మల్లారెడ్డి పోలవరం వ్యాఖ్యలు.. నవ్వించారా.. నవ్వుల పాలయ్యారా?
posted on May 2, 2023 @ 3:45PM
తెలంగాణ మంత్రులలో చామకూర మల్లారెడ్డిది ఒక విలక్షణ శైలి. ఆయన విమర్శలకు కానీ, పొగడ్తలకు కానీ హద్దులు ఉండవు. ఆయన చేప్పే మాటలు కోటలు దాటేస్తాయి. అయితే అందులో విషయం మాత్రం గడప దాటే పాటి కూడా ఉండదు. ఒక సారి కాదు పలు మార్లు ఆయన తన విలక్షణ, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలోకెక్కారు. విద్యాసంస్థల అధిపతిగా మల్లారెడ్డి సంపాదనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శలను ఆయన ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే భూ కబ్జా ఆరోపణలపై ఆయన రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరి ఫన్ సృష్టించారు. ఆ తరువాత తన నివాసాలపై ఐటీ దాడులు జరిగిన సమయంలో ఆయన విన్యాసాలు, ప్రసంగాలు ఏవీ కూడా ఆయనపై సానుభూతి కలిగించేవిగా కాకుండా నవ్వుకునేలా, నవ్వించేలాగే ఉన్నాయి.
తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో పోవలరం ప్రాజెక్టు పూర్తి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా సామర్ధ్యం తెలంగాణ ముఖ్యమంత్రికే ఉందని ఆయన వాకృచ్చారు. పనిలో పనిగా ఏపీలో నోరూ జారారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ స్థిరపడిన ఆంధ్రుల ఓట్లపై బీఆర్ఎస్ కన్నేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే విశాఖ ఉక్కు విషయంలో ఉన్న పరువును గంగలో కలుపుకున్న బీఆర్ఎస్ అధినేతను ఆకాశానికెత్తేయడానికా అన్నట్లు ఏపీలో పోలవరం పూర్తి కావాలంటే ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గమన్నారు. ఆ వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడాలన్న కేసీఆరే దిక్కని అన్నారు. అక్కడితో ఆగలేదు. అవి రెండూ కావాలంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని మల్లారెడ్డి చెప్పారు. ఏదో ఏపీలో బీఆర్ఎస్ విజయం సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేసి ఊరుకోలేదాయన.. అక్కడ బీఆర్ఎస్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టనీ, అది పూర్తి చేయాలంటే కేంద్ర నిధులు అవసరమన్న సంగతిని మల్లారెడ్డి కన్వీనియెంట్ గా మరచిపోయారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్న సంగతిని విస్మరించి ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామనీ, పోలవరం పూర్తి చేసేస్తామని మల్లారెడ్డి చెబుతున్న మాటల వెనుక ఉన్నది ముఖ్యమంత్రి ప్రాపకం కోసం పాకులాట వినా మరోటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఉక్కు ఫ్యాక్టరీ గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సొంత రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతి విస్మరించి పొరుగు రాష్ట్రంలో పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి కాపాడతామంటూ మల్లారెడ్డి చెబుతున్న మాటలు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు అన్న చందంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లోనే బిడ్డింగ్ వేస్తానని హడావుడి చేసి సింగరేణి నుంచి బృందాన్ని కూడా పంపి తరువాత కేసీఆర్ చేతులెత్తేసిన విషయం గుర్తులేదా అని నెటిజన్లు మంత్రి మల్లారెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు.
అయితే జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్బవించిన ఇంత కాలానికి కూడా ఏపీలో ఒక్కటంటే ఒక్క సభ నిర్వహించని బీఆర్ఎస్ ఎప్పుడో ఏడాది తరువాత రాబోయే ఎన్నికలలో విజయం గురించి గప్పాలు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపితే చాలని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. చిన్న గీతను పెద్దది చేయడానికి దాని పక్కన చిన్న గీత గీసినట్లుగా.. తెలంగాణ మంత్రులు ఏపీని, అక్కడి ప్రభుత్వ వైఫల్యాలనూ ఉపయోగించుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.