జయమణి ఇక హస్తం' వదలరు?
posted on Jun 26, 2012 @ 11:39AM
జ్ఞానోదయం జరగకపోతే ఓ రాజు బుద్దుడవుతాడా? ఆ కథనే ఆదర్శంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ బోధలు ద్వారా ఎమ్మెల్యేల మనస్సులను మార్చేస్తున్నారట. నిన్నటి దాకా నేను రేపటి నుంచి జంప్‌జిలానీ అంటూ ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడేమో ఈ అద్భుతమైన ‘హస్తం’ వదలలేను అంటున్నారట. అంతే కాకుండా బొత్సా ఏం మందుపెట్టారో తెలియదు కానీ, కాంగ్రెస్‌తో బంధం అస్సలు విడదీయలేనిదని ఆమె కార్యకర్తలకు చెబుతున్నారట. ఇంతకీ ఈమె ఎవరో కాదు పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి. ఇటీవల వై.కా.పా. గౌరవాథ్యక్షురాలు విజయమ్మ పాయకారావుపేట వచ్చినప్పుడు కూడా తాను వై.కా.పా.లో చేరుతున్నానని ఆమె చెప్పారు. బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణరంగారావుతో కలిసి ఆమె తాను పార్టీ మారుతున్నానని ప్రకటించారు. అయితే రంగారావు రాజీనామా చేసి వై.కా.పా.లో చేరిన తరువాత జయమణికి పీసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణ క్లాస్‌పీకారట. అంతే ఆమెకు జ్ఞానోదయమై హైదరాబాద్ బాట పట్టారు. ఆమె మూడు రోజులు అక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీని వదలనని సంఫీుభావం తెలిపాక తిరిగి నియోజకవర్గానికి చేరుకుంటారు. ఇప్పుడు రంగారావు చేసిన ప్రకటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు విజయనగరం జిల్లా నుంచి వై.కా.పా.లో చేరతారన్నారు. అయితే ఒకరు జయమణి. మరి రెండో వారెవరు? ఈ సస్పెన్స్ వీడాలంటే రంగారావు నోరు విప్పాలి. రంగారావు రెండోవ్యక్తిని ప్రకటించకుండా వదిలేసింది బొత్సా దృష్టిలో సస్పెన్స్ మిగులుద్దామనా? లేక నిజంగానే రెండో ఎమ్మెల్యే లేకుండానే ప్రకటించారా? ఒకవేళ ఉంటే ఆయన బొత్సాకు సన్నిహితుడా? వంటి పలు ప్రశ్నలు రాజకీయాభిలాషులను వేధిస్తున్నాయి.