నిరసన సెగలతో ఫ్రస్ట్రేషన్.. సొంత పీఏ చెంప ఛెళ్లు.. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం
posted on May 2, 2023 @ 9:58AM
వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో వారేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా వ్యవహరిస్తున్నారు. ఒక మంత్రిగారు మీ కోసం మా ప్రభుత్వం ఎంతో చేస్తోంది. అయినా మీరు చప్పట్లు కొట్టడం లేదంటూ జనంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు యిస్టముంటే మాకు ఓట్లేయండి లేకపోతే మానేయండి అంటే వార్నింగ్ లాంటి వ్యాఖ్యలు చేశారు.
యిది జరిగిన రోజు వ్యవధిలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీ వారే సమస్యలపై నిలదీసే సరికి తట్టుకోలేక సొంత పిఏపైనే చేయి చేసుకున్నారు. అదీ బహిరంగంగా జనం మధ్యలో.. యింతకీ ఆ పీఏ చేసిన నేరమేమిటంటే జనంపైకి దూసుకెళుతున్న ఎమ్మెల్యేను వారించడమే.. ఔను ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన పీఏ నవీన్ వర్మ వారించే క్రమంలో ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప ఛెళ్లుమనిపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో సొంతపార్టీ నేతల నిరసనల మధ్యే కార్యక్రమం కొనసాగింది.
గతంలో కూడా ఈ ఎమ్మెల్యే దురుసువర్తన వార్తలకు ఎక్కింది. తనకు విద్యాదీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే గతంలో దురుసుగా ప్రవర్తించారు. కొద్దిరోజుల క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. మళ్ల శంకర్ అనే వ్యక్తి ఇంటి వద్దకెళ్లి ఆయన కుమార్తెను అమ్మఒడి పథకం అందిందా అని ప్రశ్నించారు. అందిందని ఆమె తెలిపింది. తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన మంజూరు కాలేదని శంకర్ కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకు తెలిపాడు.
నువ్వు చదువుకున్న పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడమెందుకని యువకుడు ఎదురు ప్రశ్నవేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్నవేస్తావా? ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మళ్లీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు సమాధానం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నావ్. పళ్లు పీకేస్తా అంటూ విద్యార్థిపైకి దూసుకువెళ్లారు. ఎమ్మెల్యే ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశమైంది. పథకాలు అందరికీ అందించలేని అధికార ప్రతినిధులు.. వాటి గురించి ప్రశ్నిస్తే..ఇలా దురుదుగా ప్రవర్తించడమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.