థాయ్ ల్యాండ్ లో చీకోటి అరెస్టు.. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు
posted on May 1, 2023 @ 3:08PM
తెలుగు రాష్ట్రాలలో చీకోటి ప్రవీణ్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుడివాడ క్యాసినో వ్యవహారంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ కు తెలుగు రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. అటువంటి చీకోటి ప్రవీణ్ తాజాగా థాయ్ లాండ్ లో అరెస్ట్ అయ్యాడు.
పట్టాయా లోని ఏషియన్ పట్టాయా అనే లగ్జరీ హోటల్ లో భారీ ఎత్తిన గ్యాంబ్లింగ్ జరుగుతోందంటూ అందిన సమాచారం మేరకు థాయ్ ల్యాండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో ఈ ఘటనలో అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో మొత్తం 92 మందిని అరెస్టు చేయగా వారిలో 80 మందికిపైగా భారతీయులే కావడం విశేషం. ఆ అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 20 కోట్ల నగదు, కెమెరాలు, 92 ఫోన్స్ ,మూడు నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా ఈ హోటల్ ను ఏప్రిల్ 27 నుంచి మే 1(సోమవారం) వరకూ బుక్ చేసుకున్నారనీ, ప్రత్యేకించి కాసినో కోసమే దీనిని బక్ చేసుకున్నారని థాయ్ ల్యాండ్ పోలీసులు చెబుతున్నారు.
అదలా ఉంటే థాయ్ లాండ్ లో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ అరెస్ట్ వార్త ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినోతో చీకోటి ప్రవీన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా, ప్రవీణ్ కు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకులకు సంబంధాలున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులతో చీకోటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో తెలుగుదేశం నేతల గుడివాడ కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత ఈ వ్యవహారంలో కొంత కాలం స్తబ్దత నెలకొంది. తెలుగుదేశం నాయకుల ఫిర్యాదును ఈడీ పట్టించుకోలేదన్న విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి.
అయితే హఠాత్తుగా గత ఏడాది జులైలో ఈడీ చీకోటి ప్రవీణ్ కు చెందిన కార్యాలయాలు, నివాసాలలో దాడులు నిర్వహించింది. ప్రవీణ్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ ను విచారించింది. ఈ వ్యవహారం అంతా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి, చీకోటి వెనుక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి చీకోటి ప్రవీణ్ ఫోన్ లో, ల్యాప్ టాప్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలకు వెళ్లిన కస్టమర్ల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకూ చెందిన పలువురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు కూడా అప్పట్లో బాగా ప్రచారమైంది. ఆ తరువాత ఇన్నాళ్లకు చీకోటి ప్రవీణ్ థాయ్ ల్యాండ్ లో క్యాసినో నిర్వహిస్తూ అరెస్టయ్యాడన్న వార్త మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పట్లో చీకోటి నిర్వహించిన క్యాసినోకి వెళ్లారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఆందోళన వ్యక్తమౌతోంది. మళ్లీ చీకోటి ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అలాగే అప్పట్లో చీకోటి నివాసాలపై దాడుల సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈడీ విచారించిన సంగతి విదితమే. అలాగే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి సన్నిహితుడైన ఒకరిని కూడా అప్పట్లో ఈడీ విచారించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే థాయ్ ల్యాండ్ లో చీకోటి అరెస్టు వార్తతో మరోసారి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులతో చీకోటి ప్రవీణ్ చీకటి సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.