తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రేబిస్ కేసులు
posted on Jul 24, 2023 @ 11:34AM
రేబిస్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతుంది. ఇటీవలె తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ యువతి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిడతారని భయపడ్డ ఓ బాలుడు ఆరు నెలల తరువాత రేబీస్ సోకడంతో మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. తేలు ఓంసాయి అనే 17 ఏళ్ల బాలుడిని ఆరు నెలల క్రితం వీధి కుక్క కరిచింది. కానీ అతడు ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు తాగలేకపోయిన బాలుడు నీళ్లను చూస్తే భయపడటం ప్రారంభించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని కాకినాడు జీజీహెచ్‌లో చేర్చారు. వ్యాధి ముదరడంతో వైద్యం ఫలించక బాలుడు మృతిచెందాడు. చేతికంది వస్తాడనుకున్న కొడుకు ఇలా హఠాన్మరణం చెందడంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది.
కుక్క కాటుకు గురైన రోజునే యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌తో పాటూ టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తరువాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజు టీకా తీసుకుంటే రేబీస్ వ్యాధి ముప్పు తప్పిపోతుందని చెప్పారు.
రేబిస్ వచ్చిన వారికి అసాధరణ వ్యవహార శైలి ఉంటుంది. రేబిస్ ముదిరితే రెండు నుంచి 10 రోజుల్లో మృతి చెందవచ్చు. ఎక్కువ శాతం మరణాలు ఉంటాయని వైద్యులు తేల్చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రేబిస్ వ్యాధి వచ్చిన వారికి నరాల వ్యవస్థ కుంటుపడుతోంది. మెదడు నుంచి వెన్నుపూస వరకు నరాల వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
రక్తం నుండి మీ మెదడులోకి టాక్సిన్స్ , ఇతర ప్రమాదకరమైన పదార్థాలు రాకుండా చేయడం వల్ల మీ మెదడును రక్షించబడుతుంది.
అయితే రేబిస్ సోకితే ఈ విషపదార్థాలు నేరుగా మెదడులోకి వెళ్లి మరణం సంభవిస్తుంది. కాబట్టి దానిని నాశనం చేసే మందులు వాడాల్సి ఉంటుంది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేబిస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఫీవర్ హాస్పిటల్ సూపరిండెంట్ చెబుతున్నారు. రేబిస్ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పోలిస్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.