వన్యప్రాణి విభాగానికి సవాల్‌గా నిలిచిన అనంతపురం రైలు ప్రమాదం
posted on Jun 29, 2012 @ 12:16PM
వన్యప్రాణి విభాగానికి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అనంతపురం వద్ద రైలు ప్రమాదం పెనుసవాల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఒక చిరుత, 350గొర్రెలు ఒకేసారి మృతిచెందాయి. అసలే చిరుత జాతి అంతరిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో ఈ సంఘటన వన్యప్రాణివిభాగాన్ని కలవరపెట్టింది. ఒక్కసారిగా 350గొర్రెల మందను వేటాడేందుకు చిరుత రైల్వేలైనుపైకి చేరుకుంది. ఆ మందపై సరిగ్గా చిరుత దూకేసమయానికి ఎక్కడ నుంచో వచ్చిన రైలు ఆ వన్యప్రాణుల ప్రాణాలు హరించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అనంతపురం వద్ద వేసిన రైల్వేలైను దాదాపు అడవి మధ్యలోనే ఉన్నట్లుంటుంది. వన్యప్రాణులు ఈ లైనుపైకి రాకుండా ఎటువంటి భద్రతాచర్యలూ తీసుకోలేదు. అవి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఈ లైనుపైకి వచ్చి పోతుంటాయి. అలానే వచ్చి రైలు ఢీకొనటంతో ప్రాణాలు వదిలేశాయి. ఇది వన్యప్రాణి ప్రేమికులను బాధించింది. ప్రకృతి సమతుల్యతకు ఇటువంటి సంఘటనలు గొడ్డలిపెట్టువంటివని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత జాతి రానురాను అంతరించిపోతోందని, అవి జీవించే స్వచ్ఛమైన వాతావరణ పరిస్థితులు రానురాను తగ్గిపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్‌టైగర్’ అన్న నినాదాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా చిరుతను చంపుతామంటే వద్దని చెప్పాలని వన్యప్రాణివిభాగం కోరుతోంది. అందుకే ఇటీవల తిరుపతి కాలిబాటపై చిరుత ఓ వ్యాపారిని గాయపరిచినా గస్తీ పెంచుతాం కానీ, చిరుతను మాత్రం చంపబోమని అటవీఅథికార్లు స్పష్టంగా తమ నిర్ణయం తెలియజేశారు. బోను వంటివి కూడా అవసరం లేదనీ భద్రత గట్టిగా ఉంటే చిరుత రాదని ఆ శాఖాధికార్లు టిటిడిని ఒప్పించారు. ఎప్పటికప్పుడు అడవుల్లో చిరుతల సంఖ్య తెలుసుకుంటూనే ఆ జాతిని పెంచేందుకు వన్యప్రాణి పరిశోధకులు నడుంబిగించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ నేతాజీ పార్కు నుంచి ఆసియా చిరుతను విశాఖ ఇందిరాగాంధీ జ్యూలాజికల్ పార్కుకు తరలించారు. ఈ మూడు నెలల చిరుత ద్వారా సంతానోత్పత్తి సాధించి ఆ జాతిని పెంచేందుకు కృషి చేయాలని పరిశోధకులు ప్రభుత్వ అనుమతి పొందారు. ఆ చిరుత విశాఖ చేరిన రోజే సోంపేట మండలం అనంతపురంలో ఓ చిరుత రైలు ఢీకొని మరణించింది. రైల్వేలైన్లపైకి వన్యప్రాణులు రావటం సహజమేనని స్థానికులు అంటున్నారు. రాత్రులు చీకటిలో రైళ్లు వెళ్లకుండా శ్రీశైలం అడవిలోకి నిషేధం విధించినట్లే ఈ లైను విషయంలోనూ రైల్వే అధికార్లు నిర్ణయం తీసుకోవాలని వన్యప్రాణివిభాగం కేంద్రరైల్వే మంత్రిత్వశాఖను కోరుతోందని సమాచారం.