టీచర్లు వర్సెస్ పోలీసులు... 8 మంది టీచర్లు మృతి..

మెక్సికోలో ఒయాక్సాకా రాష్ట్రంలో ఉపాధ్యాయులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఉపాధ్యాయులకు..పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులు.. నిన్న ఒయాక్సాకా-ప్యూబ్లా రాష్ట్రాల మధ్య రహదారిని దిగ్బంధించేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీచర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు ఫైరింగ్ జరపగా.. ఈ కాల్పుల్లో 8 మంది ఉపాధ్యాయులు ప్రాణాలుకోల్పోయారు.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.   కాగా విద్యావ్యవస్థలోని ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని అక్కడ ఉన్న యూనియన్ సీఎన్ టీఈకి చెందిన కొందరు ఉపాధ్యాయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని అరెస్టు చేశారు. దీంతో సీఎన్ టీఈ యూనియన్ కు చెందిన టీచర్ సంఘాల వారంతా రోడ్లెక్కారు.

దుమారం రేపుతున్న సర్దార్ 'గన్ పెన్' మాల...

  గుజరాత్ మాజీ పోలీసు అధికారి డీజి వంజార.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి గన్ మాల వేయడం పెద్ద దుమారమే రేపుతోంది. గుజరాత్ లోని తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వంజార పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పటేల్ విగ్రహానికి పెన్నులు, గన్ తో ఉన్న మాలను వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఓ నిజమైన జాతీయవాదిగా, పటేల్ ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేశారని.. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసేందుకే తాను ఈపని చేశానని చెప్పుకొచ్చారు. అస్త్రశస్తాలతో ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారని కొనియాడారు. కాగా వంజార తాను సర్వీసులో ఉన్న సమయంలో ఎన్నో ఎన్ కౌంటర్లు చేసి వార్తల్లో నిలిచారు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇష్రాత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్లు నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బెయిల్ పై ఉన్నారు. మరి ఈ గన్ పెన్ మాలపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి....

సెల్ఫీలతో ముసలితనమే..

సెల్ఫీలు..ఇప్పుడు యూత్‌కు ఇదోక ఫ్యాషన్..నలుగురితో కలిసినా..ఒంటరిగా ఉన్న ఒక్క సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇలాంటి వారికి ఒక చేదువార్తను చెప్పారు నిపుణులు. సెల్ఫీలు పదేపదే తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. స్మార్ట్‌ఫోన్ నుంచి వెలువడే బ్లూ రేస్ చర్మంలోకి చొచ్చుకుపోయి చర్మంపై ముడతలు ఏర్పాడతాయంటున్నారు. హ్యాండ్‌సెట్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ విడుదలవుతుందన్నారు. దీంతో డీఎన్‌ఏ దెబ్బతింటుందన్నారు సైంటిస్టులు. సెల్ఫీలు తీసుకునేటప్పుడు కెమెరాను కంటికి, ముఖానికి ఎదురుగా తీసుకొస్తాం..ఈ కారణంగా ఆ ప్రదేశాల్లో చర్మం ముడతలు పడటం..పొడిబారటం జరుగుతుందని..టెక్‌సావీ, స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుందట. సో..సెల్పీల కోసం స్కిన్ పాడుచేసుకోండి.

ఏకే 47 మిస్ ఫైర్... గడ్డం నుండి తల బయటకి బులెట్..

ఏకే 47 గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయాడు శివకుమార్ అనే కానిస్టేబుల్. ఈఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శశికుమార్ అనే వ్యక్తి ఇటీవలే డిప్యుటేషన్‌పై గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే విధులు ముంగిచుకున్న అతను.. తన వద్దనున్న గన్ ను శుభ్రం చేస్తున్న.. క్రమంలో మిస్ ఫైర్ అయి బులెట్.. గడ్డం కింద నుండి తల భాగం నుండి బయటకు వచ్చింది. అంతే శశికుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది అతన్ని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతని మృతదేహాన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా లేక.. ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ నేతలపై బాంబుల దాడి..

విశాఖపట్నంలో టీడీపీ నేతలపై గుర్తు తెలయని దుండగలు బాంబులతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విశాఖ డెయిరీ డైరెక్టర్, టీడీపీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లి విధుల్లో భాగంగా.. పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న క్రమంలోనే కొంతమంది దుండగులు వచ్చి.. ఆయనపై బాంబులు విసిరి పారిపోయారు. బాంబులు పేలడంతో.. ఇనుప ముక్కలు ఆయన శరీరంలోకి గుచ్చుకుపోయి తీవ్ర గాయాలవ్వగా.. అతనిని రావికమతంలోని ఆస్పత్రికి తరలించారు.   మరోవైపు సమాచరం అందుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు. అయితే ఈ దాడికి కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత కక్షలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. దాడిలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. కీలక నేత మృతి..

  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాటేపెల్లి అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగగా.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోల్లో.. ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్‌ (చార్లెస్‌) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంక మిగిలిన ఇద్దరు.. మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్, ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడు దినేష్ ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకితోపాటు రెండు మందుగుండు సామగ్రి డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

పిలిస్తేనే ఆ సభకు వెళ్లాను..

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోకరా పెట్టి బ్రిటన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కింగ్‌షిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్య లండన్‌లోని పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నాడంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై రచయిత సుహేల్ సేథ్ స్పందిస్తూ ఇది ఓపెన్ ఈవెంట్ అని ఎవరైనా రావొచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్యా ట్విట్టర్‌ ద్వారా వెలుగులోకి వచ్చారు. పిలవకుండా పోవాల్సిన అవసరం తనకు లేదని..నా జీవితంలో ఎన్నడూ పిలవని పేరంటాలకు వెళ్లలేదన్నారు. అసలు అలాంటి చోట్లకు ఎన్నడూ వెళ్లను కూడా. నాకు ఆహ్వానం ఉందని పోస్ట్ చేశారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు..చార్జ్‌షీట్ లేదు. ఏదైనా ఆరోపించే ముందు నా వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అమరావతి దేవస్థానానికి చెందిన సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో టీడీపీ అవకతవకలకు పాల్పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై నిజానిజాలను తేల్చేందుకు పార్టీ తరపున కమిటీ వేసింది. దానిలో భాగంగా ఈ కమిటీ సభ్యులు ఇవాళ అమరావతిలో పర్యటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతల పర్యటన అంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోటాపోటిగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు

"అతి"థి మర్యాద..జడ్జిల భోజనం కోసం వెండికంచాలు..

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ అతిథుల కోసం "అతి" చేసింది. అదేంటంటే ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సు జరిగింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా హాజరయ్యారు. సదస్సు తమ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీరందరికి ఎలాంటి లోటు చూసుకోవాలనుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని..వీరిని ప్రభుత్వ అతిథులుగా ప్రకటించింది. అంతేకాకుండా వారు భోజనం చేయడానికి ఏకంగా వెండి కంచాలను, పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అజయ్ దూబే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడంతో ప్రభుత్వ అతి మర్యాదలు బయటపడ్డాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమలలో హరీశ్‌రావు..

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సతీసమేతంగా కాలినడకన అలిపిరి నుంచి తిరుమల కొండకు వచ్చారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణకే చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిద్దరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, పట్టువస్త్రాలను బహుకరించారు. అనంతరం రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందించారు.

ఐసిస్ హిట్‌లిస్ట్‌లో రామేశ్వరం..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. మన నిఘా, పోలీస్ వ్యవస్థలు అప్రమత్తమై ఐసిస్ కుట్రలను భగ్నం చేశాయి. తాజాగా మరోసారి భారత్‌పై ఎక్కు పెట్టింది. తమిళనాడులోని రామేశ్వరంపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రపన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 2008 తరహాలో పలు రాష్ట్రాల్లోని 180 ఓడరేవులను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపాయి. రామేశ్వరంలోని ఓడరేవు, పాంబన్ వంతెనపై దాడులు జరగవచ్చని హెచ్చరించడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు జలాశయాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

లండన్‌లో భారత రాయబారి కార్యక్రమంలో మాల్యా..

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా లండన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం భారత్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. మాల్యాను ఎలాగైనా దేశానికి రప్పించాలని అవి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఒక పుస్తకావిష్కరణ సభలో మాల్యా ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యక్రమానికి బ్రిటన్‌లోని భారత రాయబారి కూడా హాజరుకావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ రచయిత సుహెల్ సేథ్ రచించిన మంత్రాస్ ఫర్ సక్సెస్: ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈవోస్ టెల్ యు హౌ టు విన్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా భారత రాయబారి నవతేజ్ సర్న హాజరయ్యారు.   ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంపై సుహేల్ సేథ్ స్పందించారు. ఈ కార్యక్రమానికి మాల్యా హాజరయ్యారని, ప్రేక్షకుల్లో కూర్చున్నారన్నారు. ఈ కార్యక్రమం ఓపెన్ ఈవెంట్ అని ప్రత్యేకించి ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని, కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రచారం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా హాజరుకావచ్చునని చెప్పడం వల్ల మాల్యా ఈ కార్యక్రమానికి వచ్చారని, ప్రేక్షకుల్లో కూర్చోని కార్యక్రమాన్ని వీక్షించారని ట్వీట్ చేశారు. మీడియా కావాలనే దీన్ని హైలెట్ చేస్తోందని సుహెల్ విమర్శించారు.  

మాట తడబడిన రక్షణమంత్రి పారికర్..

  రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ పొరపాటున మాట తడబడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్‌ నియామకం అయినా సంగతి తెలిసిందే. అయితే.. పారికర్ మాత్రం అది మర్చిపోయినట్టున్నారు.. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దీంతో  వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయని.., ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని.. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పారికర్ అన్నారు.

కాశ్మీర్‌లో మళ్లీ పాక్‌ జెండా రెపరెపలు..భారత్ వ్యతిరేక నినాదాలు

జమ్మూకశ్మీర్‌లో పాక్ జెండాలు ఎగరడం షరా మామూలైపోయింది. తాజాగా వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నిన్న శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మరోసారి పాక్ జెండాలు ఎగిరాయి.  కాశ్మీర్‌లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి వారికి ప్రత్యేక నిఘూ ఏర్పాటు చేసేందుకు విడిగా కాలనీలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ర్యాలీ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌కు అనుకూలంగా.,భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఇస్లామిక్ స్టేట్, పాక్ జాతీయ పతాకాలను ఎగురవేశారు.