ఘనత చాటుకుంటే సరిపోదు.. కళ్లకూ కనబడాలి!
posted on May 1, 2023 @ 4:22PM
స్వరాష్ట్రం సాధనతో పాటు ..తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ పురోగమనం.. చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం గురించి అధికార బీఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా.. అంతకు మించి రాష్ట్రంలో అవినీతి గురించిన విమర్శలు వినవస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో సమానంలో వైఫల్యాలూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ మోడల్ అంటూ చేసుకుంటున్న ప్రచారం.. విపక్షాల అవినీతి ఆరోపణల ముందు వెలవెలబోతోంది.
ముఖ్యంగా టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ, సీబీఐ విచారణల తరువాత కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందనడంలో సందేహం లేదు. అయితే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి, సంక్షేమం విషయంలో కచ్చితంగా మెరుగ్గా ఉందని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అందుకే తెలంగాణ మోడల్ అంటూ సొంత భుజాలను తడుము కోవడం కంటే ముందే తెలంగాణ మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి, అందని సంక్షేమం గురించి ముందుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇకపోతే తెలంగాణ సచివాలయ నిర్మాణం, ప్రారంభాన్ని మహోజ్వల ఘట్టంతో పోలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు చేస్తున్న హడావుడి, ఆర్బాటం, సచివాలయంపై అక్కడ పని చేయాల్సిన ఉద్యోగులే పెదవి విరవడంతో తుస్సుమన్నట్లైంది.
ఉద్యోగులకు పని చేసుకోవడానికి అవసమైనంత విశాలంగా వివిధ శాఖలకు కేటాయించిన ప్రదేశం లేదని ఉద్యోగులు సచివాలయ ప్రారంభానికి ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి కేసీఆర్ ఏం చేసినా ఘనంగా చేస్తారు. ఆర్భాటంగా చేస్తారు. గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగిస్తారు. అలాగే కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో అవసరానికి మించి ఆర్భాటం చేశారు. అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందంటూ అడ్వర్టైజ్ మెంట్లు గుప్పించారు.
నిర్మాణ సమయంలో వీలైనన్ని సార్లు సందర్శించి పర్యవేక్షించారు. అలా పర్యవేక్షించిన ప్రతి సారీ కొత్త కొత్త సూచనలు చేశారు. మొత్తానికి 265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు కేసీఆర్ చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒక్క వర్షానికే నీరు చేరడం, ఫిల్లర్ బీటలు వారడం, సచివాలయం వ్యయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ చెబుతున్నంత హైప్ కొత్త సచివాలయానికి రావడం లేదు.
ఇక అన్నిటికీ మించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు సచివాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు రేవంత్ సచివాలయానికి బయలు దేరగా ఆయనను పోలీసులు టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు. ఎంపీనైన తననే అడ్డుకుంటున్నారంటే ఇక సామాన్యులను అసలు సచివాలయం వైపు కన్నెత్తి చూడనిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ సచివాలయానికి బయలుదేరడం, ఆయనను పోలీసులు నిలువరించడం అటుంచి.. ఏకంగా సచివాలయ విజిటర్స్ గేటునే ప్రారంభం జరిగిన మరుసటి రోజునే మూసి వేయడం విమర్శలకు తావిస్తోంది.