నిఘా పెంచినా ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్
posted on Jun 29, 2012 @ 2:06PM
ఒకవైపు తమిళనాడు, మరోవైపు కర్నాటక రాష్ట్రాలకు ఆంధ్రాలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు చేరువగా ఉన్నాయి. అందుకే ఈ మూడు జిల్లాలకు ఆ రెండు రాష్ట్రాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు వలస వస్తూనే ఉన్నారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు తుపాకులతో తిరగటం, పోలీసులతో ఎదురుకాల్పులకు దిగటం ఈ మూడు జిల్లాల్లో సంచలనమైంది. దీంతో అటవీశాఖ స్మగ్లర్లను అరెస్టు చేస్తోంది. అలానే కేసులతో వారిని కట్టడి చేస్తోంది. ఈ రెండు చర్యలతో పాటు అటవీప్రాంతాల నుంచి ఈ మూడు జిల్లాల్లోకి ప్రవేశించే వాహనాల తనిఖీలూ ముమ్మరం చేసింది. ఇలానే అనంతపురం జిల్లా తలపుల వద్ద కుర్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం లోడున్న లారీని కొందరు దుండగులు చింతవనంలో వదిలేసి పారిపోయారు. ఎపి02యు9041 నెంబరు ఉన్న ఆ లారీలో పైభాగాన్న అరటిగెలలు వేశారు. వాటి అడుగు భాగాన్న 300 ఎర్రచందనం దుంగలను ఉంచారు. దీని విలువ చాల ఎక్కువని కదరి వెళ్లాక లెక్కలేస్తామని అటవీశాఖ ఆ లారీని తీసుకువెళ్లింది. ఈ సంఘటన స్మగ్లర్లు ఆంధ్రాకు వలస రావటానికే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అయితే వీరి ఆగడాలకు చెక్ చెప్పటం కోసం అటవీశాఖ ఇంకా శ్రమించాల్సిందే. ఎర్రచందనంకు ఉన్న డిమాండు కూడా ఒకేసారి ఎక్కువడబ్బులు సంపాదించాలన్న కాంక్ష ఉన్నవారిని స్మగ్లర్లుగా మారుస్తోంది. వారిని అదుపు చేసి ప్రత్యామ్నాయంగా ఉపాథిదారికి మళ్లించే దిశలో ప్రభుత్వం యోచించి ప్రయత్నించాలని సూచనలు వస్తున్నాయి.