కాశ్మీర్‌లో మళ్లీ పాక్‌ జెండా రెపరెపలు..భారత్ వ్యతిరేక నినాదాలు

జమ్మూకశ్మీర్‌లో పాక్ జెండాలు ఎగరడం షరా మామూలైపోయింది. తాజాగా వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నిన్న శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మరోసారి పాక్ జెండాలు ఎగిరాయి.  కాశ్మీర్‌లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి వారికి ప్రత్యేక నిఘూ ఏర్పాటు చేసేందుకు విడిగా కాలనీలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ర్యాలీ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌కు అనుకూలంగా.,భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఇస్లామిక్ స్టేట్, పాక్ జాతీయ పతాకాలను ఎగురవేశారు.

రఘురామ్ రాజన్ కు అసలు నిజం తెలిసిపోయిందా.. ?

  రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉన్న రఘురామ్ పదవిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసందే. ఈయనను గవర్నర్ పదవి నుండి తొలగించాలని ఒకపక్క బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈసారి కూడా ఆయననే గవర్నర్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాన మంత్రి మోడీ కూడా ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.   అయితే రఘురామ్ రాజన్ కు మాత్రం ఈసారి పదవి దక్కకపోవచ్చని తెలిసిపోయిందో ఏమో కానీ... తాను మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి, పాఠాలు చెప్పుకొంటానని వ్యాఖ్యానించారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా  తన పదవీకాలం సెప్టెంబర్ 4వ తేదీతో ముగుస్తుందని, ఆ తర్వాత మళ్లీ పాఠాలు చెప్పుకొంటానని ఆయన తన సహచరుల వద్ద అన్నారట. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పదవి దక్కకపోవచ్చని అలా అన్నారా..? లేక మోడీ ప్రభుత్వం తనకు పదవి ఇవ్వడానికి సముఖత చూపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా అని అనుకుంటున్నారు. మరి అసలు నిజం ఏంటో రాజన్ కే తెలియాలి..

గూగుల్ ఫాదర్స్ డే గిఫ్ట్.. "ద హీరో"

ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ భారతీయులకు ఫాదర్స్ డే కానుకనిచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి మనం రకరకాలుగా కలలు కంటాం. యాక్టర్ అవ్వాలనో..పోలీస్ అవ్వాలనో..డాక్టర్ అవ్వాలనో..అయితే అనుకోని అవాంతరాలు అడ్డోచ్చి ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అలా తీరని తండ్రికి తీరని కోరికగా మిగిలిపోయిన ఒక కోరికను తీర్చాడో కొడుకు.   కొన్నేళ్ల క్రితం మీ తాతయ్య ఒప్పుకుని ఉంటే..నాన్న షోలే సినిమాకు హీరో అయి ఉండేవాడు. దానితో పాటే బాలీవుడ్‌లో పెద్ద కథానాయకుడిగా ఎదిగి ఉండేవాడు. అయితే తాతయ్య అప్పుడు కాదనడంతో నాన్న అంత పెద్ద అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. సినిమాల్లో నటించాల్సిన వాడు ఆఖరికి సినిమా థియేటర్‌లో పనిచేస్తూ రిటైరవ్వాల్సి వచ్చింది. నాన్న జీవితంలో ఇది వెలితిగా మిగిలిపోయిందని అమ్మ ద్వారా తెలుసుకున్న కొడుకు నాన్నని ఎలాగైనా సంతోష పెట్టాలనుకుంటాడు.   నాన్నతో టూర్‌కి వెళ్లి.. ఆయనను షోలే సినిమా షూటింగ్ జరిగిన స్పాట్‌కు తీసుకెళ్లాడు. ఆయనతో ఆ సినిమాలోని డైలాగ్‌లు చెప్పించాడు. అంతేకాకుండా మరికొన్ని సినిమా షూటింగ్‌లు జరిగిన ప్రదేశాలకు తీసుకెళ్లి వాటన్నింటినీ వీడియోలు చేశాడు. ఆ వీడియోల్ని కొడుకు ఏం చేశాడు. వాటితో తండ్రి కల ఎలా నెరవేరింది..? లాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఓ లుక్కేయండి. ఉద్వేగం నిండిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ని గూగుల్ ఇండియా ద హీరో పేరుతో విడుదల చేసింది. రేపు ఫాదర్స్ డే కూడా కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  

మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐపీఎస్ అధికారిగా బురిడి..

  తాను ఐపీఎస్ అధికారిని అంటూ ఒకర్ని కాదు ఇద్దర్ని కాదు ఏకంగా 60 మందిని పైగా బురిడీ కొట్టించాడు ఓ కిలాడి. ఇంతకీ బురిడీ కొట్టించింది ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఓ మాజీ మంత్రి మనవడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు.. అది కూడా ప్రభుత్వ అధికారుల్ని. వివరాల ప్రకారం.. రాహుల్ కుమార్ పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కుమారుడు. అయితే రాహుల్ తాను విజిలెన్స్ ఎస్పీగా అధికారులు తమ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వారి నుంచి సుమారు 30 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని వసూలు చేశాడు. ఈ నేపథ్యంలోనే అమృత్ సర్ డివిజన్ అటవీశాఖాధికారి ఎస్.కే.సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నకిలీ ఐపీఎస్ అధికారిని పట్టుకున్నారు. రాహుల్ ను విచారిస్తున్నామని, ఆయన అధికారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

వివాదంలో ప్రియాంక గాంధీ ఇల్లు...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ సిమ్లాలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇల్లు కూడా వివాదంలో పడేట్టు కనిపిస్తోంది. బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ అనే వ్యక్తి ప్రియాంక ఇల్లు గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.  ప్రియాంకా గాంధీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నది.. రాష్ట్రపతి వేసవి విడిది భవనానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఈ నిర్మాణం అపాయకరమని, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు. మొత్తానికి సోనియా అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు.. ఇప్పుడు ఆఖరికి ఇల్లు కూడా వివాదంలో ఇరుక్కుంది.

అయ్యప్పను చూడాలని అబ్బాయిగా మారింది..దొరికిపోయింది

సుప్రసిద్థ పుణ్యక్షేత్రం శబరిమలై అయ్యప్ప దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండదని అందరికి తెలిసిందే. అయితే అయ్యప్పను చూడాలన్న పట్టుదలతో ఒక మహిళ..మగాడిగా మారింది, అయినా ఆమె ఆశ నెరవేరలేదు. మధురైకి చెందిన లక్ష్మీ అనే యువతి శబరిమలై వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవాలనుకుంది. అయితే అక్కడి దేవాలయంలోకి కేవలం మగవారికే ప్రవేశం ఉందని తెలియడంతో ఎంచేయాలో పాలుపోలేదు. చివరికి మగవేషంలో శబరిమలై కొండకు వెళ్లింది. గత రాత్రి 7 గంటల సమయంలో ప్యాంటు, షర్టు వేసుకుని గుండు చేయించుకుని పంబానది ప్రాంతంలో నడిచి వెళ్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భద్రతాధికారులకు అనుమానం రావడంతో అడ్డుకుని ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు గుండు గీయించుకుని మగవేషంలో వచ్చినట్టు ఆమె అంగీకరించింది.

రాళ్ల మధ్యలో డ్రగ్ స్మగ్లింగ్..

డ్రగ్స్ ను తరలించడానికి మాఫియా వాళ్లు పన్నే పథకాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు చేసుకుంటూ పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను తరలిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలా అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ను అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 726 కిలోల మారిజువానా అనే డ్రగ్ ను లాండ్ స్కేపింగ్ రాళ్ల మధ్య తరలిస్తూ పోలీసులకు చిక్కారు. వివరాల ప్రకారం. మెక్సికో సరిహద్దులలోని ఒటే మెసా కార్గో ద్వారా లాండ్ స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద సైజు రాళ్లను తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన  కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వాటిని పరిశీలించారు. ఆ రాళ్లను డ్రిల్ చేసి చూడగా అసలు బండారం బయటపడింది. ఆ రాళ్ల మధ్యలో డ్రగ్ పెట్టి తరలిస్తున్నారు. మొత్తం 577 ప్యాకెట్లలో మారిజువానా బయటపడింది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 5.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌ మోడ‌ళ్ల‌పై నిషేధం...

  ఆపిల్ సంస్థకు చైనాలో ఓ సమస్య ఎదురైంది. ఈ సంస్థకు చెందిన ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌ మోడ‌ళ్ల‌పై చైనా కోర్టు నిషేధం విధించింది. ఆపిల్ సంస్థ తీసుకొచ్చిన  ఐఫోన్ 6, 6 ప్ల‌స్‌ మోడ‌ళ్ల‌ు అచ్చం.. షెంజన్ బెల్లీకి చెందిన కంపెనీ తయారుచేసే 100సీ మోడ‌ల్ ఫోన్ మారిదిగానే ఉందని.. అందుకే వాటిని అమ్మ‌రాద‌ని బీజింగ్ ట్రిబ్యున‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గత మే నెలలోనే కోర్టు ఆదేశాలను జారీ చేసినా ఇప్పుడు ఈ విషయం బయటపడింది. అయితే ఫోన్ల డిజైన్ కేసులో ట్రిబ్యున‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై బీజింగ్‌లోని ఉన్న‌త కోర్టు స్టే విధించింద‌ని, ఇప్పుడు అక్క‌డ ఐఫోన్ల‌ను అమ్ముతున్న‌ట్లు ఆపిల్ సంస్థ తెలిపింది.

వీడిన నావీ అధికారి కుమార్తె మిస్టరీ..

  నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఈనెల 14న  విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అక్కడి నుండి ఆమె ఎటు వెళ్లిందో కూడా తెలియలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక తానే ఎటైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. స్నేహితులు, ప్రయాణికులు, ఫేస్ బుక్ స్నేహితులు... ఇలా అందర్నీ విచారిస్తూ పోలీసులు ముందుకి సాగడంతో ఆమె ఎక్కడుందో తెలిసింది. ఖైరవీ శర్మ గోవా బీచ్ లో పోలీసులకి దొరికింది. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు, ఆమె తండ్రి, నేవీ అధికారి అరవింద్ కుమార్ కు అప్పగించారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

కేసీఆర్ కు కేంద్రమంత్రి పంచ్.. 'ముందు అవి వాడండి మహాప్రభో'..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర వైద్యం, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఝలక్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంది కానీ తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తమకు మరిన్ని నిధులు కావాలని కేంద్రానికి లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన జేపీ నడ్డా.. 'ముందు మేమిచ్చిన నిధులను ఖర్చు చేయండి మహా ప్రభో అంటూ' కేసీఆర్ కు లేఖ రాశారట. ఇచ్చిన నిధులను ముందు ఖర్చు పెట్టండి ఆ తరువాత నిధులు అడగండి అంటూ లేఖలో పేర్కొన్నారంటా. దీనికి కారణం కూడా లేకపోలేదట.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రతియేటా రాష్ట్రానికి రూ.1000కోట్లు కేటాయిస్తుండగా.. వాటిలో 60 శాతం కేంద్రం.. 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విడుదల చేసిన నిధుల్లోనే ఇప్పటికీ రూ.438 కోట్లు అలాగే ఉన్నాయంటా..వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపేసిందట. అందుకే కేంద్ర మంత్రి ఈ రకంగా లేఖ రాసి కేసీఆర్ కు పంచ్ విసిరారని అనుకుంటున్నారు. మరి మంత్రిగారి లేఖపై కేసీఆర్ సాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కోర్టు ముందుకు బురిడి బాబా..

  బురిడిబాబా.. శివానందబాబాను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ ట్రాస్క్ పోర్స్ పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు ముమ్మరం చేసి బురిడి బాబాను బెంగుళూరు శివారులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈయనను విచారించిన పోలీసులు తగిన సమాచారాన్ని రాబట్టారు. అయితే ఈరోజు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని.. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిని  ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి.. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అతడిని కోర్టులో హాజరుపరుస్తారు. కాగా  హైదరాబాదు 'లైఫ్ స్టయిల్' బిల్డింగ్ యజమాని మధుసూదన రెడ్డికి టోకరా ఇచ్చి రూ.1.33 కోట్లతో ఉడాయించిన సంగతి విదితమే.

'ఎలిఫెంట్' స్పెల్లింగ్ కూడా సరిగా రాని మంత్రిగారు..

ఓ మంత్రిగారు.. ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేక విమర్సలు పాలయ్యారు. ఇంతకీ ఎవరా మంత్రిగారు అనుకుంటున్నారా.. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటెల్ కేబినెట్లో.. రవాణా శాఖతో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను భుజాన వేసుకున్న శంకర్ చౌదరి. శంకర్ చౌదరి ఎంబీఏ వరకూ విధ్యనభ్యసించారు. ఈ మేరకుతన అఫిడవిట్ లో కూడా తన విద్యార్హతలు తెలిపారు. అయితే ఇటీవల ఆయన ఓ పాఠశాలకు వెళ్లి.. టీచర్ అవతారం ఎత్తి విద్యార్ధులకు పాఠాలు చెప్పారు. కొన్ని ఆంగ్ల పదాలు కూడా బోర్డుపై రాశారు. ఇక్కడే మంత్రిగారు తప్పులో కాలు వేశారు. 'elephant' అని రాయకుండా 'elephent' అని రాశారు. అంతే దీన్ని గమనించిన ఓ విద్యార్ధి స్పెల్లింగ్ తప్పుగా రాశారు అని చెప్పడంతో సదరు మంత్రిగారు షాకయ్యారు. ఇక అక్కడ ఉన్న మీడియా ఊరుకుంటుందా.. జరిగిందంతా రికార్డ్ చేసేసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో సదరు మంత్రిగారిపై కామెంట్లు, విమర్శలు మొదలయ్యాయి.

ఇండియాలో హైవేలపై దిగనున్న విమానాలు..

ఎయిర్‌పోర్టుల్లో ఖాళీ లేకనో..లేదంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమో గత్యంతరం లేక విమానాలు హైవేలపై దిగడం చూశాం. ఇకపై ట్రాఫిక్ తక్కువగా ఉండే జాతీయ రహదారులను విమానాలకు రన్‌వేలుగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఊరి చివర జాతీయ రహదారులపై విమానాలు దిగేలా, జనసమ్మర్ధం ఉండని ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించేలా ఓ పథకాన్న రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేషనల్ హైవేలను పౌర, సైనిక విమానాల రాకపోకలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారి కాగలదని చెప్పారు. విమానాల్లో రవాణా చేయడానికి రోడ్డు వెంబడి సరకుల లోడింగ్, అన్‌లోడింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. దీని వల్ల సంప్రదాయ విమానాశ్రయాలతో పోలిస్తే తక్కువ వ్యయం అవుతుందని చెప్పారు.

చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు... ఉగ్రవాదుల పనేనట..!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య నేపధ్యంలో.. నిందితుడు చింటూను కోర్టులో హాజరుపరిచే సమయంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు చింటూకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. చింటూనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాంబు పేలుడు ప్లాన్ వేసి ఉంటాడని అనుకున్నారు. దీనికి గాను చింటూ బాంబు పేలుడుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అతడు... రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, హైకోర్టు, జిల్లా కోర్టులతో పాటు పోలీసులకు లేఖలు రాశాడు కూడా.   అయితే ఇప్పుడు దీనిపై ఓ కొత్త విషయం బయటపడింది. ఈ దాడులకు పాల్పడింది.. ఉగ్రవాద సంస్థ ఆల్- ఉమా అని తెలిసింది. ఈమేరకు ఉగ్రవాద సంస్ధ కోర్టులో బాంబు పేల్చింది తామేనంటూ చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగిన ఘటనను లేఖలోని విషయాలను పోలుస్తూ పరిశీలించారు. ఈ క్రమంలో అన్ని విషయాలను పరిశీలించిన చిత్తూరు పోలీసులు కోర్టులో జరిగిన పేలుడు చింటూ పని కాదని తేల్చుకున్నారు. ఆల్- ఉమా ఉగ్రవాదులే నాడు బాంబులు పేల్చారని నిర్ధారించారు. 2013లో పుత్తూరులోని ఓ ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పెను బీభత్సమే సృష్టించారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేయగా..ఈ కేసు విచారణ తిరుపతిలోని కోర్టులో జరుగుతోంది. తమ సహచరులు కోర్టుకు వచ్చిన సందర్భంగా బాంబులు పేల్చి వారిని విడిపించుకునేందుకు ఆల్- ఉమా ఉగ్రవాదులు పథకం పన్నారు.