వివేకా హత్య కేసుతో సజ్జలకేం పని
posted on Jul 26, 2023 @ 6:28PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది? శిక్ష ఎవరికి పడుతుంది? ఎప్పటికి తీర్పు వస్తుంది? అన్న విషయాలను పక్కన పెడితే.. సీబీఐ దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్.. అందులోని అంశాలు, సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రభుత్వం, పోలీసుల అండతో అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కర్నాలులో సృష్టించిన అరాచకం వీటన్నిటినీ బట్టి హత్య ఎందుకు జరిగిది? ఎలా జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు అన్న విషయంలో ప్రజలకు సందేహాలకు అతీతంగా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషించి మరీ చెబుతున్నారు.
సీబీఐ చార్జిషీట్ తో వెలుగులోకి వచ్చిన అంశాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ కుమార్ దర్యాప్తును సమీక్షించాలంటూ అవినాష్ రెడ్డి లేఖ.. వివేకా హత్య వల్ల నష్టపోయినది జగనేనంటూ సజ్జల పెట్టిన ప్రెస్ మీట్ పై దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందంటూ నెటిజన్ లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఏపీ సీఎం సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగు చూసిన తరువాత వివేకా హత్య కు మోటివ్ ఏమిటన్న విషయంలోనూ సందేహాలకు తావులేకుండా పోయిందని అంటున్నారు. ఇంతకీ వివేకా హత్య కేసు విషయంలో డాక్టర్ సునీత సీబీఐకు ఏం చెప్పారంటే.. తన తండ్రి హత్య విషయంలోతాను మీడియాతో ఏం మాట్లాడాలన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించాలని వైఎస్ జగన్ సతీమణి భారతి తనకు చెప్పారనీ, అది తనకు కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ అంగీకరించాననీ, సజ్జల ప్రెస్ మీట్ లో జగన్ తో పాటు అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని సలహా ఇవ్వడంతో తనకు అనుమానం వచ్చిందనీ సునీత పేర్కొన్నారు.
సునీత, సజ్జల స్వయంగా తన ఇంటికి వచ్చి మరీ ఈ విషయం చెప్పారని సునీత పేర్కొన్నారు. ఆ తరువాత సజ్జల ఈ అంశానికి ముగింపు పడేలా ప్రెస్‌మీట్ పెట్టాలని దాని తరువాత ఈ అంశంపై మరింత చర్చ జరగే అవకాశం ఉండకూదని సూచించారని సునీత వివరించారు. 2019లో జరిగిన ఈ విషయాలన్నీ సునీత వాంగ్మూలంలో ఉన్నాయి. ఇవి సీబీఐ కోర్టుకు సమర్పించడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చా యి. అలా బయటకు రాగానే జగన్ కోటరీలో కంగారు మొదలైంది. యథా ప్రకారం ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి మీడియా ముందుకు వచ్చి.. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కు ఉన్న ఇంగితం కూడా సీబీఐకి లేకుండా పోయిందంటూ.. తన దైన స్టైల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ వివేకా హత్యకేసును ఎలా దర్యాప్తు చేసి ఉండాల్సిందో చెప్పుకొచ్చేశారు. వైసీపీ అధినేత జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా ఆయన పార్టీ నేతలంతా తెలుగుదేశం అధినేత జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని తరచూ విమర్శలు గుప్పిస్తారు.. అయితే వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేలా.. జగన్ అండ్ కో వ్యవహరించిన తీరు ఆ దర్యాప్తు సంస్థపై ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందో.. అందరూ ప్రత్యక్షంగా చూశారని పరిశీలకులు సోదాహరణగా విమర్శిస్తున్నారు. కడప జిల్లాలో దర్యాప్తు అధికారుల కదలికలను సైతం వివేకా హత్య కేసు నిందితులు ప్రభుత్వం, పోలీసుల అండతో ఎలా నియంత్రించారో అందరికీ తెలిసిందే.
దీంతో ఏపీలో కేసు దర్యాప్తు తీరు సరిగ్గా సాగే అవకాశాలు లేవంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ తెలంగాణకు మార్పించారు. ఏపీలో దర్యాప్తు ముందుకు సాగదన్న సునీత వాదనను సీబీఐ కూడా సుప్రీంలో సమర్ధించింది. ఇక కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తులో పురోగతి సాధించినప్పటికీ.. దర్యాప్తు అధికారిపై వరుస ఆరోపణలతో హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారి మారడం వెనుక అవినాష్ ప్రభృతుల ఒత్తిడి ఉందన్న వాదన చాలా చాలా బలంగా వినిపించింది. సరే మొత్తం మీద అవినాష్ రెడ్డి ఇంత వరకూ అరెస్టు కాకుండా ఉండటం వెనుక మేనేజింగ్ స్కిల్స్ పాత్ర ఉందన్నది విశ్లేషకుల మాట. పదే పదే కోర్టులను ఆశ్రయించడం, దర్యాప్తు సంస్థలపైనా, వివేకాహత్య కేసులో బాధితులపైనా పదే పదే ఆరోపణలు చేయడం ద్వారా వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా దర్యాప్తును ఏళ్లబడి సాగదీయగలగారని అంటున్నారు.
ఇన్ని చేసినా సీబీఐ చార్జిషీట్ లో విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగారు.. నాలుగేళ్ల కిందట తాను భారతికి ఫోన్ చేసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని కొత్త కథ అల్లుతున్నారని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాకుండా వివేకా హత్యకు గురికావడం వల్ల నష్టపోయినది జగనే అని చెప్పడానికి శతధా ప్రయత్నించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూవాడా ఏకం చేసిన సంగతిని విస్మరించి.. ఈ నాలుగేళ్లలో వివేకా హత్యకు కారణాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తదితరులు ఎన్ని అంశాలను తెరమీదకు తెచ్చారో తెలిసిందేననీ, ఇప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. వివేకా హత్య వల్ల నష్టపోయింది జగనేనంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.
సజ్జల అయినా.. అవినాష్ రెడ్డి అయినా ఏదైనా చెప్పుకోదలచుకుంటే కోర్టుకు చెప్పుకోవచ్చు. కానీ కోర్టుల ఎదుట చెప్పుకునే అవకాశాన్ని కాదనుకుని మరీ మీడియా ముందుకు ఎదుకు వస్తున్నారని న్యాయనిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇంతా చేసి సునీత వాంగ్మూలం బయటకు వచ్చిన తరువాత సజ్జల గంట సేపు ప్రెస్ మీట్ లో చెప్పినదేమిటంటే.. వివేకా గౌరవాన్ని.. పరువు ప్రతిష్టలను కాపాడటానికి తాము ప్రయత్నిస్తున్నామని మాత్రమే. సునీత దంపతులే హంతకులనీ, వివేకా స్త్రీలోలుడనీ నిందలేస్తూ ఇంత కాలం ప్రచారం చేసిందెవరో జనం అప్పుడే మరిచిపోయి ఉంటారని సజ్జల ఎలా భావించారన్న ఆశ్చర్యం అందరిలో వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమంలో అయితే సజ్జల ప్రెస్ మీట్ ప్రసంగంపై ఓ రేంజ్ లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో నిందితులెవరన్నది ఇప్పుడు రహస్యం కాదనీ, కేవలం కోర్టులు శిక్ష విధించడమే మిగిలిందని నెటిజన్లు అంటున్నారు.