కలెక్టర్లపై బ్లాక్‌మార్కెట్ల తనిఖీ భారం!
posted on Jun 26, 2012 @ 11:43AM
జిల్లా కలెక్టర్ విధివిధానాలు ఏమిటీ? ఈ ప్రశ్నకు పూర్తిస్థాయి సమాచారం అందించటం కష్టం. ఎందుకంటే కలెక్టర్లు ప్రభుత్వం చెప్పిన అన్ని విధులూ అమలు చేస్తారు. కానీ, వారికి జిల్లా మొత్తం పరిపాలనాభారం సమయం మిగల్చదు. అయినా సరే! అన్నింటినీ తన పరిపాలనా సామర్థ్యంతో నెగ్గుకొచ్చి కలెక్టర్‌గా మన్ననలు అందుకున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, వారిపై కొత్తభారాలూ వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు ఖంగుతిన్నారు. ఎందుకంటే కలెక్టర్లకు ఇప్పటికే నగరపాలకసంస్థలను అప్పగించారు. అలానే మండలాలనూ వీరే పాలించాలి. ఎన్నికలు లేక పంచాయతీలూ కార్యవర్గ సభ్యుల కొరతతో అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఈ తరుణంలో సిఎం చెప్పేదేంటంటే కలెక్టర్లు బ్లాక్‌మార్కెట్ల తనిఖీ బాధ్యతలు తీసుకోవాలి. దాన్ని అరికడితేనే రైతులకు విత్తనాలు కొరత, ఎరువుల కొరత ఉండవని సిఎం తేల్చేశారు. అంటే ఇంతకాలంగా బ్లాక్‌మార్కెట్లలో కలెక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నట్లుంది సిఎం ప్రసంగం. మరి ఇది నిజమేనా?