హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్
posted on Jun 26, 2012 @ 4:45PM
నిన్నటివరకు ఎండల్లో వేగిపోయిన హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు వర్షంతో బాధలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జల మయం అయ్యాయి. ఆడవారు, పిల్లలు ఇల్లు చేరటానికి నానా అగచాట్లు పడ్డారు. కార్లు, బైకులు, బస్సులు అన్నీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ జలశయాల్ని గుర్తుకు తెచ్చాయి. పంజాగుట్ట, బేగం బజార్, తార్నాక, సికింద్రాబాద్,ఖైరతాబాద్,మెహిదీపట్నం, ఎర్రమంజిల్, ఓల్డుసిటీ అంతా నీరు నిలిచి పోవడంతో ప్రజలు అవ స్థలు పడ్డారు. సికింద్రాబాద్,తార్నాక, చింతల్‌బస్తీ మొదలైన చోట్ల వర్షపునీరు దుకాణాల్లోకి ఇళ్లలోకి వెళ్లింది. వర్షంపడిన ప్రతిసారీ పరిస్థితి ఇలాగే వుండటం, రోడ్లు చెరువుల్లా మారి ట్రాఫిక్ సమస్యలు పెరగడం మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారటం నగర వాసులను కలవర పెడుతుంది. వర్షాల ప్రారంభంలోనే ఇలా వుంటే రానున్న భారీ వర్షాలకు నగరం ఇంకెలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.