లెక్కతేలని ఆ 49 యూనిట్ల సూదిమందు చేతివాటమేనా
posted on Jun 29, 2012 @ 2:12PM
అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రి అక్రమాలకు నెలవుగా మారింది. ఇక్కడ డయాలసిస్ తరువాత మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు చేసే సూది మందులో 49యూనిట్లు లెక్కతెలియకుండానే మాయమైంది. ఒకవేళ ఇక్కడికి వచ్చే రోగులకు ఇచ్చి ఉంటే రిజిష్టర్‌లో బంధువుల సంతకాలైనా కనిపించేవి. ఎటువంటి సంతకాలూ లేకుండా ఈ యూనిట్లు ఎలా కాజేశారనే అంశంపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సూదిమందు యూనిట్‌కు రూ.1200 ఖర్చు అవుతుంది. అంతఖరీదైన సూది మందు ఏమైందని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రధానస్టోరు నుంచి రెండు విడతలుగా ఈ సూదిమందును 432 యూనిట్లు పంపిణీ చేశారు. డయాలసిస్ తరువాత రోగికి అక్కడే సూది మందు చేస్తారు. అప్పుడు బంధువులు రిజిష్టర్‌లో సంతకం చేస్తారు. ఒకవేళ బయటకు ఇచ్చినా కూడా బంధువుల సంతకం రికార్డు అవుతుంది. సూదిమందు పంపిణీకి, వాడకానికి మధ్య వ్యత్యాసం 49యూనిట్లు కొట్టొచ్చినట్లు కనిపించటంతో కలెక్టర్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.