సి.బి.ఐ. మాన్యువల్స్ ఉల్లంఘించి పుల్‌గా బుక్కయిన లక్షీనారాయణ
posted on Jul 8, 2012 @ 6:49PM
కాలం కలసివస్తే మనం చేసేది ఏదైనా చెల్లుబాటవుతుంది .చెల్లుతుంది కదా అని ఏమైనా చేసేసి ఏమౌతుంది అనుకుంటే ఏదో ఒక రోజు అందుకు తగ్గ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అవినీతిపరుల పాలిట ఆరివీర భయంకరుడుగా పేరు తెచ్చుకున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ హైకోర్టుకు చిక్కారు. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక ఉన్నతాధికారికి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏముంటుంది. అంతమంది అవినీతి పరుల్ని విచారణచేపట్టిన ఆఫీసరుగారికి ఎలా చట్టానికి చిక్కిపోతామో తెలియకనా లేదా మనల్ని ఎవరేమి చేస్తారని భరోసానో తెలియదు గాని ఉన్నదున్నట్లుగా సమాచారాన్నంతటిని లీకు చేయటమేమిటి. దీని వెనుక పాత్ర ఎవరిదో కూడా కోర్టు విచారణ చేపట్టవలసి ఉంది. ఈ కేసుకే ఇలా జరిగిందా ఇంతకు ముందు కేసుల్లో కూడా ఇలాంటి తతంగం జరిగిందో కూడా కోర్టులు పరిశీలించవలసి ఉంది. వెనకటికి ఒక ఇల్లాలు ఇంటికి నిప్పుపెట్టి అత్తా నాకు భయమేస్తుంది అన్నట్లు చేసిందంతా చేసిన లక్ష్మీనారయణ తన పర్సనల్ కాల్స్‌ని ట్రాప్‌చేసి నాఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఎదురు కంప్లెంట్ ఇవ్వటం విశేషం.
విజయవాడలో పోలీస్‌కమీషనర్ గా పని చేసిన రామాంజనేయులు వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటించినప్పటికిని ఆయన సెల్ నుండి వేరే వారికి ఫోన్లు వెళ్లాయని ఎంత రగడ జరిగిందో తెలిసి ఇంతగా ఎలా తెగబడ్డారో తెలియటం లేదు. లక్ష్యంవైపు పరుగులు తీసి లక్ష్యాన్ని చేరుకోగానే ఎందుకు దిగజారతారనే విషయం ఎంతకీ అంతుబట్టటం లేదు. సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన లక్ష్మీనారాయణ సిబిఐ నిబంధనలు అంతగా ఎందుకు తుంగలో తొక్కారో అర్ధంకాదు. సిబిఐ దర్యాప్తు జరిపే సమయంలో ఇష్టం వచ్చిన వారికి సమాచారం చెప్పేస్తే కుదరదని సిబిఐ మాన్యువల్ చెబుతోంది. కీలకమైన కేసుల్లో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు గాని దానికి సంబందించిన నిందితులను అరెస్టు చేసినప్పుడు మాత్రమే సంబందిత విషయాన్ని సిబిఐ లో సూపర్నిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్న అధికారి కాని, ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో అధికారి గాని, ప్రెస్‌నోట్ ద్వారా సమాచారాన్ని ఇవ్వవచ్చని సిబిఐ మాన్యవల్‌లోని 24:13:1 లో పేర్కొన్నారు. జాయింట్ డైరెక్టర్ స్ధాయి అధికారి అసలు సమాచారం లీక్ చేయకూడదని సిబిఐ మాన్యువల్ లోని 24 :31 స్పష్టంగా చెబుతుంది.
ఒక వేళ ఎవరైనా విలేకర్లు సమాచారం అడిగినా సమాచారం ఇచ్చే అధికారం తనకు లేదని సి.బి.ఐ.లోని డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసరుకు మాత్రమే ఆ అధికారం ఉందని వారు విలేకర్లకు చెప్పవలసి ఉంది. ఏదో నోరుజారి ఒక విషయం బయటికి వచ్చిందనుకుంటానికి కూడా లేకుండా తుమ్మింది దగ్గింది కూడా వెళ్లిందంటే ఇది ఆశామాషీ విషయం కాదని తెలుస్తుంది. విచారణ సమయంలో ఏదైనా లీకు అయ్యిందంటే సామాన్యంగా క్రింది స్ధాయి ఉద్యోగులెవరి మీదకైనా అనుమానం వస్తుంది. అయితే కాల్ లిస్టులో నెంబర్లు లక్ష్మీనారాయణ అఫీషియల్ ఫోను నుండే వెలువడటం ఆయన నైతికతను ప్రశ్నింస్తుంది. అదీ చిన్న స్దాయి రిపోర్టర్లకు ...ఏదో మర్డర్ కేసుల్లో కాస్తోకూస్తో అవాస్తవాలను చొప్పించి క్రైంస్టోరీలు తయారు చేసే ఒకే వర్గానికి చెందిన విలేకర్లకు చెప్పటం...ఇప్పుడు ఇదే వర్గం జగన్‌కు నార్కోఎనాలిసిస్ టెస్టులు జరపమంటం కూడా ఏదో కుట్ర వుందనే అనుమానాలకు తావిస్తుంది. మీడియాదేముంది ఇష్టమయితే నెత్తికెక్కించుకుంటుంది. కాదనుకుంటే కాళ్లతో తొక్కుతుంది. కాని రేపు విచారణంటూ చేపడితే సోకాల్డ్ మీడియా ఎంత వరకు లక్షీనారాయణ వెంటనడుస్తుందనేది ప్రశ్నార్ధకమే!