బీఆర్ఎస్ గూటికి రాజాసింగ్?
posted on Jul 24, 2023 @ 3:03PM
జంటనగరాల్లో బీజేపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గోషా మహల్ మాత్రమే. అయితే వచ్చే ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో బీజేపీ విజయంపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గోషామహల్ నుంచి బీజేపీ వరుస విజయాలకు కారణం ఆ నియోజకవర్గంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉన్న పట్టుమాత్రమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయనను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నాటి నుంచి గోషామహల్ లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.
రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఈటల వంటి వారు ఆయనను కలిస్తే కూడా పార్టీ హైకమాండ్ సహించే పరిస్థితి లేకపోవడంతో రాజాసింగ్ బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ గా నిలబడతారా? లేక మరో పార్టీ గూటికి చేరుతారా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ లేదు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమనీ, బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదనీ అంటున్నారు. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గంలో విజయం కోసం కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.
ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. ఆదివారం ఘోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల నేపథ్యంలో ఘోషామహల్ లో బీఆర్ఎస్ పాగాకు కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రచించారన్న చర్చ గులాబి శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఈ రెండు భేటీల నేపథ్యంలో బీజేపీ కూడా రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమన్న భావనకు వచ్చేసి అక్కడ ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించిందంటున్నారు. హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ తరువాతనే బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల కూడా రాజాసింగ్ తో భేటీ అయ్యారు. పార్టీ మారవద్దు సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని చెప్పడానికే ఈటల ఆయనను కలిశారని అంటున్నారు.
అయితే రాజాసింగ్ తో భేటీ కావడంపై బీజేపీ అధిష్ఠానం ఈటలను మందలించారు. దీంతో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును ఎత్తివేసే ఉద్దేశమేదీ బీజేపీ హైకమాండ్ లో లేదని స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఘోషా మహల్ నుంచి ముచ్చటగా మూడో సారి అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించాలన్నది రాజాసింగ్ లక్ష్యంగా చెబుతున్నారు. పైకి పార్టీ మారేది లేదని ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా బీఆర్ఎస్ లేదా మరో పార్టీ గూటికి చేరేందుకు రాజాసింగ్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు.