గురివిందగింజకు కిందేముందో తెలీదు!
posted on Sep 4, 2012 @ 4:13PM
పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలీదు. కానీ.. ఆయన నోరు విప్పితే సొంత భజనతో పాటు సోనియా భజనకూడా చేస్తూనే ఉంటారని కార్యకర్తలు ఖరాఖండిగా చెప్పేస్తారు. బీసీలపై ఉన్నట్టుండి ప్రేమపుట్టుకొచ్చిన బొత్స .. జనాభాప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తారా అంటూ టిడిపికి, వై.ఎస్.ఆర్ . సి.పికి సవాల్ విసిరారు. నిజంగా బొత్సకి బీసీలమీద అంత ప్రేముంటే సొంతపార్టీలోనే ఈ సమస్యను పరిష్కరించి చూపించొచ్చుగా.. మరెందుకని ముందుడుగు వేయడంలేదు.? అసలాయనకు తనెంతకాలం పీసీసీ పీఠంమీద కూర్చుంటారోకూడా తెలీని పరిస్థితి. అంజనం వేసి చూసినా అంతుచిక్కని పరిస్థితి.
నిజంగా బీసీలకోసం పాటుపడాల్సొస్తే క్రెడిట్టంతా పూర్తిగా కిరణ్ కే పోతుంది తప్ప తనకేమీ దక్కదన్న సత్యాన్ని సత్తిబాబు ఎప్పుడో కనిపెట్టేశాడు. అందుకే ఆయనకి ఈ విషయంగురించి ఆలోచించే ఓపికా, తీరికా రెండూ లేవు. తిలో ఉన్న పని చేసుకోవడం చాతకాదుగానీ, ఎదుటివాళ్లని విమర్శించడంమాత్రం బాగా తెలుసు.. అంటూ ప్రతిపక్షాలు సత్తిబాబుమీద మండిపడుతున్నాయ్. కుటుంబసభ్యులతో టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ నిండిపోతున్నాయంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రెండుపార్టీలవాళ్లకూ అరికాలిమంట నెత్తికెక్కేలా చేశాయ్. సోనియా వారసుడిగా రాహుల్ పార్టీ పగ్గాల్ని చేపట్టడానికి ఉత్సాహం చూపించట్లేదా సత్తిబాబూ.. ముందు కింద ఏముందో చూసుకుని తర్వాత ఎదుటివాళ్ల గురించి విమర్శించడం నేర్చుకో అంటూ గురివిందగింజ సామెతను గుర్తుచేస్తున్నారు ప్రతిపక్షాల నేతలు.