ఏపీకి వెళ్లలేక ఉద్యోగుల ఏడుపులు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే ఒకపక్క సీఎం గారు ఎంత చెప్పినా.. కొంత మంది మాత్రం ఏపీకి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎన్ని రకాలుగా వసతులు కల్పించినా వారు మాత్రం ససేమిరా ఉంటున్నారు. ఆఖరికి వారు ఏపీ వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ సచివాలయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం.. ఏపీ ఉద్యోగులు కొంతమంది ఈరోజు బస్సెక్కారు. ఇక ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్న కారణంగా.. తెలంగాణ ఉద్యోగులతో ఏర్పడిన బంధం వల్ల.. వారిని విడిచి రాలేక.. వీరు కూడా వారిని వదులుకోలేక.. ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించక తప్పదు కాబట్టి భారమైన హృదయాలతోనే ఏపీ ఉద్యోగులు బస్సెక్కగా, అంతకంటే భారమైన మనసులతో తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. కాగా ఇప్పటికే రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. తుది దశకు చేరుకుంది. అప్పుడే పలు శాఖల కార్యాలయాలు కూడా అమరావతికి తరలివెళ్లాయి. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి.. ఇప్పుడు ఏపీకి వెళ్లమంటే ఉద్యోగులకు కూడా కష్టమైన పనే..

హరీశ్ దేవినేని నీటి వివాదం.. పంతం నీదా నాదా..

  నీటి కేటాయింపులపై ఏపీ, తెలంగాణకు మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి ఇరు రాష్ట్రాల మంత్రులు కేంద్రం వద్ద చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇరువురి వాదనలు ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకంగా ఉన్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిలో ఎవరూ కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. కనీసం ఒక్కరైనా తగ్గితే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ఎంతైనా మంత్రులు.. అందునా కొట్టుకొని మరీ విడిపోయిన వాళ్లం.. ఇంకా ఎందుకు తగ్గుతారు. ఒక పక్క కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని హరీశ్ రావు అంటుంటే.. తమ పరిధిలోని ప్రాజెక్టుల గేట్ల వద్ద తమ పోలీసులు పహారా కాయడాన్ని కూడా తెలంగాణ తప్పుబడుతున్నదని, ఇదెక్కడి న్యాయమని ఆయన ఏపీ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని దేవినేని తేల్చిచెప్పారు. ఈ రకంగా ఇద్దరూ వాదించుకున్నదే.. వాదించుకుంటూ ఈసారి భేటీ కూడా అర్థాంతరంగానే ముగించేశారు. పైకి మాత్రం, దేవినేని ఉమ తెలంగాణపైనా.. హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ మీదా మమకారం కురిపించేస్తున్నారు. 'అందరం తెలుగువారమే..' అని ఇద్దరూ చెబుతున్నారు కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ ప్రచారం చేసేశారు. ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయిపోయారు. మరి ఈ నేపథ్యంలో ఈ వివాదం ముగియడం కష్టమే అని అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం...

గాయం కుడికాలికి... ఆపరేషన్ ఎడమకాలికి

  వేలకు వేలు డబ్బులు కుమ్మరించి కార్పోరేట్ ఆస్పత్రులకు వెళుతుంటాం. కానీ వారి నిర్లక్ష్య ధోరణితో ఎంతో మంది ప్రాణాలతో చెలగాటాలు ఆడేస్తుంటారు. అలా ఒక కాలుకు చేయాల్సిన ఆపరేషన్ ఇంకో కాలుకి చేసి తమ నిర్లక్ష్య ధోరణిని నిరూపించారు ఢిల్లీ ఆస్పత్రికి చెందిన వైద్యులు. వివరాల ప్రకారం.. ఢిల్లీ అషోక్ విహార్ ప్రాంతానికి చెందిన రవిరాయ్ అనే సీఏ విద్యార్ధి ప్రమాదవ శాత్తు మెట్లపై నుండి కింద పడ్డాడు. దీంతో అతని తల్లి దండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సీటీ స్కాన్, ఎక్స్ రే లు వంటివి తీసి కాలి చీలమండలం వద్ద ఫ్రాక్చర్ అయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయడానికి సిద్దమయ్యారు. అతనికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇక రవిరాయ్ కు స్పృహ వచ్చిన తరువాత చూసుకుంటే దిమ్మతిరిగిపోయింది. తనకు గాయమైంది కుడి కాలికి అయితే.. వైద్యులు ఆపరేషన్ చేసింది ఎడమకాలికి. దీంతో అతని తల్లిదండ్రులు డాక్టర్లను నిలదీయగా.. జరిగిన తప్పిదానికి ఆస్పత్రి విచారం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంది. దీంతో రవిరాయ్ తల్లిదండ్రులు వెంటనే అతనిని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రవిరాయ్ తండ్రి మాట్లాడుతూ.. ఇందులో పూర్తిగా నిర్లక్ష్యం ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, భారతీయ వైద్య మండలి, ఢిల్లీ వైద్య మండలిని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

నీ పని నువ్వు చూసుకో స్వామి.. అరుణ్ జైట్లీ

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. నిరంతరం ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకూ రాజన్ పై విమర్శల వర్షం కురిపించిన స్వామి.. ఇప్పుడు ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరవింద్ కాంగ్రెస్ నేత అని.. తక్షణం ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ స్మామి ఆరోపణలను తోసిపుచ్చారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా సుబ్రమణియన్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, నిరాధార ఆరోపణలు చేస్తూ, అడగని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇకపై ఉచిత సలహాలు ఇవ్వడం ఆపాలని హితవు పలికారు. మరి స్వామి, అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

కృష్ణాలో వైసీపీ ఖాళీ అవుతుందా..?

  ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఇప్పుడు ఆపార్టీకి మరో భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అది కూడా వైసీపీకి పట్టు ఉన్న జిల్లాగా పేరు పొందిన కృష్ణాజిల్లానుండి. అయితే వైసీపీ ఎమ్మెల్యలు టీడీపీ లో చేరుతున్నట్టు స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుచ్చల అర్జునుడు. వైసీపీ నుండి ముగ్గరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని.. అందులో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. మరి ఆయన చెప్పినట్టు వారు టీడీపీలో చేరుతారో లేదో చూడాలి.   కాగా రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో మొన్నటిదాకా వలసల పర్వం జరుగగా బలహీనపడిపోయిన వైసీపీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా పార్టీ ఫిరాయింపులు జరిగితే మరింత బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది. మరి జగన్ వారిని బుజ్జగించేందకు ప్రయత్నిస్తారా.. లేక పోతే పోని అని వదిలేస్తారా.. చూడాలి.

టీడీపీలో అసంతృప్తి.. మళ్లీ వైసీపీ దారి..

  ఏదో ఆవేశంతో వేసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు కానీ. కొంత మంది నేతల్లో ఎక్కడ ఓ దగ్గర అసంతృప్తి మాత్రం ఉందని చెప్పొచ్చు. అలా వెళ్లిన నేతలే కొంత మంది ఇప్పుడు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ఎంపీపీ, ఎంపీటీసీలు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. అంతేకాదు తిరగొచ్చిన వారు ఇటీవల టీడీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి తమపై ఒత్తిడి చేసి తీసుకెళ్లి, టీడీపీ కండువాలు కప్పించారని.. ఆరోపించారు. ఇక వీరి రాకతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇంకా చాలా మంది నేతలే టీడీపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్నారు.. వారు కూడా త్వరలోనే పార్టీలోకి వస్తారని అన్నారు. ఏ అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తున్నారని ప్రజల అభివృద్ధి కోసమా? లేక స్వీయ అభివృద్ధి కోసమా? అన్నది చెప్పాలని విమర్శించారు.

అప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎంత చిరాకు పెట్టిస్తున్నారో తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఆయన మాటల్లో ఇప్పటికే చాలాసార్లు అర్ధమైంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, జగన్ పై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్ధిక లోటులో ఉండగా రుణ విముక్తి చేయడం అనేది మామూలు విషయం కాదని.. అలాంటిది తాను లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ రైతులకు లక్షన్నర రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని..  ఒక‌ప్పుడు వైఎస్‌, ఇప్పుడు జ‌గ‌న్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయ‌న అన్నారు. ఎన్ని క‌ష్టాలు ప‌డ్డా మ‌న‌కు అన్నాన్ని పెడ‌తాడు.. అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మ‌ర‌వ‌బోం’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దికి అందరూ కలిసి రావాలి.. నేను ఒక్కడినే కష్టపడితే రాష్ట అభివృద్ధి సాధ్యం కాదు.. అని వ్యాఖ్యానించారు.

యువతిని తాళ్లతో కట్టేసి, లాక్కెళ్లి.. ఖాకీల దాష్టీకం..

  రాజస్థాన్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కనీసం ఓ అమ్మాయి అని కూడా చూడకుండా అధికారం ఉంది కదా అని ఖాకీలు దారుణానికి ఒడిగట్టారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ లోని గర్వాకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్ పట్టణం అల్వార్ లోని బ్యాంక్ కాలనీకి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. అయితే వరకట్నం వేధింపులు వల్ల ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె తన వదిన కుటుంబంపై కేసు పెట్టింది. దీంతో డౌరీ హరాస్ మెంట్ కేసు నమోదు చేసుకున్న గర్వా పోలీసులు తన వదిన అయిన అపర్ణను అరెస్ట్  చేశారు.. ఆమెను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలోనే అపర్ణ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడే మన పోలీసులు రెచ్చిపోయారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను తిరిగి పట్టుకున్నారు. మళ్లీ పారిపోకుండా ఉండేందుకు  నడుము చుట్టూ తాళ్లతో కట్టి లాక్కెళ్లారు. కొద్దిసేపు అల్వార్ రైల్వే స్టేషన్ లోనే ఆమెను కూర్చోబెట్టారు. అంతే పోలీసులు చేస్తున్న ఈపనిని చూసి కొంతమంది ఆశ్చర్యపోగా..మరికొంత మంది ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది ఇప్పుడిది వైరల్ అయింది. ఇక పోలీసులపై నెటిజన్లు మండిపడుతూ.. వారిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.  

తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ ఛార్జీల పెంపు..

  తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నసంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ముసేస్తారు అన్న కథనాలు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఆర్టీసీ ఛార్జీలు మాత్రమే కాదు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్  ఛార్జీల పెంపు సామాన్యుడికి భారంగా ఉండకూడదని అధికారులకు సూచించారట. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి, 30 కిలోమీటర్లు దాటితే రూ.2 పెంచాలని ఆర్టీసీ అధికారులు సూచించగా దానిని ఆమోదించిన కేసీఆర్ ఇతర బస్సు సర్వీసుల్లో ఛార్జీల పెంపు 10శాతానికి మించరాదని చెప్పారు.   ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై కూడా కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 100 యూనిట్లలోపు విద్యుత్‌ ఛార్జీలు పెంచొద్దని, 100 యూనిట్లు దాటితే స్వల్పంగా పెంచాలని పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7శాతం లోపే పెంపు ఉండాలన్నారు.

భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వం.. రంగంలోకి మోడీ..

ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడానికి ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఒప్పుకోగా.. చైనా మాత్రం తన నిరసనను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా అడ్డుకట్టలను నిలువరించేందుకు ప్రధాని మోడీనే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని సియోల్ లో రేపటి నుండి రెండు రోజులపాటు ఎన్ఎస్జీ సమావేశాలు జరగనున్నాయి. చైనా పదే పదే భారత్ ను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీనే స్వయంగా అక్కడికి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈసారి సియోల్ లో సైతం అడ్డుకున్న పక్షంలో, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు చైనాకు వ్యతిరేకంగా ఓ రూలింగ్ ను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇకపై వీర నారీమణులే మెట్రో రైళ్లకు భద్రత...

దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలు మనకు తెలిసిందే. రోజుకో ఘటన వింటూనే ఉంటాం. ఇక మెట్రో రైళ్లలో అయితే అమ్మాయిలు నిత్యమూ వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అందుకే దీనిపై ఆలోచించిన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలే పూర్తి భద్రతను చేపట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఐఎస్ఎఫ్ ప్రకటన కూడా చేసింది. సుశిక్షితులైన వీర నారీమణులు ఇకపై మెట్రో రైళ్లలో భద్రతను పర్యవేక్షిస్తుంటారని, వీరికి ఆయుధాలు వాడటం నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకూ తెలుసునని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.  ఢిల్లీలో మెట్రోల భద్రత కోసం సీఐఎస్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ తదితరాల్లో శిక్షణ పొందిన వారూ ఉంటారని అధికారులు తెలిపారు.

దీక్ష విరమించిన ముద్రగడ.. అవమానం జరిగింది..

  ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. పద్నాలుగు రోజుల నుండి దీక్ష చేస్తున్న ఆయన తన నివాసంలో కాపు నేతల మధ్య దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాజకీయ నేతకు ఇంతటి అవమానం జరిగి ఉండదు.. నా కుటుంబానికి జరిగిన అవమానం చెప్పలేనిది.. ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడు..భగవంతుడు తగిన శాస్తి చేసే వరకూ ఇంట్లో ఎలాంటి పండుగలు చేసుకోం అని అన్నారు. ప్రజలకు మీడియా, చివరికి, ఫోన్ కు కూడా దూరం చేశారు.. వాళ్ల ఖర్మకు వాళ్లే బాధ్యులు.. హామీలు నేరవేర్చమని అడిగినందుకు వారికి కోపమోస్తుంది..అయినా కాపుల కోసం పోరాడతాను.. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ముందుకు సాగుతుంది అని వ్యాఖ్యానించారు.

ఇస్రో సరికొత్త రికార్డ్... ఒక్కసారే 20 ఉపగ్రహాలు

ఇస్రో మరో రికార్డ్ సృష్టించింది. ఒక్కసారే 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ,ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను బుధవారం ఉదయం 9.26 గంటలకు వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో  అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.  పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.

ముద్రగడ దీక్ష ముగిసినట్టే ...

  కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష విరమించనున్నారు. తుని అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన దీక్ష చేపట్టి దాదాపు పద్నాలుగు రోజులు అయిపోయింది. అయితే ఈరోజు ఆయన దీక్ష విరమించనున్నారు. అయితే దీక్ష విరమించడనాకి ఆయన కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.  తననూ, జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతులు పెట్టారు. దీనికి ప్రభుత్వం మాత్రం.. అది ఎట్టిపరిస్థితుల్లో కుదరదని.. ఇక దీక్ష విరమించి ఇంటికి వెళ్లాలని సూచించారు. దీంతో కిర్లంపూడిలో భారీ బధ్రత ఏర్పాటు చేశారు. 

నేనేమి చెప్పును కాదు వాడి పడేయడానికి..

రాజీనామా చేయాలంటే అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయాలి. అయితే ఆ లేఖ సరిగా రాయకపోతే స్పీకర్ రాజీనామాను తిరస్కరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది కన్నడ నటుడు, ఎమ్మెల్యే అంబారీశ్ కు. మంత్రిగా ఉన్న అంబరీశ్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించారు. అంబరీశ్ తో పాటూ మరో 13 మంది మంత్రులను తొలగించారు. కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అంబరీశ్ కు కోపం వచ్చి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని... తరువాత దూరంగా పడేయడానికి తాను చెప్పును కాదంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో లేఖ సరిగా లేదన్న కారణంగా స్పీకర్ రాజీనామాను తిరస్కరించారు. మరోవైపు అంబరీశ్ రాజీనామాను ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

మధ్యలో రాహుల్ ను ఎందుకు లాగావ్ కేజ్రీవాల్..?

తనకు మోడీ అంటే భయం ఉందో లేదో తెలియదు కానీ.. మధ్యలో రాహుల్ గాంధీని ఇరికించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వాటర్ స్కాంలో భాగంగా పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్? పేరు నిందితుడిగా పెట్టారు. అంతే దీనిపై నిప్పులు చెరుగుతున్న కేజ్రీవాల్ కేంద్రం కేసులు పెడితే, భయపడేందుకు తానేమీ రాహుల్ గాంధీనో, రాబర్ట్ వాద్రానో కాదని అన్నారు. మోదీ తానంటే భయపడుతున్నాడని, అందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిజాలేంటో విచారణలో తేలుతాయని అన్నారు. కాగా, 2012లో ఢిల్లీ వాసులకు నీళ్లను సరఫరా చేసేందుకు 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోగా, ఈ వ్యవహారంలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతూ, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ వేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు షీలా దీక్షిత్ తో పాటు కేజ్రీవాల్ నూ ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అంతా బానే ఉంది మధ్యలో కేజ్రీవాల్ రాహుల్ ను ఎందుకు లాగినట్టో.. మరి రాహుల్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.

నిజాయితీని చాటుకున్న ఆటోవాలా...

  ఎవరు బకరా దొరుకుతారా.. ఎవరిని మోసం చేద్దామా.. ఎవరి దగ్గర దోచుకుందామా అని చూసే రోజులు ఇవి. అలాంటిది ఓ ఆటోవాలా మాత్రం తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో గుడ్డు గుప్తా అనే వ్యక్తి ఆటోవాలాగా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఓ భార్యభర్తలు ఇద్దరు అతని ఆటో ఎక్కి  బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వద్ద దిగారు. అయితే వారు దిగారు కానీ వారి లగేజీ మాత్రం మర్చిపోయారు. వారు తమ ఆటోలో లగేజీని మరిచిపోవడం గుప్తా రాత్రి గమనించాడు. ఎలాగైనా లగేజీ వారికి అందించాలని గుప్తా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ కు చేరుకుని, అక్కడి పోలీసు అధికారులకు చెప్పాడు. దీంతో పోలీసులు వివరాలు సేకరించి.. లగేజీ మర్చిపోయిన వారిని కనుగొని వారి సామాను వారికి అందించారు.   ఈ సందర్బంగా తమ లగేజీ తమకు తిరిగి ఇచ్చినందుకు ఆటోవాలాకు ధన్యావాదాలు తెలుపుతున్నామని.. బంగారు ఆభరణాలు, రూ.3,000 నగదు, ఇన్సూరెన్స్ పేపర్లు తమ సూట్ కేసులో ఉన్నాయని ముక్తార్ అహ్మద్ చెప్పారు.