గానూ దూరంలో ఉండే పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండా అందులోనే ఫిర్యాదులు తీసుకునే ఏర్పాటు చేశారు. కానీ.. ఏర్పాటు చేసిన 3 నెలల వరకు మాత్రమే ఇవి సక్రమంగా పని చేశాయి. తర్వాత నిరుపయోగంగా మారిపోయాయ్. కొన్నిచోట్ల అసాంఘిక శక్తులకు నిలయంగాకూడా మారాయన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. వెంటనే వీటిని బాగుచేసి మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలని హైదరాబాదీలు గట్టిగా కోరుకుంటున్నారు.