రేపో మాపో పవన్, చంద్రబాబు భేటీ?
posted on Jul 22, 2023 @ 5:01PM
ఏపీలో ఎన్నికల మూడ్ ఎప్పుడో వచ్చేసింది. దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అధికార వైసీపీ మరోసారి అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విపక్షం ప్రజలలోకి వెడుతోంది. ఇక ఇప్పటికీ జనసేన, తెలుగుదేశంల పొత్తు విషయంలో మాత్రం సస్పెన్స్ వీడలేదు. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటున్నా పొత్తుల వ్యవహారం మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. జనసేన-బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు అయితే ఈ రెండు పార్టీలు తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అన్నవిషయంలో మాత్రం ఎడతెగని చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలలో సాగుతోంది.
జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికే జనసేనాని, ప్రభుత్వ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అనడం ద్వారా పరోక్షంగానైనా పక్కా క్లారిటీతో చెప్పేశారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య మాత్రం ఆ సంకేతాలు కనిపించడం లేదు. ఆ మధ్య హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ అవ్వడంతో దాదాపుగా పొత్తు ఖరారైనట్లేనని అప్పట్లో ఓ లెవెల్ లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ అది ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే తెలుగుదేశం,బీజేపీ కలిసే పరిస్థితి లేదనే భావనే కలుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కాలంలో తన ప్రసంగాలలో ఎక్కడా ఈ పొత్తుల ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలకు, పాత మిత్రులకూ కూడా ఆహ్వానాలు అందాయి. అయితే తెలుగుదేశంకి మాత్రం అందలేదు. అదే సమయంలో ఈ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ పొత్తులపై వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో సహజంగానే మరోసారి ఈ పొత్తుల వ్యవహారంపై ఆసక్తి మొదలైంది.
కాగా, ఢిల్లీ సమావేశానికి హాజరైన పవన్ పొత్తుల అంశంపై ఎక్కడా స్పందించడం లేదు. రాబోయే ఎన్నికలలో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా.. రెండూ కలిసి తెలుగుదేశంతో కలిసి వెళ్తాయా అన్న ఆసక్తి కొనసాగుతుండగానే పవన్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారనే సమాచారం ఒకటి బయటకు వచ్చింది. రెండు మూడు రోజుల్లోనే మూడు రోజులలోనే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం-జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారు? అనే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. ఢిల్లీ టూరులో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన పవన్.. ఆ వివరాలను చంద్రబాబుతో షేర్ చేసుకోవటంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
జనసేన ఎప్పటి నుండో బీజేపీతో కలిసే ఉంది. కానీ గడచిన నాలుగేళ్ళలో కానీ లేదా రీసెంట్ వారాహి యాత్రలో కానీ పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తెచ్చిన సందర్భం లేదు. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా జనసేనకు ఓట్లేయండి అని మాత్రమే చెబుతున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో మూడుసార్లు భేటీ అయ్యారు. కానీ, ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత మాత్రం పవన్.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించమనే కోరుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎన్డీయే అంటే బీజేపీ-జనసేన మాత్రమే. మరి ఎన్డీయేలో లేని టీడీపీ అధినేతతో పవన్ ఎందుకు కలుస్తున్నారు? ఈ భేటీలో ఏం తేల్చనున్నారు? ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయ సమీకరణాలలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.