అవిశ్వాసం వీగేనా? గెలిచేనా?
posted on Jul 26, 2023 @ 3:00PM
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభలో 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. 1963లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యులు ఆదేశిస్తేనే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3) లోక్‌సభకు మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందని పేర్కొనడం ద్వారా ఈ నియమాన్ని పొందుపరిచింది. లోక్‌సభ ఎంపీ ఎవరైనా, ఏ సమయంలోనైనా మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.అనంతరం తీర్మానంపై చర్చ జరుగుతుంది. మోషన్‌కు మద్దతు ఇచ్చే ఎంపీలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతారు. ట్రెజరీ బెంచ్‌లు వారు లేవనెత్తిన సమస్యలపై స్పందిస్తారు. చివరగా ఒక ఓటు జరుగుతుంది. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ గెలిచినట్లయితే, ప్రభుత్వం ఉన్న ఫళంగా దిగిపోవాల్సి వస్తుంది.
2018 తర్వాత మోదీ ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం.
మణిపూర్ అల్లర్లు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.
మణిపూర్‌లో పిఎం మోడీ మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడానికి బిజెపి నిరాకరించడంతో పాటు పార్లమెంటులో రోజుల తరబడి గందరగోళం నెలకొంది. బెంగుళూరులో ప్రతి పక్ష కూటమి ఇండియా ఏర్పడిన తర్వాత మొదటి అవిశ్వాస తీర్మానం ఇది.
బిజెపి కి బిటీం అని ప్రచారంలో ఉన్న బిఆర్ఎస్ కూడా అవిశ్వా స తీర్మానానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది.బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇచ్చారు. ఇందుకోసం ముసాయిదా తీర్మానం కూడా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. లోక్ సభలో బలాబలాలు చూస్తే.. ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్ధతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ విషయం ప్రతిపక్ష పార్టీలకూ తెలుసని అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వెనక వాటి ఉద్దేశం వేరని అంటున్నారు. మణిపూర్ అల్లర్లు, హింసపై చర్చించేందుకే ప్రతిపక్షాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం వస్తుందని, ఆ చర్చలో పలు అంశాలను లేవనెత్తేందుకు తమకు అవకాశం లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు.