తాడిపత్రిలో ఎరువుల శాంపిల్స్ సేకరణలో నాటకం?
posted on Jun 29, 2012 @ 2:01PM
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో తాడిపత్రి ఓ పెద్ద జంక్షన్. ఇక్కడ ఎరువుల వ్యాపారం మూడుపువ్వులూ ఆరుకాయలులా విరాజిల్లుతోంది. వ్యాపారులూ అక్రమాలకు పెట్టింది పేరుగా చెలమణి అవుతున్నారు. వీరి ఆగడాలు అరికట్టాల్సిన వ్యవసాయాధికారి ఏడేళ్లుగా ఇక్కడే ఉంటూ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అసలు మామూలుగా అయితే ఈయన తనిఖీ చేయరు. ఒకవేళ ఎవరి ఒత్తిడిపైనైనా తనిఖీ చేస్తే మాత్రం నాణ్యమైన ఎరువులనే శాంపిల్స్‌గా సేకరించి పరిశీలనకు పంపిస్తారు. ఈ శాంపిల్స్ నాటకంలో నాణ్యమైన దాని పక్కనే ఉన్న కల్తీ ఎరువుల శాంపిల్ అసలు సేకరించరు. ఒకవేళ సేకరించినా పైకి మాత్రం పంపించరు. వ్యాపారులతో కలిసిపోయిన ఈ అధికారి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో ఇక్కడ రైతుల గోడు అరణ్యరోదనే అవుతోంది. మంత్రులు హెచ్చరించినా అధికారి వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించి రెండు షాపుల్లో స్టాకును సీజ్ చేశారు. అయినా సరే వ్యాపారులు బరితెగించినట్లు ఎరువులను ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. ముందు వ్యవసాయాధికారినైనా మార్చండి లేదా వ్యాపారులనైనా కట్టడి చేయాలని జిల్లా అధికార్లకు రైతులు మొరపెట్టుకుంటున్నారు.