వారం పాటు తెలంగాణలో పాలన స్టాండ్ స్టిల్!?
posted on May 2, 2023 @ 1:48PM
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లోకి విపక్ష నేతలూ, సామాన్యులనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ నో ఎంట్రీయే. సచివాలయ ప్రారంభోత్సవం అయితే ఆర్భాగంగా చేసేశారు కానీ, సచివాలయంలో ఉద్యోగుల విధినిర్వహణ, సచివాలయంలోనికి వారు ప్రవేశించాల్సిన మార్గం తదితర అంశాలపై ఒక క్లారిటీకి రాకపోవడంతో ప్రారంభం అయిన మరుసటి రోజు నుంచే అంతా గందరగోళంగా మారిపోయింది.
సోమవారం (మే 1)న సీఎస్ ను కలవడం కోసం సచివాలయానికి బయలు దేరిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే పోలీసులు నిలువరించి సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. సరే అదే రోజు సచివాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అనుమతి లేదంటూ అక్కడి భద్రతా సిబ్బంది వెనక్కు పంపేశారు. ఇదే అనుకుంటే.. సచివాలయ ఉద్యోగులకు సైతం ప్రవేవం లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. ఏ గేటు నుంచి ఎవరికి ఎంట్రీ అన్న విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి క్లీరిటీ ఇవ్వకపోవడంతో సెక్రటేరియెట్ నో ఎంట్రీ భవన్ గా మారిపోయిందని చెబుతున్నారు. దీంతో రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజు నుంచే అన్నిశాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పిన ప్రభుత్వం మాటలు అమలులోకి రాకుండా పోయాయి.
సచివాలయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశామని ప్రభుత్వం ప్రకటించేసింది. అంతే కాదు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ నుంచి శాఖలకు సంబంధించిన పైళ్లను నూతన సచివాలయానికి తరలించేందుకు మూడ్రోజులు గడువు కూడా విధించింది. అలాగే ఏ సమయంలో ఏ శాఖలను తరలించాలన్న గైడ్ లైన్స్ తో ఆధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు సరిపోలేదో... ఆయా శాఖలకు కేటాయించిన ఫ్లోర్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేదో కారణమేదైనా కొన్నిశాఖలకు చెందిన ఫైళ్లు, డేటా తరలింపు పూర్తి కాలేదు.
ఇంటర్నెట్ సౌకర్యం సైతం కల్పించలేదు. దీంతో సచివాలయం ప్రారంభం అయ్యిందే కానీ అక్కడ పనులు మొదలు కాలేదు. ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. మొత్తం మీద సచివాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు కనీసంలో కనీసం వారం రోజులు పడుతుందని సంబంధిత అధికారులే అంటున్నారు. అంటే తెలంగాణలో పాలన కనీసం వారం రోజుల పాటు స్తంభించిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.