మాజీ మంత్రి మోపిదేవికి న్యాయ సహాయం చేయాలి: మంత్రి బొత్స
posted on Jul 8, 2012 @ 2:33PM
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు న్యాయ సహాయం చేయాల్సిందేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం అన్నారు. వివాదాస్పద జివోల జారీ వ్యవహారంలో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవికి కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని కోరుతూ తాను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా లేఖ రాస్తానని చెప్పారు.
వివాదాస్పద జివోల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొన్నాలకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మోపిదేవికి సహాయం లేకపోవడంపై బొత్స స్పందించి, సిఎంకు లేఖ రాస్తానని ఈరోజు చెప్పారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిలతో తమకు సంబంధం లేదని బొత్స అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో వారు ఎవరికి ఓటేస్తారో తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలోపే పిసిసి కార్యవర్గ నియామకాలు ఉండవచ్చునని చెప్పారు.