స్పీడ్ న్యూస్ 1
posted on Jul 24, 2023 @ 10:48AM
మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహానికి శంకుస్థాపన
1. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహనిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాశంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా అమిత్ షా పేర్కొన్నారు.
...............................................................................................................................................................
రామచంద్రయాదవ్ కొత్త పార్టీ
2. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. భారత చైతన్య యువజన పార్టీ బీసీవైగా ఆ పార్టీకి నామకరణం చేశారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆదివారం (జూలై23)న నిర్వహించిన ప్రజా సింహగర్జన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు.
.........................................................................................................................................................
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద
3. ధవళేశ్వరం వద్ద గోదవరి వరద నీటితో ఉరకలెత్తుతోంది. ఎ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
........................................................................................................................................................
పొత్తులపై హై కమాండ్ దే తుది నిర్ణయం: పురందేశ్వరి
4. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తుల విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలోని ఏడు జిల్లాల జోనల్ సమావేశం కోసం పురందేశ్వరి ఆదివారం ప్రొద్దుటూరు వచ్చిన పురంధేశ్వరి పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు.
....................................................................................................................................................
ఏపీలో భారీ వర్షాలు
5. ఏపీలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవన ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసొగడం, దానికి తోడు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
..........................................................................................................................................................
అభివృద్ధి, సంక్షేమం చూసి బీఆర్ఎస్ లోకి వలసలు: గంగుల
6. సంక్షేమం, అభివృద్ది చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ చిల్లా ఎలపోతారు గ్రామానికి చెందిన యువకులు ఆయన సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.
.....................................................................................................................................................
వీఆర్ఏ వ్యవస్థ రద్దు
7.వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం(జూలై 24) విడుదల చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
......................................................................................................................................................
తెలంగాణలో తెలుగుదేశంకు పూర్వ వైభవం: కాసాని
8.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ అన్నారు. బాలాపూర్ చౌరస్తాలోనీ ఎస్ ఎల్ ఎస్ ఎన్ కాలనీలోని టిడిపి మహేశ్వరం నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో పార్టీకి ప్రజల ఆదరణ, కార్యకర్తల బలం మెండుగా ఉన్నాయన్నారు.
..........................................................................................................................................................
ప్లై ఓవర్ పై నుంచి పడి యువకుడి మృతి
9. అతి వేగం ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. టూవీలర్ పై అతి వేగంగా వెళుతూ గచ్చిబౌలీ ఫ్లైఓవర్ పైనుంచి పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా టూవీలర్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడ్డారు. వీరిలో ఒకరు మరణించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
........................................................................................................................................................
ప్రేమికుడి కోసం పాక్ కు వివాహిత
10. ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం ఇంకా వార్తల్లో ఉండగానే భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన వివాహిత ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన పాక్ యువకుడి కోసం సరిహద్దు దాటి వెళ్లింది.