ఔను వాళ్లిద్దరూ కలిశారు.. ఇక వైసీపీ పని దబిడి దిబిడే!
posted on May 2, 2023 @ 11:08AM
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు ఖరారైందన్న సంకేతాల మధ్య వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయింది. అందుకే ఆ పార్టీ నాయకులు జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ వంటి స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలే కాదు దూషణలకు కూడా వెనుకాడటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే జనాగ్రహాన్ని తట్టుకోలేక, సొంత పార్టీ శ్రేణులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోవడాన్ని సహించలేక సొంత పీఏపైనే చేయి చేసుకుని ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టుకున్నారు.
ఇక ఆ పార్టీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణం రాజు తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే వైసీపీ ఔట్ అని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ కలిస్తే వసీపీ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోవడం తథ్యమన్నారు. ఏపీకి విశాలమైన తీర ప్రాంతం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే.. ఆ విశాల తీర ప్రాంత గర్భంలో వైసీపీ కలిసిపోతుందని రఘురామ రాజు జోస్యం చెప్పారు. నెల్లూరు టు శ్రీకాకుళం, రాయలసీమ యిలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన అన్నారు.
అవినాష్ రెడ్డి అరెస్టుపై దాగుడుమూతల పర్వం సాగుతున్నప్పటికీ.. ఆయన అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాన్ని రఘురామ రాజు సోమవారం(మే1) రచ్చబండ లో భాగంగా మీడియాతో చెప్పారు. యిప్పటికే ఏపీ ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని వదిలించుకోకతప్పదన్న నిర్ణయానికి వచ్చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామ రాజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే బీజేపీకి తెలుగుదేశం, జనసేనలతో కలవక తప్పదనే అనిపిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో రెండవ స్థానంలో అధికార వైసీపీ కచ్చితంగా ఉంటుంది. యిది యిప్పటికే ప్రజలు తీసేసుకున్న నిర్ణయం. సో ప్రజల నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకం కావాలి. అవుతాయి అని రఘురామ అన్నారు.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే టిడిపి, జనసేన కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారు. అంటే రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడో కలిసిపోయింది. యిప్పుడు నాయకులు కలుస్తున్నారు. అది వారికి అనివార్యంగా పార్టీ క్యాడర్ మార్చేసింది. దీంతోనే వైసీపీకి బ్యాడ్ టైం మొదలైంది అని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గతం లో వైసీపీకి 50 % ఉన్న ఓటు బ్యాంక్ గణనీయంగా తగ్గింది. టీడీపీ కి కష్టకాలంలోనూ 40% ఓటు బ్యాంకు ఉండగా, ఇప్పుడు అది భారీగా పెరిగిందని చెప్పిన వైసీపీ రెబల్ ఎంపీ.. ఏ విధంగా చూసినా వైసీపీ రానున్న ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారాన్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు.