కునుకు తీసినందుకు ఫలితం.. సస్పెన్షన్..!
posted on May 2, 2023 9:19AM
గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, మంత్రులు, చివరాఖరికి ప్రధాన మంత్రులు కూడా బహిరంగ సభలలో, కీలక సమావేశాలలో కునుకు తీసిన పలు సంఘటనలు టీవీలలో ప్రత్యక్షంగా వీక్షించిన అనుభవం ప్రజలకు ఉంది.
అసెంబ్లీ సమావేశాలలో, పార్లమెంట్ సెషన్ లలో హాయిగా నిద్రపోతూ కనిపించిన నేతలూ ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ అయితే.. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో పలు సమావేశాలలో, సభలలో హాయిగా నిద్రపోతున్న ఘటనలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వారెవరి మీదా పడని సస్పెన్షన్ వేటు.. గుజరాత్ లోని భుజ్ లో ఓ అధికారిపై పడింది. యింతకూ యిది జరిగిందెక్కడంటే.. 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లకు సంబంధించి భుజ్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా సీఎం పటేల్ ప్రసంగిస్తుండగా.. సభికుల్లో ముందు వరుసల్లో కూర్చున్న ఓ అధికారి కునుకు తీస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆయన్ను భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినందున నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కునుకు తీసే అలవాటును.. ముఖ్యమంత్రి పాల్గొనే ఇలాంటి ముఖ్య కార్యక్రమాల్లో కూడా పాటిస్తే ఎలా మాస్టారు.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు.. మీరేమైనా ప్రధాన మంత్రా లేకపోతే మంత్రా అలా ఎలా నిద్రపోతారంటూ సెటైర్లు వేస్తున్నారు.