పెళ్లికి ఒప్పుకోలేదని అబ్బాయిపై యాసిడి దాడి..

  అమ్మాయిలు ప్రేమ అంగీకరించకపోతే అబ్బాయిలు యాసిడ్ తో దారి చేస్తుంటారు అది కామన్. అయితే ఇక్కడ ఓ అమ్మాయి.. ఓ అబ్బాయిపై యాసిడ్ దాడి చేసింది. ఈఘటన పాకిస్థాన్ లో జరిగింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ముల్తాన్‌కు చెందిన మొనిల్ మాయ్ (32) అనే మ‌హిళ త‌న పొరుగింట్లో నివ‌సించే ర‌షీద్ అనే వ్యక్తిని ప్రేమించింది. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ర‌షీద్‌ను ఆమె కోరింది. అయితే రషీద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైంది. దీంతో నిన్న ర‌షీద్‌పై యాసిడ్ గుమ్మరించి కోపాన్ని తీర్చుకుంది. మొనిల్ మాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గుండె, కాలేయం లోకి ఇనుప ఊచ.. అయినా బ్రతికాడు..

కొన్ని సార్లు ఎంత చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలు కోల్పోతుంటారు. అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడుతుంటారు. అలా ప్రాణాలతో బయటపడి అది నిజమే అని నిరూపించాడు చైనా కి చెందిన ఓ వ్యక్తి. చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. దీంతో అతని శరీరంలో ఇనుప ఊచలు దిగిపోయాయి. అయితే కొన్ని ఇనుప ఊచలు కత్తిరించినా ఒక ఇనుప ఊచ మాత్రం  కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి చొచ్చుకుపోయింది. అదృష్టం ఏంటంటే ఏ భాగానికి అది తగలకుండా ఉండటంతో ప్రాణాలు పోలేదు. ఇక అతనిని ఆస్పత్రిలో చేర్పించగా.. 7 గంటలకు పైగా శ్రమించి.. అతడి ప్రాణాలను నిలిపారు. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం  అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు.

నాలుగు టైర్ల ధర ఎంతని.. ఛీప్‌గా రూ.4 కోట్లు

కార్లు నడవాలంటే టైర్లది ముఖ్య పాత్ర.. సాధారణంగా కార్లకు వాడే టైర్ల ధర మహా అయితే 10 వేలు ఉంటుంది..లేదు కొంచెం కాస్టిలీ కారైతే లక్ష నుంచి ఐదు లక్షలు ఉండవచ్చు. కాని కోటి రూపాయల టైరు ఉందంటే మీరు నమ్ముతారా..? కాని ఇది పచ్చినిజం..దుబాయ్‌కి చెందిన జడ్ టైర్స్ అనే సంస్థ తయారు చేసిన నాలుగు టైర్లు (ఒక సెట్) 4 కోట్లకు పైగానే విలువ చేస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన వజ్రాలను పొదిగి తయారు చేయడం వల్ల వీటికి అంత ధర. ఇటలీకి చెందిన స్వర్ణకారులు తయారు చేసిన ఆభరణాలతో టైరుకు అలంకరణ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ టైర్లు..గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించాయి

ఎయిర్‌హోస్టెస్ ప్రేమలో కేంద్రమంత్రి

కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న బాబుల్ సుప్రియో ప్రేమలో పడ్డారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న రచనా శర్మను తొలి చూపులోనే ప్రేమించారు. 2014లో కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లే విమానంలో యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి ప్రయాణిస్తుండగా సుప్రియోను రచన పలకరించింది. లోక్‌సభ ఎన్నికలపై చర్చిస్తుండగా టికెట్ లభిస్తే విజయం ఖాయమంటూ ఆయన భుజం తట్టిందట. అప్పుడే ఆమెపై మనుసు పారేసుకున్నానని సుప్రియో తెలిపారు. ఆమె పేరు, ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో మునిగిపోయారట.   అపై రచన చెప్పినట్లే టికెట్ లభించడం, విజయం సాధించడం, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. తమ రెండేళ్ల ప్రేమాయణానికి ఆగస్టు 9న తెరదించి ఒక ఇంటివారు కాబోతున్నారు. కాగా ఆయనకు ఇది రెండో పెళ్లి. గతంలో బాలీవుడ్ గాయకుడిగా ఉండగా ఆయనకు రియా పరిచయం కావడంతో ఆమెను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూతురు షర్మిలి పుట్టింది. అయితే మనస్పర్థల కారణంగా రియాకు 2006లో విడాకులిచ్చారు.

జమ్మూలో మరోసారి ఆలయ ధ్వంసం.. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ు బంద్

  జమ్మూలో రెండు రోజుల క్రితం ఓ వ్య‌క్తి నాన‌క్ న‌గ‌ర్‌లోని ఓ ఆల‌య ధ్వంసానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. జ‌మ్మూ రూప్ నగర్‌లో ఓ వ్యక్తి ఆల‌యంలోకి వెళ్లి  దాన్ని ధ్వంసం చేయ‌బోయాడు. పోలీసులు వెంట‌నే ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆల‌యం ధ్వంసం చేసే ప్ర‌యత్నం జ‌రిగింద‌న్న స‌మాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్య‌లో నిర‌స‌న‌కు దిగారు. దీంతో జ‌మ్మూలో మ‌రోసారి మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను బంద్ చేశారు.

మూడు సింహాలకు జీవితఖైదు శిక్ష..

  గుజరాత్ లోని మనుషులపై దాడి చేసిన సింహాలు ముగ్గురిని చంపి తిన్నందుకు వాటిని శిక్షించాలని పోలీసులు కేసు పెట్టిన సంగతి తెలసిందే. ఈ కేసు విచారణలో భాగంగా 18 సింహాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాటిని పరీక్షలు నిర్వహించి వాటిలో మూడు సింహాలకు దోషులుగా తేల్చి జీవితఖైదు శిక్ష వేశారు. అయితే ఈ మూడింటిల్లో కూడా రెండు సింహాలు బాల నేరస్తులని, ఓ మగ సింహం మనిషిని చంపి తినగా మిగిలినవి మాంసాన్ని మాత్రమే తిన్నాయని నిర్ణయించిన అటవీ శాఖ అధికారులు, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి అడవిలో వదిలేశారు. ఈ రెండింటినీ ఒకదానిని ఒకటి కలవకుండా దూరంగా ఉంచి కొంతకాలం అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.

ఏపీ ఉద్యోగుల్ని తీసుకువెళ్లడానికి రైలే వస్తోంది..

అమరావతికి తరలివచ్చే ఏపీ ఉద్యోగుల సుడి మామూలుగా లేదు. వాళ్లు ఏది కోరుకుంటే అది క్షణాల్లో వారి ముందు ప్రత్యక్షమవుతోంది. ఐదు రోజుల పనిదినాలు, హెచ్‌ఆర్ఏ పెంపు ఆఖరికి స్థానికత ఇలా ఏది కావాలంటే దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనకుండా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణించేందుకు వీలుగా తమకు ప్రత్యేక రైలు కావాలని సీఎంతో పాటు కేంద్రానికి లేఖ రాశారు సచివాలయ ఉద్యోగులు. దీనికి చంద్రబాబు సిఫారసు తోడవ్వడంతో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. ఏపీ ఉద్యోగుల కోసం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య వారానికి మూడు రోజుల పాటు ప్రత్యేక రైలు నడపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక రైలు రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి..ఉదయం సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రాత్రి 10 గంటలకు బయల్దేరి..ఉదయం విజయవాడకు చేరుకోనుంది. మరో పది రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కనుంది.

వీణా-వాణి ఆపరేషన్.. అస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త

  అవిభక్త కవలలు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయడం కుదరని పని అని..విడదేసే ప్రయత్నం చేస్తే వారి ప్రాణాలకు ముప్పు అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వారు అలా బతకాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వీళ్ల ఆపరేషన్ కు ఆస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన అక్కడి రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్య సిబ్బందితో భేటీ అయి వీణా-వాణి ల గురించి చెప్పగా వారు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) వైద్యుల‌తో వీణా-వాణిల ఆపరేషన్ చేయించే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

అంగారక గ్రహంపై మీకు పనిచేయాలనుందా..!

ఎప్పుడూ ఒకే జాబ్‌లో ఉండి బోర్ కొడుతోందా..? ఛేంజ్ అవ్వాలనుకుంటున్నారా..? మీరు కూడా వ్యోమగామిగా మారాలనుకుంటున్నారా..? ఇలాంటి వారందరికి సువర్ణావకాశం. అంగారక గ్రహం మీద మీకు పనిచేయాలనుందా..? అయితే..మమ్మల్ని సంప్రదించండి అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా). అంగారకగ్రహానికి సంబంధించిన పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచడం కోసం నాసా కొన్ని ఉద్యోగాలిస్తానంటోంది. ఉపాధ్యాయులు, సర్వేయర్లు, రైతులు తదితర వృత్తులకు చెందినవాళ్లు కావాలంటూ కొన్ని పోస్టర్లు రీలీజ్ చేసింది. అయితే..ఇది కార్యరూపం దాల్చడానికి కనీసం 14 ఏళ్లైనా పట్టవచ్చు. ఎందుకంటే నాసా అంగారక యాత్ర ప్రణాళికల ప్రకారం..ఆ గ్రహం పైకి మనుష్యులను పంపించి అక్కడ మానవ యోగ్యమైన నివాసప్రాంతాలను ఏర్పాటు చేయటమన్నది 2030కి గానీ సాధ్యం కాదు. ఎప్పుడో సంగతి ఇప్పుడు ఎందుకని మీరనుకోవచ్చు.  ముందుగా ఎవరు అప్లై చేస్తారో వాళ్లకే ఉద్యోగం..సో..ఇంకేందుకు లేటు.

ముద్రగడ దీక్షపై బొత్స ఆగ్రహం.. గొప్ప‌ల‌కు పోవ‌ద్దు..

  ఏపీ ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని కేసులో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముద్ర‌గ‌డ‌ను చూసి రావ‌డానికి వీలు లేకుండా అంక్ష‌లు పెడుతున్నారని ఆయ‌న మండిపడ్డారు. స‌మ‌స్య‌ను జ‌టిలం చేయ‌కుండా చూడాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. ముద్ర‌గ‌డ దీక్ష‌పై మంత్రులు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, బాధ్యతలు లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని బొత్స దుయ్యబట్టారు. ‘ప్ర‌భుత్వం గొప్ప‌ల‌కు పోవ‌ద్దు, ఒంటెద్దు పోక‌డ‌లు పోవ‌ద్దు, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప్రభుత్వం వ్య‌వ‌హ‌రించాలి’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.   కాగా ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో తొమ్మిది రోజులకి చేరింది. మరోవైపు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని.. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని తెలుపుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.

మిస్టరీగా మారిన నావీ అధికారి కుమార్తె కేసు...

  నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ గురించిన ఆచూకి ఇంకా తెలియక పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈనెల 14న  విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అయితే కనెక్టింగ్ విమానం ఎక్కేవారు విమానాశ్రయం బయటకు వెళ్లరు.. కానీ ఖైరవీ విమానాశ్రయం బయటకు వచ్చి ఓ పుష్పక్ బస్సు ఎక్కినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఆ తరువాత  ఆపై ఆమె సెల్ ఫోన్ బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆపై సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, ట్రేసింగ్ కష్టమైపోయింది. దీంతో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేక తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిందా అని ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. దీంతో ఈకేసు మిస్టరీగా మారింది. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

మహిళల దుస్తుల మార్చుకునే రూంలో సీక్రెట్ కెమెరా.. ప్రబుద్దుడు అరెస్ట్

  అతని వయసు యాభై సంవత్సరాలు. చేసింది బుద్ది తక్కువ పని. ఫలితం ఉద్యోగం ఊడిపోవడం. జైలు ఊచలు లెక్కబెట్టడం. ఇంతకీ ఆ పెద్ద మనిషి చేసిన పని ఏంటనుకుంటున్నారా..? ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే రూంలో సీక్రెట్ పెట్టి ఆ వీడియోలు జమచేసి పోర్న్ సైట్లకు అమ్మాలనుకోవడం. యూరోపియన్ యూనియన్ బ్యాంకులో ఓ వ్యక్తి ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన గత నెలలో మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో టేబుల్ కింద ఓ సీక్రెట్ కెమెరాను ఉంచాడు. అలా రికార్డ్ అయిన వీడియోలు తన ల్యాప్ టాప్లో, ఫోన్లో భద్రంగా తీసి పెట్టుకున్నాడు. ఈ లోపులోనే అతని బండారం బయటపడింది. రూంలో సీసీ కెమెరా ఉండటం గమనించిన ఓ మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ సీక్రెట్ కెమెరా గుట్టును తేలికగానే పసిగట్టగలిగారు. బయట ఉన్న సీసీ కెమెరా ఫూటేజ్ ను పరిశీలించి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 150 మంది మహిళలు ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నారు.

ఏఎస్పీది ఆత్మహత్యే.. కారణం అదేనా..?

పాడేరు ఏఎస్పీ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తుపాకీ పేలి ఆయన మరణించగా.. ఏఎస్పీ కావాలనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పేలిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది ఆత్మహత్యే అని పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు.. ఓ సూసైడ్ నోటు కూడా దొరికిందని తెలుపుతున్నారు. ‘నా చావుకు ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా’ అని లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా హోంమంత్రి చినరాజప్ప ఏఎస్పీ కుటుంబాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో సూసైడ్ నోటు దొరికింది.. వారి కుటుంబ సభ్యుల అనుమతితోనే బయటపెడుతున్నాం.. సూసైడ్ లో అంశాలన్నీ సెంట్ మెంట్ తో కూడుకున్నవని అన్నారు. సెప్టెంబర్ 4 న శశికుమార్ వివాహం జరగాల్సి ఉంది.. ఈలోగా ఘటన జరగడం బాధాకరంగా ఉందని వెల్లడించారు.  పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మూడు రోజులు సెలవు పెట్టి వస్తున్నానని రెండు రోజుల క్రితం ఆయన తన తల్లికి ఫోన్ చేసి చెప్పారు. సెలవుపై వెళ్లాల్సిన రోజే... ఆత్మహత్య చేసుకున్నారు. తను ఇష్టపడిన అమ్మాయితో కాకుండా... మరొకరితో పెళ్లి కుదర్చడంతో మనస్తాపానికి గురైనందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

టీడీపీలోకి అమర్నాథ్ రెడ్డి... నా నోటికి పని చెప్పొద్దు..

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మేల్యే టీడీపీలోకి జంప్ అయ్యారు.  చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను డబ్బులు తీసుకొని టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దీనికి సమాధానం జగనే చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సవాల్ కూడా విసిరారు.. తనకు ఉన్నది ఒకే బిడ్డని.. డబ్బులు తీసుకోలేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతానని, జగన్‌కు ఏసుక్రీస్తు పైన నమ్మకం ఉంటే నేను డబ్బులు తీసుకున్నానని క్రీస్తు దగ్గర తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. పత్రిక ఉంది కదా అని ఏది పడితే అది రాయడం సరికాదని.. తనను ఇబ్బంది పెడితే తన నోటికి పని చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) కూడా టిడిపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రాణం తీసిన సోనియా గాంధీ ఫొటో..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటో  ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అదేంటీ సోనియా ఫొటోకి.. వ్యక్తి మరణించడానికి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ' విజయ నగర్ ఫ్రెండ్స్ ' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అయితే ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా పాత్రలు తోముతున్నట్టు ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని గ్రూపులో పోస్ట్ చేశాడు. అంతేకాదు దానికింద సోనియాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మోడీ అన్నట్టు వ్యాఖ్యానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన జతిన్ రాజ్.. ప్రశాంత్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో తమ అనుచరులతో కలిసి వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త పెద్దదై కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇక అటుగా వెళుతున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినా అక్కడ కూడా వారు కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం స్టేషన్ బయట జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం స్టేషన్ లోపల జరిగిందని ఆరోపిస్తున్నారు.

గుల్బర్గ్ హత్యాకాండ.. 11 మందికి జీవిత ఖైదు

గోద్రా అల్లర్లు జరిగిన మరుసటి రోజే జరిగిన గుల్బర్గ్ గా హత్యాకాండ కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడైంది. 2002 లో జరిగిన గుల్బర్గ్ గా సొసైటీ హత్యాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహెసాన్ జాఫరి సహా 69మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసుపై విచారించిన కోర్టు దోషులకు శిక్ష విధించింది. కేసులో బిజెపి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బిపిన్‌ పటేల్‌తో సహా 24 మందిని నిందితులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించగా.. వారిలో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది. మరో పన్నెండుమందికి ఏడేళ్లు.. మరొకరికి పదేళ్ల శిక్షను విధించింది.