వర్షం కోసం ఎదురు చూస్తున్న వాన్‌పిక్‌భూముల రైతులు?
posted on Jul 9, 2012 @ 12:40PM
నిన్న సొంతం చేసుకున్న వాన్‌పిక్‌భూముల్లో నేడు సాగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులందరూ సమైక్యంగా వచ్చి ఆ భూముల్లో దుక్కిదున్నారు. వర్షాధారంపై పండే ఆ భూము ల్లో విత్తనాలు నాటేందుకూ రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షం రావటమే ఆలస్యమని ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ సంస్థ కోసం సేకరించిన భూముల వల్ల తాము నష్ట పోయామని రైతులు కంచెను తొలగించి భూమిని సొంతం చేసుకున్నారు. గతంలో లాగ గట్లు కట్టుకుని ఎవరి పొలం వారు విడదీసుకున్న రైతులు ట్రాక్టర్ల సహాయంతో దుక్కి దున్నారు.
వర్షం వస్తే విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఈ రైతుల చైతన్యం ఆదర్శప్రాయమని జిల్లాలోని రైతుల సంఘాలు కొనియాడుతున్నాయి. రైతుల్లో ముఖ్యంగా చైతన్యం కొరవడి ప్రభుత్వాలు, వ్యాపారులు కూడా నష్టపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారన్న వార్త దావానంలా వ్యాపించింది. దీంతో తమ భూములను సొంతం చేసుకున్న రైతులకు జిల్లాలోని పలుప్రాంతాల నుంచి సంఫీుభావం ప్రకటించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్ ఏరువాక సాగించిన భూముల్లోనే రైతులు ఈ సాగుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అసలు ఇక్కడ రైతులు సాగు చేస్తుంటే అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే ఏమి చేస్తారన్న ఆసక్తి కొద్ది కొందరు రైతులు దుక్కి దున్నేంత వరకూ వేచి చూశారు. ఎటువంటి అలికిడి, అలజడి లేకపోవటంతో సందర్శనకు వచ్చిన వారు సాయంత్రం తిరిగి వెళ్లారు.