తెలంగాణా,ఆంధ్ర నీటిగొడవలు
posted on Jul 1, 2012 @ 10:52AM
దేన్నయినా రాజకీయం చేయగల తెలంగాణానాయకులకు మరో ఆయుధం దొరికింది. ఋతుపవనాలు రాక, వర్షాలకోసం చూచి చూచి వేసారిన కృష్ణా డెల్టా రైతులు, వారు వేసిన నారుమళ్లు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నీరు విడుదల చేయమని కోరారు. వారి అభ్యర్థనమేరకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు అంగీకరించింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నారుమడులకు నీరు వస్తుందని ఆనందించేలోపే తెలంగాణానాయకులు డెల్టాకు నీరందించడాన్ని తెలంగాణ,ఆంద్రా నీటి రగడగా చిత్రీకరించారు. ఒక వేళ అదే జరిగితే అన్నపూర్ణగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్ పట్టెడన్నం దొరకని దుర్బిక్షాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది. ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించి సంగం మందిరైతులు పంట పండిరచడంలేదు. మిగతా రైతులకు గోరిచుట్టుమీద రోకలిపోటులా నాయకులు తెలంగాణ రాజకీయాలకు తెరలేపారు. వారు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సాదాసీదా ప్రజలకొరకు కూడా ఆలోచించ వలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో ఉన్న నీటి గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నీటిగొడవలు మొదలయ్యాయి. తెలంగాణాను ఎండబెట్టి కృష్ణాడెల్టాకు నీళ్లా అంటూ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని లేదంటే టిఆర్‌యస్ ఎమ్మేల్యేలంతా వెళ్లి నీటి విడుదలను అడ్డుకుంటామని టిఆర్ యస్ శాసనసభ ఉపపక్షనేత హరిశ్‌రావు హెచ్చరించారు. కృష్ణాడెల్టాకు 15 టియంసిల నీటిని విడుదల చేస్తూ తెలంగాణాకు దేవుడే దిక్కు అని వాఖ్యానించిన భారీ నీటి పారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తెలంగాణా మంత్రులందరూ జరుగుతున్న నీటి వివక్షకు ఎందుకు స్పందించడంలేదని అక్కసు వెళ్లగక్కారు. సీమాంద్రనాయకుల వల్లే ఇదంతా జరుగుతుందని తెలంగాణా ప్రజల గొంతు తడవకుండా ఇక్కడి నీళ్లు తరలించుకుపోతున్నారన్నారు. సీమాంద్రకు వెళ్లే సాగర్ కుడి కాలువకే నీరు విడుదల చేసి ఎడమకాలువకు ఎండబెడుతున్నారన్నారు. కాగా సాగర్ రిజర్యాయర్‌లో 511 క్యూబిక్ మీటర్ లెవల్ వరకు మాత్రమే నీళ్లున్నాయని దానిలో ఒక అడుగు తగ్గినా హైదరాబాద్‌కు నీళ్లుండవని వివరించారు. నల్గొండ, మహబూబ్‌నగర్,హైదరాబాద్‌లకు తాగు నీరుండదని వెల్లడిరచారు. అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని హామీ ఇచ్చింది. ప్రతియేటా సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు జూన్ మొదటి వారంలోనే నీరు ఇస్తామని ఈ సారి జాప్యం అయిందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.