శివకుమార్ కు తప్పిన ప్రమాదం
posted on May 2, 2023 @ 4:16PM
కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం శివకుమార్ హెలికాప్టర్ లో బయలు దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఓ డేగ ఢీకొట్టింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం డీకే శివకుమార్ ముళబాగిలులో ఎన్నికల ప్రచారం కోసం మధ్యాహ్నం హెలికాఫ్టర్ లో బయలుదేరారు.ఆ హెలికాప్టర్ హోసకోట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా ఓ డేగ వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో డీకే శివకుమార్ కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్ కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అతనికి చికిత్స అందించారు.కర్ణాటకలో ఈ నెల 10 పోలింగ్ జరగనుంది. కూత వేటు దూరంలో ఎన్నికలు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.
శివకుమార్ ఏడుసార్లు ఎంఎల్ఏ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్యభూమిక వహించారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శివకుమార్ అత్యంత సంపన్న రాజకీయ నేతగా రికార్డుల్లోకెక్కారు