ఎర్రచందనం స్మగ్లర్లలో వీరప్పన్ అనుచరులు
posted on Jun 26, 2012 @ 5:11PM
మన పొరుగురాష్ట్రమైన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి స్మగర్లు వలస వస్తున్నారు. వీరు ఎర్రచందనం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇటీవల తుపాకులతో తిరుగుతున్న వీరిపై అటవీశాఖ చర్యలకు దిగింది. మొత్తం 160మంది స్మగర్లను అదుపులోకి తీసుకుంది. వారితో పాటు మరో 14మందిని అరెస్టు చేసింది. స్మగ్లర్లు అందరూ తమిళనాడు నుంచి వలస వచ్చినవారే అని అటవీశాఖ గుర్తించింది. అంటే డబ్బు కోసం పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నారన్న మాట. పైగా, ఇక్కడికి వచ్చి ఎర్రచందనం స్మగ్లింగు చేయటం వృత్తిగా ఎంచుకోవటం వెనుక కారణాలు అన్వేషిస్తే...వీరిలో కొందరు వీరప్పన్ అనుచరులు ఉండవచ్చనే అనుమానాలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. అంటే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అలవాటు పడ్డ స్మగ్లర్లే ఇక్కడికి కుటుంబాలతో వచ్చేశారని తెలుస్తోంది.
వీరప్పన్ మరణం తరువాత ఆయన అనుచరులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవానికి స్మగ్లింగు చేసే వారు ఆ సంపాదన (తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన)ను వదులుకోలేక ఏ రాష్ట్రమెళ్లినా అదే వృత్తి ఎంచుకుంటారని నేరపరిశోధనల్లో వెల్లడవుతోంది. అదే వాస్తవమైతే అటవీశాఖ అరెస్టు చేసిన 14మంది ముందు నుంచి ఈ వృత్తికి అలవాటుపడ్డవారే. తమ రాష్ట్రంలో వాతావరణం ప్రతికూలంగా తయారవటంతో ఆంథ్రాకు, ప్రత్యేకించి చిత్తూరుకు వలస వచ్చారు. అరెస్టు చేసిన నిందితులను అటవీశాఖ విచారిస్తోంది. ఈ విచారణలో కానీ, అసలు విషయం తెలియదని, ఎట్టిపరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు తుపాకులు పట్టుకునే వాతావరణం లేకుండా చూడాలని తిరుపతి వాసులు కోరుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన కాల్పుల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లను అదుపు చేయాలని అటవీశాఖకు వారు సూచిస్తున్నారు.