ఒంగోలు, భీమవరం డంపింగ్‌యార్డులపై హైకోర్టు ఆగ్రహం?
posted on Jul 7, 2012 @ 2:21PM
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగరపాలక సంస్థలు తమ డంపింగ్‌యార్డులను పంచాయతీల స్థలంలో ఏర్పాటు చేయటంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం శుభ్రంగా ఉంచేందుకు సేకరించిన చెత్తను పంచాయతీల పరిథిలో పోస్తే అది గ్రామాలను కలుషితం చేస్తోందని వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. జస్టీస్ వివిఎన్ రావు, జస్టీస్ కృష్ణమోహనరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ రెండు కార్పొరేషన్లు తమ పరిధిలో వేసుకోవాల్సిన చెత్తను పంచాయతీల్లో పోయటం వల్ల అక్కడ సాగునీటి వ్యవస్థకు ఇబ్బంది ఎదురవుతోందని గుర్తించింది.
అంతేకాకుండా అనారోగ్యం ప్రబలే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయాన్ని కూడా హైకోర్టు ఏకీభవించింది. నగర పరిధిలోనే కార్పొరేషన్లు చెత్త వేసుకోవాలని డంపింగ్‌యార్డులను తొలగించాలని ఒంగోలు, భీమవరం కార్పొరేషన్లకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. పర్యావరణ పరిరక్షణ సమితి ఇచ్చిన అనుమతులను కూడా ధర్మాసనం రద్దు చేసింది. పర్యావరణ పరిరక్షణ సమితి ఇకపై ఇటువంటి అనుమతులు ఇవ్వరాదని, పంచాయతీలకే పోరంబోకుభూములపై అధికారమున్నందున తక్షణం డంపింగ్‌యార్డులు మార్చాలని ఆదేశించింది.