రైతులు, బి.సి.లపై దృష్టి సారిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
posted on Jun 27, 2012 @ 11:31AM
వ్యవసాయక రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు బ్యాంకు రుణాలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వార్తే రైతును సేదతీరుస్తోంది. ఒకవైపు గిట్టుబాటుధర, వ్యవసాయ నిర్వహణభారం వంటి సమస్యలతో కుదేలవుతున్న రైతుకు అప్పులిచ్చే దళారులు చేస్తున్న దోపిడీ నుంచి బ్యాంకర్లు కొంత ఊరట కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతాంగ సమస్యలను బ్యాంకర్లకు వివరించటంతో స్పందించిన బ్యాంకర్లు తమ రుణాప్రణాళిక వివరాలను వెల్లడిరచారు. దీని ప్రకారం2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.110945 రుణాలు ప్రకటించింది. అందులో వ్యవసాయరంగానికి రూ.52972కోట్లు రుణంగా కేటాయించారు. పంటరుణాల కోసం రూ.37128కోట్లు ప్రకటించారు. వ్యవసాయానుబంధ సంఘాలకు రూ.9516కోట్ల రుణాలు అందించనున్నారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.82167కోట్లు కేటాయించారు. ఈ లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు సహకరిస్తారని సిఎం తెలిపారు. రైతులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా రుణం ఇచ్చేలా చూడాలని బ్యాంకర్లను కోరారు. రైతులు అసలు మాత్రమే చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో పెట్టుబడి లేక సాగు ఆలస్యమైన రైతులు రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని, ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చే చర్యల్లో ఇది తొలిఅడుగు అని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు రైతులు, మరోవైపు బిసీలు అండగా ఉంటే ఎన్ని ఎన్నికలైనా ఎదుర్కోవచ్చన్న ధీమా కోసమే సిఎం ఈ చర్య తీసుకున్నారని భావిస్తున్నారు. గతంలో అకాలవర్షం వల్ల నష్టపోయిన రైతులకు వైఎస్ రుణమాఫీని ప్రకటించినట్లే పెట్టుబడులు, నిర్వహణఖర్చులు పెరిగిన సమయంలో సిఎం కిరణ్ ఈ చర్య తీసుకున్నారు.