మణిపూర్ హింసాకాండ.. నాకేం సంబంధం విలేకరులపై కిషన్ రెడ్డి అసహనం
posted on Jul 22, 2023 @ 6:04PM
మణిపూర్ లో హింసాకాండపై బీజేపీ వైఖరి ఎలా ఉందన్నది కిషన్ రెడ్డి తన అసహనం ద్వారా తేటతెల్లం చేశారు. నెలల తరబడి ఆ రాష్ట్రం హింసాజ్వాలలో తగలడిపోతున్నా.. ఇంత వరకూ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదు. అదేదో దేశానికి సంబంధించిన సమస్య కాదన్నట్లుగా వదిలేశారు. ఆ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోని వచ్చి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమైన తరువాత, అదీ సుప్రీం కోర్టు స్వయంగా మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని వివరణ కోరిన తరువాత మోడీ నోరు విప్పి ఆ అమానవీయ ఘటనను ఖండించారు.
అయితే మణిపూర్ లో హింసాకాండను అరికట్టే విషయంలో అటు కేంద్రం ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. శాంతి భద్రతల సమస్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుంటే.. చేతులెత్తేసిన మణిపూర్ ప్రభుత్వం జరిగేది జరుగుతూనే ఉంటుందన్నట్లు మిన్నకుండిపోయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మణిపూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడకుండా సభను వాయిదా వేసి పారిపోతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మణిపూర్ విషయం తనకేం సంబంధం లేదని మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏమైనా తెలంగాణకు చెందిన ప్రాంతీయ పార్టీయా అని నిలదీస్తున్నారు.
సోమవారం (జూలై 24) లోక్ సభలో మణిపూర్ హింసాకాండపై చర్చ జరిగితే తెలంగాణ గడ్డపై నుంచి కిషన్ రెడ్డి చెప్పిన విధంగానే లోక్ సభలో కూడా ప్రభుత్వం అది తనకు సంబంధం లేని విషయం అని చెప్పగలుగుతుందా? మణిపూర్ భారత్ లో అంతర్భాగమే కదా? మరి అటువంటప్పుడు నెలల తరబడి ఆ రాష్ట్రంలో హింసాకాండ రాజ్యమేలుతుంటే.. జాతుల మధ్య ఘర్షణలో వందల సంఖ్యలో జనం నేలరాలుతుంటే కేంద్రానికి బాధ్యత లేదా? మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా కార్యాచరణ రూపొందించకుండా మౌనం వహించడమేంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.