చీలికలు పీలికలుగా తెలంగాణ బీజేపీ
posted on Jul 22, 2023 @ 4:43PM
సిద్ధాంతానికి, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ పరిస్థితి తెలంగాణలో మాత్రం ఇతర పార్టీలకు ఏ మాత్రం భిన్నం కాదు అనేలా తయారైంది. పార్టీలో ఎవరి దారి వారిదే.. ఎవరి మాట వారిదే అన్నట్లుగా తయారైంది. గ్రూపు తగాదాలు, అసమ్మతి గళాలు, అసంతృప్తి జ్వాలలతో ఆ పార్టీ తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసి అదే వేగంతో నేలకు పడిన కెరటంగా మారింది. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఇంతగా పతనావస్థకు చేరడానికి రాష్ట్రంలో గ్రూపు తగాదాలను స్వయంగా పార్టీ అధిష్ఠానం పెంచి పోషించడమే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితి కప్పల తక్కెడగా తయారైంది. ఒక్కో నాయకుడిదీ ఒక్కో గ్రూపు అన్నట్లుగా పార్టీ రాష్ట్రంలో చీలికలు పీలికిలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. పార్టీ రాష్ట్ర నేతలు అధిష్ఠానం పిలుపు మేరుకు, లేదా వారంతట వారు హస్తిన వెళ్లి మరీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాముఖంగా వెల్లడించారు. ఆ సభ పార్టీలోని గ్రూపు తగాదాలను కళ్లకు కట్టింది. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి చేసేది చేయగలిగిందీ ఏమీ లేదని తేటతెల్లం చేసింది. ఈ సభ ఇలా రసాబాసగా మారిన వెంటనే హై కమాండ్ రంగంలోకి దిగింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మళ్లీ బండి సంజయ్ కే అక్షింతలు వేసింది.
అవమానాన్ని పంటి బిగువున భరిస్తూ ఇంత కాలం నెట్టుకొచ్చిన ఆయన మళ్లీ అధిష్ఠానం తననే తప్పు పట్టడంతో తన అసంతృప్తిని దాచుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసి బన్సల్ తో సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. కిషన్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తాననీ, పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అందరూ పని చేయాలని పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తనను తప్పించిన తరువాత కూడా చెబుతూ వస్తున్న బండి ఇకపై ఆ మాట అనే అవకాశాలు లేకపోవచ్చునని అంటున్నారు. ఇక పరిశీలకులైతే అయితే ఆయన కమలం గూటిని వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
అందుకు నేడో రేపో పార్టీ నుంచి వీడుతారని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బండికి మద్దతుగా మాట్లడడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత నుంచీ ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఇమడలేక ఎప్పుడు బయటకు వద్దామా అని ఎదురు చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. అయినా ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తనను కాదని రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడమేనని అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇక కోమటిరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు గణనీయంగా మారాయి. అప్పట్లో రేవంత్ కు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన అసంతృప్తి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు తెరవేనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారని బీజేపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఈ తరుణంలో కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బండి ప్రసంగం, దానికి కోమటిరెడ్డి మద్దతు పలకడం చూస్తుంటే.. బీజేపీకి రాష్ట్రంలో మరో గట్టి షాక్ తప్పదన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.