ఢిల్లీ మద్యం కుంభకోణం.. కవితకు మరిన్ని చిక్కులు!
posted on May 2, 2023 @ 9:53AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన మూడో చార్జిషీటులో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఈడీ ఈ చార్జిషీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది. దీంతో యిప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ల తో పోలిస్తే ఈ మూడో చార్జిషీట్ మరితం బలంగా, పకడ్బందీగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చార్జిషీట్ లో పొందు పరిచిన అంశాల మేరకు.. కవిత కు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న బూములు.. ఏవి, ఎక్కడ కొన్నారు.. యిందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు వంటి వివరాలను పొందుపరిచారు. వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిళ్లై లు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
మూడు రోజుల కిందట ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న ప్రచారం జరిగింది. ఈడీ వర్గాల లీకుల మేరకే ఈ ప్రచారం జరిగిందని అంటున్నారు. బుచ్చిబాబు నిజంగా అప్రూవర్ గా మారారా, లేదా అన్న విషయంలో స్పష్టత లేకపోయినా, ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా అయితే ఈ తాజా చార్జిషీట్ లో తేటతెల్లం అయ్యిందని అంటున్నారు. ఒక ఆడిటర్ తన క్లయింట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే.. ఆషామాషీగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అటున్నారు.
ఇక కవిత బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై యిప్పటికే అప్రూవర్ గా మారారు. తరువాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన బ్రేక్ అయిపోయారనీ, ఆయన చెప్పిన అంవాల ఆధారంగానే ఈడీ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత ఇరవై రోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యలో ఒక సారి మాత్రం సుప్రీంకోర్టులో తాన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని మెన్షన్ చేయించారు. అవన్నీ పక్కన పెడితే ఈడీ తాజా చార్జ్ షీట్ ప్రకారం కవిత డిల్లీ మద్యం కుంభకోణంలో పూర్తిగా చిక్కుల్లో పడ్డారని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.