‘గోరంత పెంచేసి కొండంత భారం మిగులుస్తున్న మ(మి)థ్యాహ్నభోజనపథకం’
posted on Jun 26, 2012 @ 11:37AM
పాఠశాలల్లో మథ్యాహ్నభోజనపథకం నిర్వహణ వ్యయం పెరిగిపోతోందన్న నిర్వాహకుల ఆందోళన తగ్గించేందుకు ప్రభుత్వం 25పైసలు పెంచింది. ఈ పెంపుదల సమాచారం అందిన తరువాత నిర్వాహకులు గోరంత పెంచి కొండంత భారాన్ని తమపై ప్రభుత్వం పెడుతోందని వాపోయారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి వాస్తవపరిస్థితు లు గమనించకుండానే చర్యలు తీసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నభోజనపథకంలో క్వాలిటీ ముఖ్యమని జిల్లా కలెక్టర్లు, ఇతర అథికార్లు తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అథికార్ల ఒత్తిడి భరించలేక నాణ్యతను పాటిస్తున్న తమకు నిర్వహణ ఖర్చులు చాలటం లేదని మొత్తుకుంటే ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ప్రాథమిక పాఠశాలైతే 16పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలైతే 25పైసలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పెరుగుతున్న ఖర్చులను ప్రభుత్వం గమనించటం లేదన్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.3.84 ఇచ్చేవారని, ఇప్పుడు పెంపుదల వల్ల నాలుగురూపాయలు అయిందన్నారు. అలానే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి రూ.4.40 నుంచి రూ.4.65 వరకూ పెంచారు. ఓ వంద మంది విద్యార్థులున్న పాఠశాలల్లో నిర్వహణావ్యయం వేలల్లో అవుతుంటే ప్రభుత్వం పెంచిన దాని వల్ల లబ్ది ఐదొందల నుంచి 900లోపే ఉంటోందని నిర్వాహకులు వాపోతున్నారు. తమ సొంత జేబుల్లో నుంచి కొంత తీసి పెట్టే పరిస్థితి భవిష్యత్తులో అయినా మారితే బాగుండునని వారు ఆశిస్తున్నారు.