టి. కాంగ్రెస్ లో నాలుగు దిక్కులూ ఒకటైనాయి!
posted on May 1, 2023 @ 4:43PM
అసమ్మతి, తిరుగుబాటు, ఆరోపణలు, నాయకత్వ లోపం ఈ నాలుగూ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే గుణాలు. వీటిని ప్రజాస్వామిక లక్షణాలని కాంగ్రెస్ ఎంత వెనకేసుకుంటూ వచ్చినా, ఈ గుణాలతో కాంగ్రెస్ రాజకీయంగా వెనుకంజ వేస్తూనే ఉంటుంది. ఇది గతం. వర్తమానం బహుశా బవిష్యత్తు కూడా. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో మూడు స్థానాలను గెలిపించి కాంగ్రెస్ కు తెలంగాణ ఓటర్లు కొత్త ఊపిరి పోశారు.
వీరిలో ఒకరు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు కాగా, మరొకరు ఇప్పటి టీపీసీసీ చీఫ్. మూడో వ్యక్తి ఎప్పుడూ అసమ్మతి గ్రూపు వైపు నిలబడే నేత. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత భుజాన వేసకున్న సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో కొంత ముందడుగు వేశారు. రేవంత్, ఉత్తమ్, వెంకటరెడ్డిలను ఒక్క తాటిపైకి తెచ్చి జానా తన పంతం నిలబెట్టుకున్నారు. అయితే ఒకే వేదికపై ఇక్యతనుచాటిన నలుగురూ ఈ ఐక్యతను ఎన్నికల వరకూ కొనసాగిస్తారా అన్నది అనుమానంగేనా ఉంది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, సచివాలయ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలతో దూసుకు పోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తోంది. బీఆర్ఎస్ కార్యక్రమాలను తప్పుపడుతున్న బీఆర్ఎస్ కార్యాక్రమాలను తప్పు పడుతున్న ఇతర రాజకీయ పార్టీల నేతలను అర్భకులుగా అభివర్ణించడం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సూచిస్తోంది.
మరో వైపు ప్రశ్న పత్రాల లీకేజీ, రైతు సమస్యలు, తాజాగా నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎన్నికల వేళ ఐక్యంగా ఉండాలన్న తలంపుతో ఉంది. ఉద్యమాల చరిత్ర ఉన్నతెలంగాణ గడ్డపై అనేక సంవత్సరాలుగా చెప్పుకోదగిన పరిణామాలు జరగలేదనే చెప్పాలి. 2014 తరువాత ఈ పదేళ్లలో స్తబ్దుగా ఉన్నసామాజిక వాతావరణాన్ని చైతన్యపరిచేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. గాంధీభవన్ లో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వీరు మారరు అని ప్రజలు భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర నేతలు ఒక్క మాటపై నిలబడడంతో కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త ఆశలు చిగురించాయి. నహైదరాబాద్ ఓఆర్ఆర్ ను 30 సంవత్సరాల లీజు వ్యవహారంలో వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఈ విషయంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి కంప్లెయింట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. 30వ తేదీన ప్రారంభమైన తెలంగాణ సచివాలయానికి తమ పార్టీ అధ్యక్షుడిని రాకుండా అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏది ఏమైనా ఇంత కాలానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఒక్కటికా పోరాడాలని తీసుకున్ననిర్ణయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.