ఎవండోయ్ ఇది విన్నారా..పిల్లికి నోటీసులంట

పిల్లికి నోటీసులు ఇచ్చిన విచిత్రమైన సంఘటన హోస్టన్‌లో జరిగింది. బ్రౌజర్‌గా అందరి అభిమానాన్ని అందుకున్న ఆ పిల్లి టెక్సాస్‌లోని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీలో ఆరేళ్లుగా ఉంటోంది. అయితే దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చిన్నారులు పిటిషన్ వేశారు. ఓటర్లు కూడా వివిధ సందర్భాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దానిని అక్కడ నుంచి పంపించి వేయాలని టెక్సాస్ సిటీ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించింది. ఆ పిల్లిని అక్కడి నుంచి మరో చోటికి పంపించి వేయాల్సిందిగా ఎక్కువమంది ఓటు వేశారు. దీంతో నెల రోజుల్లో లైబ్రరీ ఖాళీ చేయాల్సిందిగా కౌన్సిల్ బ్రౌజర్‌కు నోటీసులు పంపింది. సిటీ హాల్, సిటీ బిజినెస్ జంతువులకు నివాస స్థలాలు కావని కౌన్సిల్ మెంబర్ ఎల్జీ క్లెమెంట్ పేర్కొంటూ పిల్లి లైబ్రరీని ఖాళీ చేయక తప్పదని పేర్కొన్నారు. అయితే బ్రౌజర్ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవని, అందరూ దానిని ఇష్టపడతారని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీ ఫ్రెండ్స్ అంటున్నారు.

ఆడవాళ్లపై అమానుషాలు ఇంకెన్నాళ్లు..

  ఆడవాళ్లపై ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటి వరకూ ఎన్నో ఘటనల గురించి వినుంటాం.. చూసుంటాం.. ఇప్పుడు ఒకేరోజు రెండు దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి.     రాజస్థాన్ లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా ఆమె భర్త.. అతనితో పాటు అతని సోదరులు కూడా అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని రేణి గ్రామానికి చెందిన జగన్నాథ్ తో బాధిత మహిళకు వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొంత కాలం నుండి అదనపు కట్నం కోసం జగన్నాథ్ వేధిస్తున్నాడు. అతనితో పాటు అతని సోదరులు కూడా ఆమెను హింసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారు ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం.. ఆమె ఒంటిపై అసభ్య పదాలతో కూడిన పచ్చబొట్లు కూడా పొడిపించారు. దీంతో ఈవిషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ దిగ్భాంతి వ్యక్తం చేసి.. కేసు విచారణను వెంటనే జరపాల్సిందే అని అదేశించారు.     తమిళనాడులో కూడా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ఫొటోను మార్ఫింగ్ చేసినందుకుగాను మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన విష్ణుప్రియ డిగ్రీ చదువుకుంటోంది. అయితే ఆమె ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనిపై విష్ణుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనంతరం మరో ఫొటోను మార్పింగ్ చేసి పెట్టగా బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి వచ్చేలోపే విష్ణుప్రియ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విగతజీవిగా ఉన్న తమ కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు మృతిపై విష్ణుప్రియ తండ్రి మాట్లాడుతూ.. ఫొటో చూసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని.. నిందితుణ్ని అరెస్ట్ చేసేంతవరకూ మృతదేహాన్ని తీసేది లేదని డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఆగడాలకు అంతం ఎప్పుడో..

హైకోర్టు ఆగ్రహం... 11 మంది జడ్జిలు సస్పెండ్..

  హైకోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో జడ్జిల సస్పెన్సన్ పై లాయర్లు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి ఎందుకు లెట‌ర్ రాయడం లేద‌ని న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప్రోత్సాహంతోనే తెలంగాణ న్యాయాధికారుల‌ను తొల‌గిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

మళ్లీ మేల్కొన్న రోజా.. చంద్రబాబుపై విమర్శలు..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెషన్ చేసినప్పుడు మాత్రం రోజూ.. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని.. టీడీపీ అధినేతను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రోజా.. ఆతరువాత ఆ వ్యవహారం ముగిసే సరికి చాలా రోజుల నుండి సైలెంట్ గానే ఉన్నారు. మళ్లీ ఇన్ని రోజుల తరువాత మేల్కొని.. చంద్రబాబుపై తన విమర్శల బాణాలు వదిలారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అంటూ ముందుకెళ్తుంటే.. చంద్రబాబు మాత్రం సింగపూర్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానా? లేక సింగపూర్‌కు రాజధానా? అని ప్రశ్నించారు. అంతే కాదు స్విస్ ఛాలెండ్ పద్దతిపై కూడా ఆమె మాట్లాడుతూ.. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతున్న అమరావతి దోపిడీని తాము అడ్డుకొని తీరుతామని.. ఏపీని చంద్రబాబు సింగపూర్ దొరల చేతుల్లో పెడుతున్నారని, సింగపూర్‌కు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేసారని విమర్శించారు. బినామీల కోసమే చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించారన్నారు. భూములను బినామీలతో కొనుగోలు చేయించారన్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అడ్డుకుంటామని, త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని రోజా తెలిపారు. మరి రోజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఎయిర్ హోస్టెస్ తో సెల్ఫీ.. యువకుడు అరెస్ట్..

ఎయిర్ హోస్టెస్ తో బలవంతంగా సెల్ఫీ దిగి.. ఆఖరికి అరెస్ట్ అయ్యాడు ఓ ప్రయాణికుడు. వివరాల ప్రకారం.. డామన్‌ నుంచి ముంబయి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోఅబు బకర్ అనే వ్యక్తి ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను చేయి పట్టుకొని లాగి సెల్ఫీ దిగుదాం రా అంటూ సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో ఆమె అరవడంతో మిగిలిన సిబ్బంది అక్కడికి రాగా.. అతను వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లాడు. అక్కడ కూడా సిగరెట్‌ తాగి బయటకు రావడంతో విమాన ప్రయాణ నియమాలను ఉల్లంఘించినందుకు గాను విమానం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి రాగానే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తాను నడుస్తుండగా అబు బకర్‌ తన చేయి లాగి ఓ సెల్ఫీ దిగుదాం రా అంటూ సెల్ఫీ తీసుకున్నాడని.. వద్దన్నా అతడు వినలేదని ఎయిర్‌హోస్టెస్‌ తన ఫిర్యాదులో వెల్లడించారు.

విజయకాంత్ మెడకు 500 కోట్లు...

  తమిళనాడు ఎన్నికల్లో డీఎండీకే అధ్యక్షుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి అధికారం నాదే అన్న రేంజ్ లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ రిజల్ట్ శూన్యం. చాలా దారుణంగా ఓడిపోయింది డీఎండీకే. అయితే ఇప్పుడు ఆయనపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు, జిల్లా శాఖల నాయకుల నుంచి సేకరించిన రూ.500 కోట్లు ఏమయ్యాయని మక్కల్‌ డీఎండీకే నేత చంద్రకుమార్‌ ప్రశ్నిస్తూ.. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌లపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నారు. డీఎండీకే నాయకుడు విజయకాంత్ పార్టీ అభివృద్ధి కోసం, సామాజిక కార్య్రకమాల్లో పేదలకు సహాయకాలు పంపిణీ కోసం జిల్లాలవారీగా పార్టీ శాఖల కార్యదర్శుల నుంచి తలా రూ.27 లక్షల వంతున రూ.500 కోట్ల వరకు విరాళాలు సేకరించి మోసగించారని ఆరోపించారు. ఆ విరాళాల మోసంపై త్వరలో ప్రజాహితవాజ్యం వేయాలని భావిస్తున్నామని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే..  ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంత మాత్రం ఇష్టం లేని చంద్రకుమార్‌ పార్టీ నుండి బయటకు వచ్చి.. క్కల్‌ డీఎండీకే పేరుతో డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.

ఆయన దారిలోనే నేనూ నడిచా.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనేనని.. ఆయన మార్గంలోనే తాను కూడా పయనించినట్టు తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానని.. అప్పటివరకూ అమలవుతున్న లైసెన్స్ కోటా రాజ్ విధానానికి పీవీ చరమగీతం పాడారని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియాను మార్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని అన్నారు. కాగా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు చైనాలో మూడు రోజులు పర్యటించనున్నారు.

బీజేపీ ఇప్పుడు కళ్లు తెరిచిందా..!

  చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలానే ఉంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విచ్చలవిడిగా.. అందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నంతకాలం సైలెంట్ గా ఉండి..ఇప్పుడు మాత్రం ఆయన వైఖరిపై మండిపడుతోంది. అంతేకాదు ఇన్ని రోజులు ఏం మాట్లడని ప్రధాని మోడీ.. స్వామి వ్యాఖ్యలపై స్పందించి చురకలు అంటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థ కంటే తాము ఎప్పుడు అధికులం కాదని.. అలా అలోచించకూడదని.. అది తప్పని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన ప్రసంగించాల్సిన రెండు సభలను రద్దు చేసింది బీజేపీ. ముంబైలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని, చెన్నైలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన మరో ప్రోగ్రామ్ నూ రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండింటిలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాల్సి వుండగా, ఆయనేం వ్యాఖ్యలు చేస్తారోనన్న భయంతోనే వీటిని రద్దు చేసినట్టు సమాచారం.   కాగా ఇటీవల కాలంలో సుబ్రహ్మణ్యస్వామి బాగా రెచ్చిపోయిన సంగతి విదితమే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు పెట్టి ఆఖరికి అరుణ్ జైట్లీని కూడా వదలకుండా విమర్శించారు. దీంతో పార్టీ నేతలు ఆయనపై అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా సభలు కూడా రద్దు చేసింది. మరి ఈ జాగ్రత్తలేవో ముందే తీసుకుంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. మరి స్వామి గారు ఇప్పటికైనా తన రూట్ మారుస్తారా.. లేక ఎప్పటిలాగే నాదారి రహదారి అంటారా చూడాలి.

విచిత్రం.. పిల్లికి 30 రోజుల నోటీసులు..

  సాధారణంగా ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నప్పుడో.. కొన్ని కారణాల వల్ల నోటీసులు జారీ చేస్తుంటాం.  అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏకంగా ఓ పిల్లికే నోటీసులు జారీ చేశారు. ఈ విచిత్రమైన ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ లైబ్రరీలో బ్రౌజర్ అనే పిల్లి గత ఆరేళ్లుగా ఉంటోంది. లైబర్రీకి వచ్చే వెళ్లే వారందరికీ ఈ పిల్లి బాగా తెలుసు. అయితే మొదట బాగానే ఉన్నా ఆ తరువాత.. మాత్రం అది తమను చదువుకోనివ్వకుండా డిస్టబ్ చేస్తుందని.. చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో లైబ్రరీ నిర్వాహకులు పిల్లిపై రెఫరెండం పెట్టారు. అయితే దీనికి కొంతమంది పిల్లని బయటకు పంపించాలని కోరగా.. కొంత మంది మాత్రం ఉంచాలని కోరారు. అయితే ఎక్కువమంది పంపించేయాలని కోరడంతో.. పిల్లికి 30 రోజుల నోటీసును ఇచ్చారు. మొత్తానికి పిల్లికి కూడా నోటీసులు ఇవ్వడం ఏంటో..

నాకు బ్రతకాలని ఉంది.. మోడీకి లేఖ..

  తనకు బ్రతకాలని ఉందని.. ప్రపంచాన్ని చూడాలని ఓ బాలుడు ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశాడు. వివరాల ప్రకారం.. అంశ్ ఉప్పేటి అనే బాలుడు బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి లేఖ రాశాడు. తనకు ఇప్పుడు 11 ఏళ్లని.. తనకు బ్రతకాలని ఉందని.. తన చికిత్స కోసం ఇప్పటికే తల్లి దండ్రులు ఇంటిని కూడా అమ్మేశారని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా అల్లోపతి చికిత్స తీసుకోలేకపోతున్నట్లు, ప్రస్తుతం ఆయుర్వేద ఔషధాలు వాడుతున్నట్లు.. జబ్బు కారణంగా కుటుంబం రెండుపూటలా తినడం కూడా గగనమైపోతోందని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు.

హైకోర్టు వద్ద భారీ బందోబస్తు.. ఢిల్లీకి లాయర్లు..

  తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లాయర్లు ఆందోళన చేపడుతున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిన్న 120 మంది న్యాయాధికారులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా నిరసనలు చేపట్టారు. ఈ రోజు కూడా లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో  హైకోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.  తనిఖీలు చేసిన వాహనాలనే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరో వైపు ఈ రోజు నుంచి చీఫ్‌ జస్టిస్‌ కోర్టును బహిష్కరిస్తామని లాయర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ లాయర్ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. తెలంగాణ మంత్రులు, ఎంపీలతో కలిసి కేంద్రంలో కీలక మంత్రులకు వినతిపత్రం ఇవ్వనున్నారు.

హత్యకు చిలుక సాక్ష్యం..

మన పంచతంత్ర కథల్లో జంతువులు, పక్షులు మాట్లాడుకోవడం చదివాం..అలాగే ఆ కథల్లో ఇతర జంతువుల మధ్య గొడవలు జరిగినప్పుడు సాక్ష్యాలు చెప్పడం విన్నాం. ఇప్పుడు అలాంటి సంఘటన ఈ 21వ శతాబ్ధంలో జరగబోతోంది. అమెరికాలోని మిచిగన్ సాండ్‌లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెన్న డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లెట్ గాయాలతో భర్త మార్టిన్ మృతదేహంతో పాటు బుల్లెట్ గాయంతో గ్లెన్న పడివుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు గ్లెన్నానే మార్టిన్‌ను హత్య చేసిందా లేదా మరేవరైనా వీరిపై దాడికి పాల్పడ్డారా అనేది అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో మరోసారి ఆధారాల కోసం ఇంటిని పరిశీలిస్తుండగా ఆ ఇంట్లో పెంపుడు చిలక ఇంట్లోంచి వెళ్లిపో..ఎక్కడి వెళ్లాలి..నన్ను కాల్చోద్దు అనే పదాలను పొడిపొడిగా చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. దీని ఆధారంగా ఈ కేసులో చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చిలక సాక్ష్యం కోర్టు పరిగణనలోనికి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

జగన్ ను తిట్టినందుకు ర్యాంకులా..?

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా.. మంత్రులు, అధికారుల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ర్యాంకులు ఇవ్వనున్నారంట. అయితే ఈ ర్యాంకులు ఎందుకనుకుంటున్నారా..? వింటే మీరు కూడా అశ్యర్యపోవాల్సిందే. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను ఎవరైతే ఘాటుగా విమర్శిస్తారో వారికి ర్యాంకింగ్స్ ప్రకటించనున్నారంట.   అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే అందరు నేతల సంగతేమో కాని ఈసారి మాత్రం.. ర్యాంకింగ్స్ ఇస్తే దేవినేని ఉమనే పస్టే ర్యాంకు కొడతారని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా జగన్ పై  విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికినా జగన్ ను ఏకి పారేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నాగానీ దేవినేని ఉమ మాత్రం జగన్‌పై మండిపడుతూనే వున్నారు. దీంతో ఈసారి దేవినేని ఉమకే ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.   మొత్తానికి పని చేసినందుకు ర్యాంకులు ఇవ్వడం చూశాం కానీ.. ఇలా తిట్టినందుకు ర్యాంకులు ఇవ్వడం వెరైటీగానే ఉంది. మరి చూద్దాం.. జగన్ ను ఎవరు ఎక్కువగా తిట్టారో.. ఎవరికి ఫస్ట్ ర్యాంకు వస్తుందో..

ఆఖరికి సుందర్ పిచాయ్ కూడా..

  ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేరిపోయాడు. ఆయన కూడా హ్యాకింగ్ కు బుక్కయ్యాడు. అవర్ మైన్ గ్రూప్ ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్టు చెబుతోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసి.. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. అంతేకాదు సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు పాల్పడ్డామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది.

స్వామి ఇప్పటికైనా మారతాడా..?

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నోటి గురించి తెలిసిందే. ఈమధ్య ఆయన నోటికి మరీ పని ఎక్కువ చెప్పేసి.. ఎవరి మీద పడితే వారిమీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలను విమర్సించడం నుండి మొదలు పెట్టిన ఆయన.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసే వరకూ వెళ్లారు. అయితే స్వామి ఇంతలా రెచ్చిపోతున్నా.. ప్రధాని మోడీ ఎందుకు ఆపే ప్రయత్నం చేయడం లేదు.. ఆయన నోటికి ఎందుకు బ్రేక్ వేయడం లేదు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు మోడీ స్వామి ఆరోపణలపై స్పందించి స్వామికి షాకిచ్చారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగాల్సిన అవసరముంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు' అని మోదీ తేల్చి చెప్పారు. అంతేకాదు రాజన్ గురించి మాట్లాడుతూ..  రాజన్ దేశభక్తిని ఏమాత్రం శంకించలేమని, తామందరికీ తీసిపోని స్థాయిలో ఆయనలో దేశభక్తి ఉందని అన్నారు.   కాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై స్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత వీదేశీ యాత్రలు చేసే మంత్రులు డ్రెస్సింగ్ పైనా కామెంట్లు చేస్తూ వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలోనే కాకుండా తిరుమల విషయంలో ఏపీ టీడీపీ పైనా కూడా ఆయన విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడైనా మోడీ వ్యాఖ్యలతో ఆయన తన నోటిని అదుపులో పెట్టుకుంటారో లేదో చూడాలి.

ఊసరవెల్లి లాంటి స్మార్ట్ పెన్...

మనం ఎన్నో రకాల పెన్ పేర్లు వింటుంటా. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి ఓ కొత్త స్మార్ట్ పెన్ రానుంది. దాని పేరు వింటేనే కొంచం వెరైటీగా ఉంది. మరి ఆ పెన్ పేరు ఎంటనుకుంటున్నారా..? ఊసరవెల్లి స్మార్ట్ పెన్ అంటా. అంటే ఈ పెన్ దగ్గర ఏదైనా రంగును ఉంచితే, అచ్చు గుద్దినట్టు అదే రంగులోకి మారిపోతుందన్నమాట. దీని పేరు 'స్క్రిబుల్ పెన్'. దీంతో అత్యంత సహజసిద్ధమైన రంగులను పెయింట్ చేసుకోవచ్చని దీన్ని తయారు చేసిన సంస్థ చెబుతోంది. స్క్రిబుల్ పెన్ లోని కలర్ సెన్సార్లు, ఓ రంగును స్కాన్ చేసి అదే రంగుతో పెయింట్ చేసుకునే కలర్ పెన్ గా మారిపోతుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పెన్ నుంచి వెలువడే రంగు నీళ్లు పడినా చెదిరిపోదట. మరి ఇది ఎప్పుడు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.