ఎంటీసీఆర్.. భారత్ కు సభ్యత్వం

  ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యర్ధ దేశాలు చైనా, పాకిస్థాన్ దేశాలు కూడా బాగానే అడ్డుపడుతున్నాయి. అయితే ఇప్పుడు కొంతలో కొంత ఊరటగా.. ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్) లో భారత్ కు సభ్యత్వం లభించింది. దీంతో ఇక నుండి ఇండియాలో తయారు చేసే పృథ్వి తరహా క్షిపణులను ఇకపై విదేశాలకు విక్రయించవచ్చు. దీనిలో భాగంగానే.. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్.. నేడు జరిగే ఓ కార్యక్రమంలో, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ ప్రతినిధుల సమక్షంలో ఎంటీసీఆర్ పై సంతకాలు చేయనున్నారు. ఈ సందర్భంగా 48 దేశాల అణు సరఫరాల బృందంలో చేరలేకపోయిన తరుణంలో ఎంటీసీఆర్ లో పూర్తి సభ్యత్వం శుభపరిణామమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.

సీఎం అభ్యర్ధిత్వానికి షీలా నో.. కారణం అదేనా..?

యూపీ సీఎం అభ్యర్ధి ఎవరన్న దానిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ సీఎంగా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి షీలా దీక్షిత్ నిరాకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్ధిత్వంపై సోనియాగాంధీ షీలా దీక్షిత్ తో చర్చించగా దానికి ఆమె నిరాకరించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనికి కారణం  షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన నీళ్ల టాంకర్ల కుంభకోణంపై ఆరోపణలు రావడమే అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నీళ్ల టాంకర్లపై కుంభకోణ జరిగిందంటూ షీలా దీక్షిత్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె విచారణలో పాల్గొననున్నారు.   కాగా ముందుగా యూపీ సీఎం అభ్యర్దిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బరిలో దించుదామని అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని.. రాహుల్ ను కాకుండా.. ప్రియాంక గాంధీని బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ప్రియాంక గాంధీనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ సోనియా గాంధీ మాత్రం షీలా దీక్షిత్ ను ఎన్నికల్లో దించాలని చూశారు. ఈ నేపథ్యంలో ఆమెతో భేటీ కూడా అయ్యారు. కానీ ఆఖరికి ఆమె నిరాకరించింది. మరి ఇప్పుడు ఎవరు ఎన్నికల బరిలో దిగుతారో చూడాలి. రాహుల్ కు అవకాశం ఇస్తారా.. ? లేక ప్రియాంకాకు అవకాశం ఇస్తారా..? లేక వారిద్దరికి కాకుండా.. మరెవరికైనా అవకాశం ఇస్తారా చూడాలి. సోనియా ఏ నిర్ణయం తీసుకుంటారో..

ఉద్యోగుల రాకతో రాజధానిలో హడావుడి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు దాదాపు అమరావతి చేరిపోయారు. ఈ నెల 27 వరకూ ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందే అని చంద్రబాబు చెప్పగా.. ఉద్యోగులందరూ దాదాపు వచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగులకు సాదరంగా ఆహ్వానం పలికారు. గుంటూరు, కృష్ణాజిల్లలో ఇప్పటికే 25కి పైగా కార్యాలయాలు ఏర్పాటవ్వగా.. ఈ రోజు ఒక్కరోజే మరో 15 కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన 300 మండి ఉద్యోగులకు వారంరోజుల పాటు ఉచిత వసతి సౌకర్యాలు అందించనున్నారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ప్రారంభమైన కార్యాలయాలు. విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరితశ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయితీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం * మారుతీ నగర్ లోని జీపీఆర్ స్ట్రీట్ లో ఉన్న వీ ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు * పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జెడ్పీ ఆఫీసులో పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. * ప్రసాదంపాడులో అద్దెకు తీసుకున్న భవంతిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఆఫీసులను ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు. * గొల్లపూడిలో ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాళిని, శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా, బస్ భవన్ ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్టేజ్‌పై సిద్దూకి ముద్దిచ్చింది

ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె సభావేదికపైనే అందరూ చూస్తుండగానే సీఎం బుగ్గ మీద ముద్దు పెట్టేసింది.ఈ పరిణామంతో సభలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనిపై సదరు మహిళ మీడియాతో మాట్లాడింది. ఆయన నా తండ్రిలాంటి వాడు..మొదటిసారి నేను ఆయన్ని కలుస్తున్నాను. ఆ సంతోషాన్ని ఆపుకోలేక ముద్దుపెట్టుకున్నాను...ఇందులో తప్పేముంది అని చెప్పింది. ముఖ్యమంత్రిని ఎవరో ముద్దుపెట్టుకున్నారంట అనే వార్త ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తోంది.

రేవంత్‌రెడ్డిపై మరో కేసు

టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేత మన్నె గోవర్థన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్ మాట్లాడుతూ..కేసీఆరే ఆంధ్రావాళ్లతో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. చండీయాగానికి చంద్రబాబు, వెంకయ్యను పిలిచారని, ఇలా అందరూ ఆంధ్రావాళ్లనే పిలిచారని, తెలంగాణ కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పిలవలేదన్నారు. తెలంగాణ కోసం అడ్డుపడ్డవాళ్లే ఆయనకు ఆత్మీయులయ్యారన్నారు. దీనిపై స్పందించిన గోవర్థన్ రేవంత్‌పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 504, 290, 188 సెక్షన్ల కింద పోలీసులు రేవంత్‌పై కేసు నమోదు చేశారు.

ఒక రైలును తప్పించబోయి..మరో రైలు కిందపడిన తల్లీకూతుళ్లు

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. తల్లీకూతుళ్లు ఒక రైలును తప్పించుకోబోయి..మరో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని దళవాయికొత్తపల్లెకు చెందిన కలీం కుటుంబం కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తోంది. కలీం భార్య హల్మాన్స, కుమార్తె తరానా నిన్న ఇంట్లోకి సరుకులు కొనేందుకు కుప్పం వెళ్లారు. సరుకులు కొని స్థానిక టీటీడీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న సందులోంచి రైలు పట్టాల మీదకు వచ్చారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకునే క్రమంలో తళ్లీకూతుళ్లు పక్కనే ఉన్న మరో ట్రాక్ మీదకు దూకారు. అదే సమయంలో అ వైపు నుంచి గూడ్స్ దూసుకొచ్చింది. దీంతో హతాశులైన తల్లీబిడ్డకు ఎటు వెళ్లాలో పాలుపోక ఇద్దరు పట్టాల మీదే నిలబడిపోయారు. వారిద్దరినీ గూడ్స్ రైలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లీకూతుళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికంటూ ప్రయత్నించారు. కాని విధి ముందు తలవంచక తప్పలేదు..ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

న్యాయవాదిని సజీవ దహనం చేసిన దుండగులు

రంగారెడ్డి జిల్లా కీసరలో దారుణం జరిగింది. నిన్న అర్థరాత్రి ఓ న్యాయవాదిని దుండగులు కారులో సజీవదహనం చేశారు. కుషాయిగూడకు చెందిన న్యాయవాది ఉదయ్‌కుమార్‌ను దాయారు కీసర వద్ద నిర్మానుష్య ప్రాంతంలో కారుతో పాటు దహనం చేశారు. ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోపల పూర్తిగా కాలిపోయిన మృతదేహన్ని కనుగొన్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, ఇతర ఆధారాలతో హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది ఉదయ్‌కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా చేరుకున్నారు. నిన్న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చైనా బయల్దేరారు. ఇవాళ ఉదయం హాంకాంగ్ చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు 12 మంది సభ్యులున్నారు. రెండు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. దీనిలో భాగంగా హాంకాంగ్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే టియాంజిన్ నగరానికి సీఎం బృందం చేరుకుంటుంది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు.

పోలీసుల అదుపులో డిప్యూటీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం మధ్య సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటున్నాయి. ఆప్ ఎమ్మెల్యే దినేష్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టినందుకు గానూ ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళనకు దిగిన వారు సిసోడియాతో కలిసి రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోడీ అధికార నివాసానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఢీల్లీ పోలీసులు ప్రధాని నివాసం వెంబడి 144 సెక్షన్ విధించారు. దీనితో పాటు సిసోడియాతో పాటు 65 మంది ఎమ్మెల్యేలను రేస్‌కోర్స్ రోడ్డుకు వెళ్లకుండా తుగ్లక్ రోడ్డు సమీపంలో వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   నిన్న సిసోడియా ఘజియాబాద్ మండిలో పర్యటించిన సందర్భంగా తమను దూషించారంటూ పలువురు వ్యాపారవేత్తలు డిప్యూటీ సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన తనపై ఫిర్యాదు చేసిన వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని...వాటిని మానకుంటే లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చిరించినట్టు సిసోడియా తెలిపారు. తనపై కావాలనే కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. వరుస పరిణామాలను గమనిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ ఎదుట సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ప్రకటించారు.

మనసున్న ముఖ్యమంత్రి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పెద్ద మనసును చాటుకున్నారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలంలోని ఆర్ఎస్ కొత్తపల్లే గ్రామానికి చెందిన 9 నెలల బిడ్డ జ్ఞానసాయి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు. చికిత్స కోసం ఇప్పటి వరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. పాప బతకాలంటే మరో 30 లక్షల రూపాయలు కావాలి. కానీ అంత స్థోమత వారికి లేదు. దీంతో బిడ్డను చంపుకునేందుకు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్నారు.   ఈ విషయం మీడియా వెలుగులోకి తీసుకురావడంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పాప పరిస్థితి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. చిన్నారికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లను ఎంపిక చేసి చిన్నారికి వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ముంబైలో కుంభవృష్టి

దేశ ఆర్థిక రాజధాని ముంబై తడిసి ముద్దవుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు మహా నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని కొలాబా, శాంతాక్రజ్ ప్రాంతాల్లో 26.8 మి.మీల నుంచి 50 మి.మీల వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. లోకల్ రైళ్లను నడపటానికి ఇబ్బందులు ఏర్పడినప్పటికి సాధారణ సమయానికే రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ముంబయితో పాటు కొంకణ్ తీరం, గోవాల్లో కూడా వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

ఖైదీలతో పోలీసుల మందుపార్టీ..ఉద్యోగాలు ఊస్టింగ్

ఎక్కడైనా హోదా..అధికారం అడ్డోస్తాయేమో కానీ మందు దగ్గర మాత్రం అందరూ ఒక్కటే. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా..తాజాగా కోర్టు విచారణకు తీసుకువెళ్లిన ఖైదీలతో పోలీసులు మందుకొట్టి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ సెంట్రల్ జైల్లో వార్డర్లుగా పనిచేస్తున్న ప్రమోద్ జాదవ్, సాగర్ బోధ్లే, రాహుల్ దోంగ్డేలు విచారణ నిమిత్తం ఓ ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే విచారణ ముగిసిన వెంటనే తిరిగి జైలుకు రావాల్సిన వారు..ప్రభుత్వ వాహనాన్ని కోర్టు ఆవరణలోనే వదిలేసి ప్రైవేట్ వాహనంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లి అక్కడ మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత నగరంలో కరడుగట్టిన నేరస్థుడైన గణేశ్ సురేశ్ వా ను కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. ఎంజాయ్ చేసి చేసి అలసిపోవడంతో రాత్రి కోర్టు దగ్గరికి వెళ్లి పోలీస్ వ్యాన్‌లో తిరిగి జైలుకు చేరుకున్నారు. లేటెందుకైందని ఉన్నతాధికారులు ప్రశ్నించడంతో వ్యాన్ చెడిపోయిందని..బాగు చేసుకుని వచ్చేలోగా ఆలస్యమైందని కహానీ చెప్పారు. దీనిపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా మందుపార్టీ విషయం బయటకు వచ్చింది. పోలీసులై ఉండి నేరస్థులతో గడిపినందుకు వీరి ముగ్గుర్ని సర్వీసు నుంచి తొలగించారు.

బీసీసీఐ పేరు మారబోతోంది..?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డుగా పేరు గాంచిన బీసీసీఐ పేరు మారబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు. 1928లో బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఇదే పేరు స్థిరపడిపోయింది. "ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా"లో "కంట్రోల్" అనే పదాన్ని మార్చనున్నట్లు ఠాకూర్ తెలిపారు. బోర్డు ఎవరిని నియంత్రించదని..ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు, కోచ్‌లు, సెలక్టర్లు, పరిపాలనా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. అందువల్ల "కంట్రోల్" అన్న పదం మార్చి దాని స్థానంలో "కేర్" అనే పదాన్ని పెట్టాలనుకుంటున్నామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీసీసీఐ వెబ్‌పైట్‌లో దీనిపై ఓటింగ్ పెడతామని ఆయన తెలిపారు.

కేసీఆర్, హరీశ్ రావు ఆంధ్రా వాళ్లతో కుమ్మక్కయ్యారు..

  తెలంగాణలో ప్రస్తుతం మల్లన్న సాగర్ పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు ఒక పక్క ప్రాజెక్ట్ ఎలాగైన పూర్తి చేస్తామని హరీశ్ రావు అంటుంటే.. దీనిని అడ్డుకొని తీరుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దీక్ష కూడా ప్రారంభించారు. దీనిలోభాగంగానే గజ్వేల్ నియోజక వర్గానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరీశ్ రావు, కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. మామా, అల్లుడు ఆంధ్రాకాంట్రాక్టర్లతో కుమ్మక్కయి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని.. అక్కడి ప్రజలు ప్రజెక్టు నిర్మాణానికి వ్యతిరేకత తెలిపినా కూడా మల్లన్న సాగర్ నిర్మించడం కోసం మంత్రి హరీశ్‌రావు రైతులను బెదిరిస్తున్నారని.. రైతులు శాంతియుతంగా వారి వ్యతిరేకతను తెలుపుతున్నారని, కాని హరీశ్‌రావు శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని విమర్శించారు.  4వేల గ్రామాలను కదిలిస్తామని హరీశ్‌ బెదిరిస్తున్నారని, అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. మరి దీనిపై హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

విషాదంలో దావూద్ ఇబ్రహీం..

  బాంబు దాడుల్లో పాత్ర వహించి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న అండర్ వరల్డ్ డాన్ కు కూడా విషాదం తప్పలేదు. గత కొంత కాలంగ కేన్సర్ వ్యాదితో బాధ పడుతున్న అతని తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. 1993లో ముంబైలో మారణ హోమం సృష్టించిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పరారైన దావూద్... పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భధ్రత మధ్య నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నాడు. ముంబై పేలుళ్లతో సంబంధం లేకున్నా హుమాయున్ కస్కర్ కూడా అతడిని సోదరుడి దగ్గరే ఉంటున్నాడు. ఇతనిపై ముంబైలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో గత కొంతకాలం క్రితం కేన్సర్ సోకిన కస్కర్ సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో అతడు ఇటీవలే చనిపోయాడు.