లోకేష్ పాదయాత్రలో జనసేన జెండా రెపరెప!
posted on May 2, 2023 @ 10:42AM
ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా పొత్తులు, ఎత్తులు, సమీకరణాలపై నెలకొన్న అస్పష్టత మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పొత్తు ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జరిపిన సుదీర్ఘ భేటీ అనంతరం ఈ రెండు పార్టీలే కాదు.. బీజేపీ కూడా వీటితో కలిసి అడుగులు వేయడం తథ్యమన్న సంకేతాలనిచ్చింది.
బీజేపీ తన భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తటస్థంగానో.. లేకపోతే తెలుగుదేశం, జనసేన కూటమికి దూరంగా ఉన్నా.. లోపాయికారీ మద్దతు మాత్రం తెలుగుదేశం, జనసేన కూటమికే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన పొత్తు మాత్రం ఖాయమన్న సంకేతాలు చంద్రబాబు, పవన్ తాజా భేటీ ద్వారా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనంటూ పదే పదే చెప్పిన, చెబుతున్న పవన్ కల్యాణ్ తాజాగా బాబుతో జరిపిన భేటీతో జనసైనికులకు ఇక ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా మనం తెలుగుదేశంతోనే కలిసి నడుస్తున్నామన్న సంకేతాలు ఇచ్చేశారు. పవన్ సినిమాలలో బిజీగా ఉండి.. ఎన్నికలు దగ్గరపడుతున్నా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో అనుమానంలో ఉన్న జనసైనికులకు తాజా బేటీతో స్పష్టత ఇవ్వడమే ఈ బేటీ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యిక ఈ భేటీ తరువాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ , సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన ఇక ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా చేసింది.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పొత్తులు ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొత్త విషయంలో అధికారిక ప్రకటన కంటే ముందే ప్రజలలోకి ఆ విషయాన్ని తీసుకు వెళ్లాలని యిరు పార్టీలూ నిర్ణయానికి వచ్చినట్లు పరిశీలకులు చెబుతున్నారు. జనసేనాని వారాహి యాత్రకు ముందే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేసే వాతావరణం ఏర్పడేందుకు పవన్, చంద్రబాబు తాజా భేటీ దోహదం చేస్తుందని అంటున్నారు. రెండు పార్టీలూ కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను పొత్తుకు అనుకూలంగా సన్నద్ధం చేయడం కోసమే.. తాజా భేటీ జరిగిందని అంటున్నారు. అంటే ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చేసే ఆందోళనలో ముందు ముందు రెండు పార్టీలు కలిసి పాల్గొనే వాతావరణం ఏర్పడేందుకు ఈ భేటీ దోహదం చేసిందని అంటున్నారు.
ఈ భేటీ తరువాతే లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు మొదలయ్యాయి. దమ్ముంటే అన్ని సీట్లకూ పోటీ చేయండి అని తెలుగుదేశం, జనసేన పార్టీలను సవాల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్ కు ఈ భేటీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనని అంటున్నారు.