స్నేహానికి ప్రతీక ముసారాం బాగ్ బ్రిడ్జి
posted on Jul 26, 2023 @ 1:22PM
హైదరాబాద్ లో ఉన్న అతి పురాతన బ్రిడ్జిలలో ముసారాం బ్రిడ్జి ఒకటి. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జి మీద రాకపోకలు ఇంకా కొనసాగుతున్నాయంటే ఆశ్యర్యమే. బ్రిడ్జి మీద రాకపోకలు సాగించకూడదని ఇప్పటికే ఆర్కియాలజీ శాఖ హెచ్చరించింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్ లోని అతి పురాతనమైనభ ముసారాంబ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. నిజాంలకు సేవ చేసిన ఫ్రెంచ్ మిలిటరీ కమాండర్ మోన్సియర్ రేమండ్. ఆయన చనిపోయాక అస్మాన్ ఘర్ ప్యాలెస్ సమీపంలో ఖననం చేశారు. ప్రస్తుతం అక్కడే రేమండ్ సమాధి ఉంది. అతని సేవలను గుర్తించి మూసా-రామ్-బాగ్ ప్రాంతానికి ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ పేరు పెట్టారు. ఇందులో బాగ్ అంటే ఒక ఉద్యానవనం అని అర్థం. ఒకప్పుడు ముసారాంబాగ్ భారీ పచ్చదనంతో నిండి ఉండేది.ముసారాంబాగ్ బ్రిడ్జి 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ మోన్సియర్ రేమండ్ 18వ శతాబ్దంలో నిజాం రాజుకు అత్యంత సన్నిహిత మిత్రుడు.
రేమండ్ రెండవ అసఫ్ జా నిజాం అలీ ఖాన్‌తో మమేకమయ్యాడు. రేమండ్‌ను రెండో నిజాం ఉన్నతంగా గౌరవించేవాడు. స్థానిక ప్రజల ప్రేమ , విశ్వాసాన్ని చూరగొన్నాడు రేమండ్.
ముస్లింలు రేమండ్ ను మూసా రహీమ్ అని, హిందువులు మాత్రం ముసారామ్ అని పిలుచుకునే వారు. ప్రస్తుతం ముసారాంబాగ్ బ్రిడ్జి ఈ పేరుతోనే పిలవబడుతుంది.
భారీ వర్షాలే కారణం
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది. ఎక్కడిక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో హైదరాబాదీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే బ్రిడ్జికి ఆనుకొని మూసి వరద ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్ నుంచి నీళ్ళు వదలడంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు అంటూ ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిడ్జిపై నుండి వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నీటి ప్రవాహం పెరిగితే వాహనాలు రాకపోకలను నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.