మళ్లీ తొడకొట్టి మీసం తిప్పాడు!
posted on Jul 22, 2023 @ 2:29PM
వైసీపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. జులై 21న ట్విట్టర్ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆంగ్లంలో ఇలా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పాతపడిన, విస్మరించిన అంశం కాదని.. కేంద్ర ప్రభుత్వం, అందులోని భాగస్వామ్య రాజకీయ పక్షాల వద్ద ఈ అంశాన్ని వైసీపీ ఎంపీలు లేవనెత్తడమే కాకుండా.. ఆయా రాజకీయ పార్టీలకు తరచూ గుర్తు చేస్తున్నారని.. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది మిగిలిన రాజకీయ పార్టీలకు ఓ ఎన్నికల స్టంట్ అయితే.. తమ పార్టీకి మాత్రం భావోద్వేగ సమస్య అని పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం కూడా లేదనీ, అప్పుడే ఏ2 రాజకీయ నవ మోసాలకు తెర తీశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంపై మీ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారో.. మీకు గుర్తు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో.. అందులోని భాగస్వామ్య పక్షాల వద్ద ఈ అంశాన్ని మీ పార్టీ ఎంపీలు.. లేవనెత్తుతోన్నారని మీరు చెబుతున్నారని... ఈ విషయాన్ని మమ్మల్ని నమ్మమంటారా? అంటూ చురకలంటిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు.. పాదయాత్రలో 25కి 25 మంది ఎంపీలను ఇస్తే.. ఢిల్లీలో గద్దెనెక్కిన వారి మెడలు వంచి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని ప్రకటించిన వైయస్ జగన్... ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన తర్వాత జగన్ ఆ ఢిల్లీ పెద్దల ఎదుట మెడలు ఎలా వంచుకుంటున్నారో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో అందరూ చూశారని సెటైర్లు వేస్తున్నారు. అయినా ఈ నాలుగున్నరేళ్లో రాష్ట్రం కోసం ఎంతగా.. ఎంత మేరకు పోరాటం చేశారో.. అందరూ చూశారని వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి.. అటు పాదయాత్రలో.. ఇటు ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకొని... గద్దెనెక్కి.. నాడు ఇచ్చిన హామీల అంశాన్ని మరిచి పోవడమే కాకుండా.. మీ మాటలను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు సైతం పంగనామాలు పెట్టిన ఘనులు మీరంటూ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌తోపాటు విజయసాయిరెడ్డిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
అంతదాకా ఎందుకు.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను.. కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ఎదురుగా నిలబడి.. అడిగే సత్తా, దమ్ము మీకు ఉందా? అని జగన్ అండ్ కోకి వారు నేరుగా సవాల్ విసురుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులు తీసుకు రావడంతో చేతులెత్తేసిన మీరు.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడుతున్నారంటే.. మేము నమ్మాలా? అని నిలదీస్తున్నారు.
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. తన పార్టీ గె విజయం కోసం సహకరించిన గులాబీ బాస్‌కు ధన్యవాదాలు తెలపడమే కాకుండా.. క్విడ్ ప్రో కోలో భాగంగా.. హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలకు సైతం కేసీఆర్‌కు ధారదత్తం చేయడం... దీంతో ఆ కారు పార్టీ అధినేత.. సదరు సచివాలయాన్ని కుప్పకూల్చి.. హుస్సేన్ సాగర్ ఎదురుగా ఇంకా చెప్పాలంటే.. రివర్ ప్రెంట్ మాదిరిగా భారీ సచివాలయాన్ని సైతం నిర్మించారని.. ఈ విషయం అయినా మీకు, మీ పార్టీ ప్రజా ప్రతినిధులకు గుర్తు ఉందా? లేదా? అంటూ వీరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నాలుగున్నరేళ్లలో ఏపీలో పరిస్థితులు ఏంతగా దిగజారాయో.. అందరికీ తెలిసిందేనని .. అయినా 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున గెలిచిన లోక్‌సభ సభ్యులు ఎంత మంది.. వారి పేర్లు చెప్పమంటే చెప్పగలిగే స్థితిలో ఏపీ ప్రజలు దాదాపుగా లేరని.. మహా అయితే.. జగన్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీల్లో ప్రజలకు బాగా తెలిసిన వారు వెళ్ల మీద లెక్కపెట్టవలసి ఉంటుందని.. అందులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తప్ప మిగిలిన వారు ఎవరంటే.. చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని... అదీకాక జగన్ సీఎంగా గద్దెనెక్కిన ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్... పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని.. ఆయన అలా వెళ్లిన ప్రతీ సారి ఏపీకి హోదా కోసమే అని దేశ రాజధానికి వెళ్లారని చెప్పినా చెప్పగల ఘటనా ఘటన సమర్థులు మీరంతా అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
జగన్ ఎప్పుడు దేశ రాజధాని హస్తినకు ప్రయాణం కట్టినా.. సోదరుడు కడప ఎంపీ అవినాస్ రెడ్డి కోస కోసమే అనే ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో వెరైటీ కామెంట్లతో వెల్లువెత్తుతోందని.. ఈ విషయాన్ని అయినా మీరు గమించి.. ఖండించిన దాఖలాలు అయితే నేటికి లేవని విజయసాయిరెడ్డికి నెటిజన్లు సూచిస్తున్నారు.
అయినా మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలి. అలా అందుకోవాలంటే.. ప్రజలతో, వారి మనోభావాలతో ముడి పడి ఉన్న అంశాలను.. మళ్లీ బయటకు తీసి.. సోషల్ మీడియా వేదికగా రోజుకు కొంత మోతాదులో డోస్.. పోస్ట్ చేస్తూ.. ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి... అలా అయితేనే.. మనం అనుకున్న కార్యక్రమం.. మనం అనుకున్నట్లుగా వర్క్ అవుట్ అవుతుందని.. ఆ క్రమంలోనే.. మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని విజయసాయిరెడ్డి ఇలా తెరపైకి తీసుకు వచ్చారని నెటిజన్లు ఓ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.